మాదిగలను మోసగించిన చంద్రబాబు

9 Feb, 2019 13:20 IST|Sakshi
మాట్లాడుతున్న మంద కృష్ణమాదిగ

 రాజకీయ పార్టీలన్నీ వర్గీకరణకు వ్యతిరేకం

పోరాటంతోనే జాతికి విముక్తి

19న మాదిగ విశ్వరూప సభను విజయవంతం చేయాలి

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ

కనిగిరి: ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని, సీఎం చంద్రబాబు నమ్మించి మాదిగలను నమ్మించి మోసం చేశాడని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మాదిగ విశ్వరూప మహాసభ సమాయత్త సదస్సు జి.రవికుమార్‌ మాదిగ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణమాదిగ మాట్లాడుతూ మాదిగల కార్పొరేషన్‌ ఏర్పాటుపై చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఓ వర్గం మాదిగలపై కుట్ర చేస్తోందని ఆరోపించారు. మాదిగలను అణదొక్కే క్రమంలో తీవ్ర దుష్ప్రచారం చేస్తోందన్నారు. దళిత సంక్షేమం అంటే మాలల సంక్షేమంగా మారిందని విమర్శించారు. దళితులకు సంబంధించి రాష్ట్రంలోని నాలుగు ముఖ్య విభాగాల్లో ఒక వర్గానికి చెందిన వారే ఉన్నారని ఆక్షేపించారు.

ఏపీలో 39 లక్షల మంది మాదిగలు, 41 లక్షల మంది మాలలు ఉన్నారని, మిగిలిన ఉపకులాలు 6 లక్షల మంది ఉన్నట్లు చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, దళిత, క్రైస్తవ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు ఎస్సీలకు ఉన్నా మాదిగలను నియమంచలేదని ధ్వజమెత్తారు. తెలంగాణలో మూడు ఎంపీ స్థానాల్లో రెండు మాదిగలకు, ఒకటి మాలలకు ఇచ్చారని, ఏపీలో మాత్రం నాలుగు ఎంపీ స్థానాలు మాలలకు కేటాయిస్తున్నారన్నారు. మాదిగల వాణి పార్లమెంట్‌లో వినిపించకుండా పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మాదిగల జాతి భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ చట్ట బద్ధతకు 25 ఏళ్లుగా పోరాటం చేస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణతోనే మాదిగల అభ్యున్నతి సాధ్యమవుతుందన్నారు. ఏపీలో మాదిగలు లేరని దుష్ప్రచారం చేసే రాజకీయ పార్టీలకు గుండెలు అదిరేలా మరో మాదిగ విశ్వరూప మహాసభ ఈ నెల 19న అమరావతిలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జాతి విముక్తి పోరాటంతోనే సాధ్యమన్నారు. మరో విశ్వరూప మహాసభకు మాదిగలు అన్ని గ్రామాల నుంచి అధిక సంఖ్యలో తరలి వచ్చి సత్తా చాటాలని మంద కృష్ణ పిలుపు ఇచ్చారు. జెడ్పీటీసీ దంతులూరి ప్రకాశం మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధన పోరాటంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. మాదిగల విశ్వరూప సభను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు సూరేపోగు శ్యామ్, వర్లా దేవదాసు, రావినూతల చంద్ర, వి. క్రిష్టాఫర్, పి.లక్ష్మణ్, రావినూతల కొటయ్య, బి.నరేష్, బంకా ఏబు, జి.భాస్కర్, టి.నవకుమార్, అగస్టీన్, ఎబ్నేజర్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు