ఫలరారాజు విలవిల!

18 Mar, 2020 12:49 IST|Sakshi
కాపు లేకుండా ఉన్న శ్రీరాంపురం జీడి తోట

మామిడి పూతను ముంచేస్తున్న మంచు

జీడిమామిడి పరిస్థితీ నిరాశాజనకం

దిగుబడిపై ఆశలు వదులుకుంటున్న రైతాంగం

పెట్టుబడి పూర్తిగా నష్టపోవాల్సిందేనని గగ్గోలు

ఉగాది వచ్చేస్తోంది. పచ్చడి చేసుకుందామంటే ఒక్క మామిడి కాయ అయినా కానరావడం లేదు. కారణం ఈ పంటను మంచు ముంచేస్తోంది. దీనినే నమ్ముకున్న వేలాది మంది రైతాంగాన్ని... పరోక్షంగా ఆధారపడిన వ్యాపారులను కలవరపరుస్తోంది. జనవరికి ముందే పూత విరగకాసింది. అది చూసిన అన్నదాత ఆనందంతో ఉప్పొంగిపోయాడు. అంతలోనే ఆరంభమైన పొగమంచుపగబట్టింది. పూతను సమూలంగా మాడ్చేసింది. ఫలితంగా పూత మొత్తం రాలిపోయి... కాయల్లేకుండా తోటలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి.

లక్కవరపుకోట: ఫల రారాజు మామిడికి కష్టమొచ్చింది. ఈ ఏడాది దిగుబడి గగనంగా మారింది. పూత తీవ్రంగా రాలిపోవడంతో మచ్చుకైనా ఓ మామిడి పండు దొరుకుతుందా అన్న సందేహం కలుగుతోంది. ప్రస్తుతం మామిడి తోటలు పూతకు వచ్చినా పూతంతా రాలిపోవడంతో తొడిమలు మాత్రమే కనిపిస్తున్నాయి. వాణిజ్య పంటలైన జీడి, మామిడి ద్వారా కాసిన్న కాసులు వెనకేసుకోవచ్చనుకున్న రైతాంగానికి నిరాశే మిగులుతోంది. ప్రస్తుత సీజన్‌లో జీడి, మామిడి చెట్లు పువ్వు, కాయలతో కళకళలాడాల్సి ఉండగా చెట్లు కళావిహీనంగా కన్పిస్తున్నాయి. ఒక పక్కపొగ మంచు, మరో పక్క చీడపురుగులు పట్టడంతో పూత వచ్చినా పిందెలు కాయనీయట్లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

మామిడి పంటకు పెట్టింది పేరు
రాష్ట్రంలోనే అత్యధికంగా విజయనగరం జిల్లాలో సుమారు 43వేల హెక్టార్లో మామిడి పంట, 16 వేల హెక్టార్లలో జీడి పంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో సుమారు 35వేల మంది రైతులు మామిడితోటలపైనే ఆధారపడి బతుకుతున్నారు. వ్యాపారులు సుమారుగా 20 వేల మంది ఉంటారు. వీరు రైతులనుంచి డిసెంబర్, జనవరి నెలల్లో మామిడి తోటలను కొనుగోలు చేస్తారు. పూత, నిగారింపును చూసి తోటలను కొనుగోలు చేస్తారు. ఈ ఏడాది మార్చి నెల వచ్చేసినా తోటలు పూతకు రాలేదు. కనీసం వచ్చిన పూత కూడా పిందెకట్టలేదు. అక్కడక్కడ పూత వచ్చినప్పట్టికీ పొగమంచు కారణంగా పూర్తిగా రాలిపోయింది. జిల్లాలో సగటున 4.5లక్షల టన్నుల మామడి దిగుబడి రావాల్సి వుండగా ప్రస్తుత ఏడాది కనీసం సగం దిగుబడైనా వస్తుందా అన్న అనుమానం కలుగుతోంది.

జిల్లాలో మామిడి సాగు చేసే మండలాలు
మెరకమొడిదాం, దత్తిరాజేరు, రామభద్రపురం, బొబ్బిలి, గంట్యాడ, కొత్తవలస, మెంటాడ, లక్కవరపుకోట, శృంగవరపుకోట, జామి తదితర మండలాల్లో సుమారు 43వేల హెక్టార్లో అత్యధికంగా మామిడి పంటను రైతులు సాగు చేస్తున్నారు. ఇక జీడి మామిడిని కురుపాం, కొమరాడ, పార్వతీపురం, జియ్యమ్మవలస, శృంగవరపుకోట, గంట్యాడ మండలాల్లో అత్యధికంగా 16వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. మొదట్లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా కనిపించినప్పటికీ తర్వాత తేనె మంచు పురుగు ఆశించడంతో పూత పూర్తిగా మాడిపోయింది.

ఏటా రూ. 40కోట్ల వ్యాపారం
జిల్లాలో మామిడి పంటపై సుమారుగా ఏడాదికి రూ.40కోట్ల వరకూ వ్యాపారం సాగుతుందని ఉద్యానవన శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఈ ప్రాంతంలో పండిన మామిడి పంటకు దేశ విదేశాల్లో మంచి గిరాకీ వుంది. ముఖ్యంగా ఇక్కడి పంట అరబ్‌ దేశాలకు ఎగుమతువుతుంది. అలాగే ఢిల్లీ, ముంబాయి, కోల్‌కత్తా, రాయ్‌పూర్‌ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుత ఏడాది ఆశించిన పంట లేకపోవడంతో రైతులు, అటు వ్యాపారులు దిగాలైపోయారు.

పెట్టుబడి వస్తుందో ,.రాదో
నాకు ఐదెకరాల మామిడితోట ఉంది. మరో 20 ఎకరాలు లీజుకు తీసుకున్నాను. మొత్తం 25 ఎకరాలకు పెట్టుబడి పెట్టా. ఈ ఏడాది మామిడి పూత ఆశాజనకంగా లేదు. ఈ సమయానికి పూర్తిగా కాయలతో ఉండాలి. కనీసం పెట్టుబడి వచ్చే అవకాశం లేదు. 25 ఎకరాలు బాగా కాస్తే సుమారు రూ. 2.5లక్షల ఆదాయం వస్తుంది. ఈ ఏడాది తోటల్లో దుక్కి, ఎరువులు, పురుగు నివారణ మందులకు అత్యధికంగా పెట్టుబడులు పెట్టాం. ఫలితం మాత్రం శూన్యమే.– దుంగ వెంకటరమణ, నీలకంఠాపురం, లక్కవరపుకోట మండలం

మరిన్ని వార్తలు