టీటీడీలో పే అండ్ అకౌంట్స్ విభాగానికి మంగళం

24 May, 2014 02:54 IST|Sakshi
టీటీడీలో పే అండ్ అకౌంట్స్ విభాగానికి మంగళం
  •    పాత పద్ధతిలోనే జీతభత్యాల చెల్లింపునకు మొగ్గు
  •      జూన్ ఒకటిన జీతాల చెల్లింపు అనుమానమే
  •      ఉద్యోగుల్లో ఆందోళన
  •  సాక్షి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ ) ఉద్యోగుల జీతభత్యాలను సులభంగా అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన పే అండ్ అకౌంట్స్ విభాగానికి మంగళం పాడుతున్నారు. ఈ విభాగాన్ని ఎత్తివేసి పాత పద్ధతిలోనే ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు నిన్నటికి నిన్న అధికారులు హడావుడిగా ఆదేశాలు జారీ చేశారు.

    ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్లను ఆయా విభాగాల శాఖాధిపతులకు శనివారంలోగా అందజేయాలని కూడా ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. దీంతో టీటీడీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మే మాసానికి చెందిన జీతాలు జూన్ ఒకటో తేదీన వచ్చే అవకాశాలు లేవని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అంటున్నారు. ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపుల కోసం నాలుగు సంవత్సరాల కిందట ప్రత్యేకంగా పే అండ్ అకౌంట్స్ విభాగం ఏర్పాటు చేశారు.

    హెచ్‌ఆర్ మ్యాప్స్ అనే ప్రరుువేటు కంపెనీ సహకారంతో రూపొందించిన సాఫ్ట్‌వేర్‌తో అన్ని విభాగాల సిబ్బంది, అధికారుల జీతాలు,అలెవెన్స్‌లను పే అండ్ అకౌంట్స్ విభాగం చెల్లించేది. టీటీడీలో 9,163 మంది ఉద్యోగులకు సంబంధించి ప్రతి నెలా 25 కోట్ల రూపాయలను జీతాల రూపంలో చెల్లిస్తున్నారు. ఈ విభాగం ఏర్పాటు కాకముందు ఆయా శాఖల అధిపతుల కార్యాలయాల నుంచి జీతాల బిల్లులు అకౌంట్స్ విభాగానికి వెళ్లేవి. ఇదంతా పెద్ద తతంగం కావడంతో అన్ని విభాగాల సిబ్బంది జీతాలు చెల్లించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది.

    ఆ మేరకు ఒక కంపెనీకి బాధ్యతలు అప్పగించి టీటీడీ పరిపాలనాభవనంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొత్తగా సాంకేతిక పరికరాలు, ఖరీదైన ఫర్నీచర్ కొనుగోలు చేశారు. ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ విభాగంలో 187 మంది సిబ్బందిని కూడా నియమించారు. అయితే సిబ్బంది కొరత తదితర కారణాలు సాకుగా చూపి కొందరు అధికారులు ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదనే భావన కల్పించారు. దీంతో పాత పద్ధతిలో జీతాలు చెల్లించాలని అధికారులు నిర్ణయించి హడావుడిగా ఆదేశాలు జారీ చేశారు.

    జీతభత్యాల చెల్లింపులకుగాను పాత పద్ధతిని పునరుద్ధరించడంతో వచ్చే నష్టాలు, ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా అధికారులు తాజా ఆదేశాలు జారీ చేయడంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే ఉన్న వ్యవస్థను ఒక్కసారిగా పూర్తిగా రద్దు చేసి సర్వీసు రిజిస్టర్లు ఆయా శాఖల అధిపతులకు అప్పగిస్తే ఆయా రిజిస్టర్లలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తినట్టయితే సంబంధిత ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తుందనే ఆందోళన వారిలో ఉంది.

    పాత పద్ధతిలో జీతభత్యాల చెల్లింపులు సక్రమంగా జరిగే వరకు పే అండ్ అకౌంట్స్ విభాగం పనిచేసినట్టయితే ఇటువంటి ఇబ్బందులను అధిగమించే అవకాశాలు ఉన్నాయనేది వారి వాదనగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఇప్పటికిప్పుడు సర్వీసు రిజిస్టర్లు శాఖాధిపతులకు అప్పగిస్తే వాటిని పరిశీలించి జీతాలు చెల్లించేందుకు పదిరోజులకు పైగా సమయం పడుతుందని అంటున్నారు.

    ఇదే జరిగితే జూన్ మాసంలో చెల్లించాల్సిన జీతాల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం తప్పదని చెబుతున్నారు. మొత్తానికి ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపుల వ్యవహారంలో టీటీడీ అనుసరిస్తున్న ధోరణి ఒక అడుగు ముందుకు మూడడుగులు వెనక్కి అన్నట్టుగా తయారయిందనే విమర్శలు వస్తున్నాయి.
     

>
మరిన్ని వార్తలు