మహిళను మోసగించిన వ్యక్తిని...

27 Jun, 2019 11:00 IST|Sakshi

సాక్షి, గాజువాక(విశాఖపట్నం) : భర్తలేని ఒక వివాహితను ప్రేమ పేరుతో మోసగించిన వ్యక్తిని న్యూపోర్టు పోలీసులు బుధవారం రిమాండ్‌కు తరలించారు. న్యూపోర్టు పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. చోడవరం మండలం అన్నవరం వీధికి చెందిన బద్దిదేవి వరలక్ష్మీ శిరీష గాజువాక ప్రాంతంలో ఒక దినపత్రికలో విలేకరిగా పని చేస్తోంది. స్థానిక పల్లావారి మామిడితోట సమీపంలోని వినాయకనగర్‌లో పిల్లలతో కలిసి నివాసముంటోంది. ఎనిమిది నెలల క్రితం ఆమె భర్త మృతి చెందాడు. దీంతో ఒక ప్రైవేట్‌ ఛానెల్‌ విలేకరిగా పని చేస్తున్న నాసన సంతోష్‌ కుమార్‌ ఆమెను ప్రేమిస్తున్నానని నమ్మించాడు. గత ఏడాది డిసెంబర్‌ మొదటి వారంలో ఆమె ఇంటికి వెళ్లి వివాహం చేసుకుంటానని చెప్పాడు. అయితే, తన తల్లి ఈ వివాహానికి ఒప్పుకోవడంలేదని, తరువాత మెల్లగా ఒప్పిస్తానన్నాడు. నుదుటిపై సింధూరం పెట్టి వివాహం చేసేసుకున్నట్టేనని నమ్మించాడు. అప్పట్నుంచి శారీరక సంబంధం కొనసాగిస్తున్నాడు. అప్పటికే ఇద్దరు ఆడ పిల్లలకు తల్లి అయిన శిరీషను మగబిడ్డను కని తనకు ఇవ్వాలని కోరాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గర్భం దాల్చిన వివాహితపై ఒత్తిడి తెచ్చి మాత్రలతో గర్భస్రావం చేయించాడు.

ఈ క్రమంలో అతడు ఆమె వద్దే ఉండేవాడు. దీంతో సంతోష్‌ తల్లి, అక్కలు, బావలు, ఇతర బంధువులు ఆ ఇంటికి రాకపోకలు సాగిస్తుండేవారు. వారి వివాహానికి అంగీకరించి సేవలను చేయించుకొనేవారు. కాగా, శిరీషకు తెలియకుండానే మే 27న వేరే యువతిని వివాహం చేసుకునేందుకు పెళ్లి చూపులకు సంతోష్‌ వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న శిరీష అతడిని నిలదీయడంతో అదే నెల 31న గొడవపడి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతడిని కలవడానికి వివాహిత ఎన్నిసార్లు ప్రయత్నంచినా సాధ్యం కాలేదు. చివరకు ఈ నెల 20న ఆమెకు ఫోన్‌ చేసి తనను కలవడానికి ప్రయత్నం చేయవద్దని స్పష్టం చేశాడు. ఆమెను వివాహం చేసుకోనని, ఈ విషయంలో ఒత్తిడి చేస్తే ఆమెను, పిల్లలను చంపేస్తానని, ఆమె బంధువులకు ఫోన్‌ చేసి అవమానాలకు గురి చేస్తానని బెదిరించాడు. దీంతో మోసపోయానని భావించిన శిరీష న్యూపోర్టు పోలీసులను ఆశ్రయించింది. తనను మోసం చేసిన సంతోష్‌ కుమార్‌ను, అతడికి సహకరించిన కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై కేసు నమోదు చేసిన సీఐ సంజీవరావు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.  

మరిన్ని వార్తలు