కాంట్రాక్టర్ చెరలో టీటీడీ కల్యాణ మండపం

2 Jun, 2014 01:25 IST|Sakshi
  • ఆదాయం రూ.లక్షల్లో.. టీటీడీకి చేరేది వేలల్లో
  •  విధులకు హాజరుకాని అధికారి
  •  రూ.లక్షలు గడిస్తున్న కాంట్రాక్టర్
  •  నందిగామ, న్యూస్‌లైన్  : పేద, మధ్య తరగతి ప్రజలకు సైతం అందుబాటులో ఉండేలా నిర్మించిన టీటీడీ కల్యాణ మండపం అక్రమార్కుల చెరలో చిక్కుకుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నంది గామ టీటీడీ కల్యాణం మండపం నిర్వహణ బాధ్యతలు చూసే అధికారి, ఓ కాంట్రాక్టర్ కలిసి ఏటా రూ.50 లక్షల ఆదాయం పొందుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

    కల్యాణ మండపాన్ని రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన టీటీడీ దేవస్థానానికి మాత్రం వేలల్లోనే ఆదాయం అందుతోంది. పట్టణంలో రెండు దశాబ్దాల క్రితం టీటీడీ కల్యాణ మండపాన్ని నిర్మించారు. అప్పట్లో కొంత కాలం దాని నిర్వహణ బాగుంది. ఆ తరువాత టీటీడీ అధికారులు మండపం నిర్వహణను లీజుకు ఇచ్చారు. లీజ్ ముగిసిన తరువాత నాలుగేళ్లు టీటీడీ ఆధ్వర్యంలోనే కల్యాణమండపం నడిచింది. దీని బాధ్యతలు చూసేందుకు ఓ అధికారిని నియమించారు. అయితే ఆ అధికారి కల్యాణ మండపం నిర్వహణ బాధ్యతలను ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఆ అధికారి నందిగామ వచ్చి ఏడాది గడిచిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
     
    పేద, మధ్య తరగతి వారు శుభకార్యాలు నిర్వహించుకునేందుకు అందుబాటులో ఉండేలా రోజుకు కేవలం రూ.1500 అద్దెకే కల్యాణ మండపాన్ని ఇచ్చేలా టీటీడీ దేవస్థానం నిర్ణయించింది. అయితే ప్రస్తుతం కల్యాణ మండపం బాధ్యతలు చూస్తున్న అధికారి రోజుకు రూ.10 వేల చొప్పున వసూలు చేస్తున్నారని అద్దెకు తీసుకున్నవారు ఆరోపిస్తున్నారు. శుభకార్యాల కోసం అద్దెకు తీసుకున్న వారు తమ స్థాయికి తగ్గట్టుగా విద్యుత్ దీపాలంకరణ, మండప అలంకరణలు చేసుకుం టారు.

    అయితే కాంట్రాక్టర్ మాత్రం ఈ అలంకరణ పేరిట లక్ష రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. శాశ్వతంగా ఉండేలా విద్యుత్ దీపాల అలంకరణ ఏర్పాట్లు చేసున్న కాంట్రాక్టర్ ఇతర అలంకరణ కాంట్రాక్టర్లను ఇక్కడికి రానివ్వడంలేదు. ఈ కల్యాణమండపం బాధ్యతలు చూడాల్సిన అధికారి అద్దెకు తీసుకునేవారికి అందుబాటులో ఉండటంలేదు.

    కనీసం ఫోన్ నంబరు కూడా ఎవరికీ ఇవ్వడంలేదు. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల మండపాన్ని బుక్ చేసేందుకు ఆ అధికారిని సంప్రదించారు. అయితే ఆ అధికారి సూచనల మేరకు కాంట్రాక్టర్‌ను కలవగా ఆయన తన వద్దే ఉన్న బుకింగ్ రిజిస్ట్రర్ చూసి ఖాళీగా ఉందని రూ.13 వేలు ఇవ్వాలని కోరారు. రూ.13 వేలు చెల్లిం చిన పది రోజులు తరువాత కేవలం రూ.3వేలకు మాత్రమే రసీదు ఇచ్చారు.

    కల్యాణ మండపంలో పెళ్లికి అవసరమైన అన్ని రకాల అలంకరణలకు అయ్యే ఖర్చు రూ.లక్ష ఉంటుందని, అందుకు సిద్ధమైతేనే కల్యాణ మండపాన్ని అద్దెకు ఇస్తామని ఆ కాంట్రాక్టర్ స్పష్టంచేశాకరి అద్దెకు తీసుకున్న వ్యక్తి తెలిపారు. ఈ ఆరోపణలపై టీటీడీ నియమించిన అధికారి వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆందుబాటులోకి రాలేదు.
     

మరిన్ని వార్తలు