సెల్ఫీ వీడియో..ఆపై ఆత్మహత్య

30 Dec, 2019 03:59 IST|Sakshi

భార్యా, భర్తల మధ్య వివాదంతో కౌన్సెలింగ్‌ నిర్వహించిన పోలీసులు

నెల్లూరు జిల్లా పోలీసులు వేధిస్తున్నారంటూ వివాహితుని సెల్ఫీ వీడియో

భార్యకు ముందే తెలిపి భర్త ఆత్మహత్య

కందుకూరు: తనను పోలీసులు వేధిస్తున్నారంటూ మనస్తాపానికి గురైన ఓ యువకుడు తన ఆత్మహత్యకు గల కారణాలను తెలుపుతూ సెల్ఫీ వీడియో తీసుకుని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... ప్రకాశం జిల్లా కందుకూరు మండలం బూడిపాలేనికి చెందిన సయ్యద్‌ జహీర్‌ (31)కి పన్నెండేళ్ల క్రితం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలేనికి చెందిన జరీనా అనే యువతితో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కందుకూరు పట్టణంలోని బూడిపాలెంలో నివాసం ఉంటున్నారు. జరీనా వడ్డీ వ్యాపారం చేస్తూ భర్త జహీర్‌కు తెలియకుండా అప్పులు చేసింది. ఈ విషయమై భార్యా, భర్తల మధ్య వివాదం ఏర్పడింది. జరీనా పుట్టింటికి వెళ్లి తన భర్త, కుటుంబ సభ్యులు వేధిస్తున్నారంటూ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది.

పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్‌ చేశారు. ఈ క్రమంలో అక్కడి పోలీసుల నుంచి జహీర్‌కు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.పెద్దలు రాజీకి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పైగా జరీనా సోదరులు, తండ్రి జహీర్‌ను దూషించారు. దీంతో మనస్తాపానికి గురైన జహీర్‌ తనను బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు వేధిస్తున్నారని, భార్య తరఫు కుటుంబ సభ్యులు దూషిస్తున్నారంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. శనివారం అర్ధరాత్రి బూడిపాలెంలోని తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందాడు. ఆదివారం పోలీసులు వచ్చి అతని సెల్‌ఫోన్‌ను పరిశీలించగా ఉరికి ముందు తన ఆత్మహత్యకు గల కారణాలను చెబుతూ తీసిన సెల్ఫీ వీడియో కనిపించింది.  

ఉరివేసుకుంటున్నట్లు భార్యకు సందేశం
జహీర్‌ తాను ఉరేసుకునేందుకు చేసుకుంటున్న ఏర్పాట్లను వీడియో తీసి భార్యకు పంపి, ఫోన్లో కూడా మాట్లాడినట్లు సమాచారం. దీన్ని జరీనా పట్టించుకోలేదు. తన కొడుకు ఆత్మహత్య చేసుకునే విషయం తమకు ఏమాత్రం తెలిసినా కాపాడుకునే వాళ్లమని జహీర్‌ తండ్రి ఆరీఫ్‌ విలపించాడు.

మరిన్ని వార్తలు