మన‘బడి’కి.. మహర్దశ

4 Sep, 2018 12:11 IST|Sakshi
పాఠశాలలో విద్యార్థులు

నాడు 8 మంది ఉన్న పాఠశాలలో నేడు 88మంది విద్యార్థులు

కార్పొరేట్‌కు దీటుగా బోధన

కృష్ణమ్మ ఒడ్డున విద్యా వ్యాప్తి   

గుంటూరు, కాట్రపాడు(దాచేపల్లి): ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని వారు ఎదురు చూడలేదు. మూత పడబోతున్న పాఠశాలను చూసి మనకెందుకులే అనుకోలేదు. అందరూ ఒక్కటయ్యారు.. ఊరు ఉన్నతంగా ఉండాలనుకున్నారు. అది కేవలం చదువుతోనే సాధ్యమని నమ్మారు. విద్యార్థుల బంగారు భవితకు వారధిగా నిలిచారు. పచ్చని పొలాల మధ్య, కృష్ణమ్మ నదీ గర్భంలో దాగున్న గ్రామం కాట్రపాడు. ఈ గ్రామంలో 2015లో కేవలం 8 మంది విద్యార్థులతో ప్రభుత్వం ప్రారంభమైంది. అయితే అది మూతపడే సమయంలో గ్రామస్తులు దాని అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఈ క్రమంలో పాఠశాల నేడు 88 మందితో కళకళలాడుతోంది. గతేడాది మనబడి రాకతో పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. 

మార్చిన మనబడి..
కాట్రపాడు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల రూపురేఖలను ‘మనబడి’ మార్చేసింది. హైదరాబాద్‌కు చెందిన యర్రంరాజు రవీంద్రరాజు కాట్రపాడుకు చెందిన అనురాధను వివాహం చేసుకున్నారు. ఆయన గ్రామస్తుల్లో చైతన్యం తీసుకురావడంతో అధ్వానంగా ఉన్న పాఠశాల అభివృద్ధి పథంలో పయనిస్తోంది. పాఠశాల అభివృద్ధికి మనబడి కింద ఒక బ్యాంక్‌ అకౌంట్‌ను ప్రారంభించారు. తొలుత తన సొంత ఖర్చులతో పాఠశాలలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు రూ.3 లక్షలకుపైగా ఖర్చు చేసి బెంచీలు, కుర్చీలు ఏర్పాటు చేశారు. ఇతర గ్రామస్తుల సహకారంతో రూ1.50లక్షలతో విద్యార్థులకు యూనిఫాం, బెల్ట్, బూట్లు అందజేశారు. తరగతిలో డిజిటల్‌ బోర్డులను ఏర్పాటు చేసి విద్యబోధన జరిపిస్తున్నారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ప్రతి ఏడాది నోట్‌బుక్స్, పలకలు, పెన్నులు ఉచితంగా ఇచ్చేలా మనబడి ఏర్పాట్లు చేసింది. విద్యార్థులందరికి సురిక్షిత మంచినీటి అందిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్య్ర దినోత్సవ వేడుకలతో పాటుగా పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమాలను మనబడి ద్వారానే నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు తరగతి గదులను శుభ్రం చేసేందుకు స్విపర్‌ను కూడా పెట్టారు.

విద్యావలంటీర్ల నియామకం..
కాట్రపాడుకు 13 కిలో మీటర్ల దూరంలో ఉన్న శంకరపురం, 6 కిలో మీటర్ల దూరంలో ఉన్న భట్రుపాలెం నుంచి ఆటోల ద్వారా విద్యార్థులు పాఠశాలకు వస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ప్రభుత్వం తరఫున ఇద్దరు ఉపాధ్యాయుల పనిచేస్తున్నారు. విద్యార్థుల హజరుశాతం పెరగటంతో మనబడి ద్వారా వేతనాలను ఇస్తూ ముగ్గురు విద్యావాలంటీర్లను నియమించారు. పాఠశాలలో తరగతి గదులు సరిపొకపోవటంతో పక్కనే  ఉన్న పంచాయతీ కార్యాలయంలో తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఆ ప్రాంతంలో స్థలం కేటాయించి అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

కార్పొరేట్‌ స్థాయి విద్య అందించటమే లక్ష్యం
కాట్రపాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కార్పొరేట్‌ స్థాయి విద్యను అందించడం కోసం మనబడి స్థాపించాం. మనబడి  ద్వారా పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములుగా మారి మౌళిక వసతులను కల్పిస్తాం. ఈ పాఠశాలను పదో తరగతి వరకు అభివృద్ధి చేయాలనే ఆలోచన చేస్తున్నాం.   –యర్రంరాజు రవీంద్రరాజు, మనబడి వ్యవస్థాపకులు 

మరిన్ని వార్తలు