అమ్మంటే మంగమ్మలా ఉండాలి

8 May, 2016 11:02 IST|Sakshi
అమ్మంటే మంగమ్మలా ఉండాలి

గోపాలపట్నం : ఆమె పేరులోనే ఉంది అమ్మ. గర్భం నుంచి ప్రసవించిన లెక్కలేనంత మంది బిడ్డల్ని తల్లికంటే ముందు లోకానికి పరిచయం చేసిన అమృత వల్లి. ఎందరో తల్లులకు పునర్జన్మనిచ్చిన దేవతామూర్తి. ఆంధ్రుల హక్కు...విశాఖ ఉక్కు...అంటూ విశాఖలో ఆందోళన కారులు కేజీహెచ్‌ని సైతం మూయించేసిన రోజుల్లో నేనున్నానంటూ ఉత్తరాంధ్ర తల్లులకు పురుడుపోసిన మహాతల్లి. ఉత్తరాంధ్రలో ఏ బస్సెక్కినా, ఆటో ఎక్కినా, చివరికి రిక్షా ఎక్కినా ఆమె పేరు చెబితే తెలియని వారుండరు. పరిచయం అక్కర్లేని అమ్మ. ఆమే డాక్టర్ మంగమ్మ. మాతృదినోత్సవం సందర్భంగా డాక్టర్ మంగమ్మ గురించి...
 
నేపథ్యమిదీ...
 చిత్తూరి సుబ్రహ్మణ్య మంగమ్మ ఎక్కడి వారో కాదు. ఆమె స్వస్థలం విశాఖ సిటీ వన్‌టౌనే. రెండో ప్రపంచయుద్ధం సమయంలో విశాఖ మొత్తం అంధకారం అయిన రోజుల్లో దీపంబుడ్డిలతో బీఎస్సీ చదువుకున్నారు. వివాహ అనంతరం భర్త రమణ ప్రోత్సాహంతో ఎంబీబీఎస్, డీజీవో చదివారు. కేజీహెచ్‌లో హానరీ గైనకాలజిస్టుగా ఆమె విశేష అనుభవం సాధించారు.  నగరంలో నర్సింగ్‌హోం అంటే విచిత్రంగా చూసిన 1958 రోజుల్లో కేజీహెచ్ ఎదురుగా ఆమె తొలిసారిగా నర్సింగ్ హోం ఏర్పాటు చేశారు. అదే డాక్టర్ మంగమ్మ నర్సింగ్ హోమ్. మంగమ్మకు ఐదుగురు సంతానంలో కొడుకు శ్రీనివాస్, కుమార్తెలు సంధ్యారాణి, సుజాత గైనకాలజిస్టులు కాగా, ఇంకా మనవలతో కలిపి 13మంది వైద్యుల్ని తయారు చేశారు. కిడ్నీ, గుండె తదితర పేరొందిన వైద్యులుగా వారు సేవలందిస్తున్నారు.  
 
 ఆపద్భాంధవి...
 విశాఖ ఉక్కు...ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖలో ఆందోళనలు అట్టుడికిపోయిన రోజుల్లో కేజీహెచ్‌లో ఎమర్జెన్సీవార్డులు సైతం మూతపడ్డాయి. ఆ సమయంలో ఉత్తరాంధ్రలో ఎందరో గర్భిణులకు అండగా నేనున్నానంటూ లేపాక్షి భవనంలో 15 రోజుల పాటు  ఉచితంగా డెలివరీలు చేశారు. మూడు దశాబ్దాలుగా ఆమె సత్యసాయి వైద్యకేంద్రం పేరుతో ప్రహ్లాదపురం సమీప శ్రీనివాసనగర్‌లో గర్భిణులకు ఉచితంగా వైద్యసేవలందిస్తున్నారు.
 
 బాబా ప్రశంసలు...
 భగవాన్‌సత్యసాయిబాబాకి భక్తురాలయిన డాక్టర్ మంగమ్మ ఒకసారి దర్శించి బాబాతో మాట్లాడి దైవం చెంతకు తీసుకెళ్లాని కోరితే... నీవేదైవస్వరూపిణిగా ఎందరికో సేవ చేస్తున్నావు..దైవున్నే నీసొంతం చేసుకున్నావు....ఇక నీకెం దుకు ఇంకో దైవం...అని బాబా ప్రశంసించారంటే ఆమె గొప్పతనాన్ని అంచనావేయాలి.   
 
 అమ్మ సంస్కృతికి అద్దంపట్టాలి
 అమ్మంటే బిడ్డల్ని కనేయడమే కాదు. భారతీయ సంస్కృతిని నేర్పాలి. మనల్నిమనం సంస్కరించుకోవడంతో పాటు ఇతరుల బాగోగులు పట్టించుకోవాలి. మాటసాయం, చదువుకి సహకరించడం, వైద్యం అందించడం...ఇవీ సేవలంటే. నాకిపుడు 85 ఏళ్లు వచ్చినా ప్రజలు ఇంటికొచ్చి మరీ పలకరిస్తుంటారు. ఇంతకంటే ఏం కావాలి.
 -డాక్టర్ మంగమ్మ
 

మరిన్ని వార్తలు