ఉచిత కరెంటుకు మంగళం!

21 Jul, 2014 03:45 IST|Sakshi
  •     ప్రభుత్వం నుంచి ట్రాన్స్‌కోకు అందని నిధులు
  •      లబ్ధిదారుల నుంచి బిల్లులు వసూలు చేస్తున్న ట్రాన్స్‌కో
  •      మూన్నాళ్ల ముచ్చటగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్    
  • ఎస్సీ, ఎస్టీలకు ఆసరాగా ఉండేందుకు గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 50 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకం ఆరు నెలలు తిరక్కుండానే అభాసుపాలవుతోంది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం దీనిగురించి పట్టించుకోవడంలేదు. అసలే అప్పుల ఊబిలో కూరుకుపోయిన ట్రాన్స్‌కో లబ్ధిదారుల నుంచి ముక్కుపిండి బిల్లులు వసూలు చేస్తోంది.
     
    పలమనేరు: ఎస్సీ,ఎస్టీ కాలనీల్లో 50 యూనిట్లలోపు విద్యుత్‌ను వాడే లబ్ధిదారులకు ఉచిత కరెంటును అందజేసేలా గత ప్రభుత్వం ఉచి త విద్యుత్ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. ఈ పథకాన్ని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడంలేదు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా నిధులు రాకపోవడంతో ఈ పథకం మూన్నాళ్ల ముచ్చటగా మారింది. ట్రాన్స్‌కో అధికారులు ఎస్సీ, ఎస్టీల నుంచి విద్యుత్ చార్జీలను వసూలు చేస్తున్నారు.
     
    పథక ఉద్దేశమేమిటంటే...
     
    ఎస్సీ, ఎస్టీల కాలనీల్లో 50 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించే కుటుంబాలకు ఉచిత కరెంటును అందివ్వడమే ఈ పథక లక్ష్యం. ఇందుకోసం గత ఏడాది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా ఈ పథకానికి నిధులు సమకూర్చింది. కార్యక్రమ నిర్వహణను సాంఘిక సంక్షేమశాఖకు అప్పగించింది. పథకం ప్రారంభమైన తర్వాత రెండు నెలలు మాత్రం ట్రాన్స్‌కోకు నిధులు అందాయి. ఆపై దీని గురించి  పట్టించుకోలేదు.
     
    ట్రాన్స్‌కోకు రూ.2.40 కోట్ల బకాయి
     
    తిరుపతి ట్రాన్స్‌కో సర్కిల్ పరిధిలోని రూరల్ డివిజన్లలో ఈ పథకం అమలవుతోంది. చిత్తూరురూరల్, మదనపల్లెరూరల్, తిరుపతి రూర ల్, పూతలపట్టు, పీలేరు డివిజన్ పరిధులతో పాటు కుప్పం రెస్కోతో కలిపి దాదాపు 44 వేల మంది ఎస్సీ,ఎస్టీ లబ్ధిదారులున్నారు. వీరికి సంబంధించి ఆరు నెలలుగా రూ.2.40 కోట్ల వరకు సాంఘిక సంక్షేమ శాఖ ట్రాన్స్‌కోకు బకాయిపడింది. ఇన్నాళ్లూ ఎదురుచూసినా డబ్బులు రాకపోవడంతో లబ్ధిదారుల నుంచి బిల్లులు వసూలు చేస్తోంది.
     
    రెండు నెలల నుంచి వసూలు
     
    రెండు నెలల నుంచి ట్రాన్స్‌కో అధికారులు లబ్ధిదారుల నుంచి కరెంటు బిల్లులు కట్టించుకుంటున్నారు. కొందరు బిల్లులు చెల్లించేందుకు ముందుకు రాకపోవడంతో ఓ నెల వేచిచూసే ధోరణిలో ట్రాన్స్‌కో ఉం ది. వచ్చే నెల నుంచి కచ్చితంగా బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి. కుదరదంటే ఇళ్లకు డీసీలు చేయాల్సి వస్తుందని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై చిత్తూరు ట్రాన్స్‌కో డీఈ రమణను వివరణ కోరగా పథకం ప్రారంభమయ్యాక రెండు నెలలు మాృతం బిల్లులందాయని, ఆ తర్వాత ప్రభుత్వం నుంచి తమకు డబ్బు జమ కాలేదన్నారు. తమ శాఖకు ఈ బిల్లులు గుదిబండలా మారాయన్నారు. అందుకే ఎస్సీ,ఎస్టీ లబ్ధిదారుల నుంచి బిల్లులు వసూలు చేస్తున్నామన్నారు.
     

మరిన్ని వార్తలు