మామిడి.. అరకొర దిగుబడి!

17 Apr, 2019 13:23 IST|Sakshi
సక్రమంగా పూతకూడా రాని మామిడి తోట

కష్టాల్లో మామిడి రైతు

సీజన్‌ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా మార్కెట్‌లోకి రాని కాయలు

ప్రతికూల పరిస్థితులే కారణమంటున్న అధికారులు

డివిజన్‌లో 20 వేల ఎకరాల్లో మామిడి సాగు

ప్రకాశం, కందుకూరు: డివిజన్‌లోని కందుకూరు ఉద్యానవనశాఖ పరిధిలో దాదాపు 20 వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. వీటిలో ఉలవపాడు మండలంలో 5850 ఎకరాల్లో, గుడ్లూరు 4100 ఎకరాలు, కందుకూరు 1900, వలేటివారిపాలెం 1065, టంగుటూరు 820, సింగరాయకొండ 1557లతో పాటు పొన్నలూరు తదితర మండలాల్లో మామిడి తోటలున్నాయి. గతంలో దాదాపు 25 వేల ఎకరాలకు పైగానే మామిడి తోటలు ఈ ప్రాంతంలో ఉండేవి. ఏడాదంతా ఎదురు చూసినా కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కానీ ప్రతి ఏడాది నష్టాలే వస్తుండడంతో రైతులు క్రమంగా తోటలు తొలగిస్తున్నారు. గత ఐదేళ్ల కాలంలో మామిడి రైతులు చెట్లు నరికేసి ఇతర పంటల వైపు మొగ్గుచూపసాగారు.

ఈ ఏడాది దిగుబడి దారుణం
కందుకూరు ప్రాంతాన్ని గత ఐదేళ్లుగా తీవ్ర వర్షాభావం వెంటాడుతోంది. అరకొర మెట్ట పంటలు తప్పా ఇతర ఏ పంటలు కూడా పండే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ప్రభావం క్రమంగా మామిడి రైతుల మీద కూడా పడింది. ఈ ఏడాది గత నాలుగుగైదు నెలలుగా ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు. దీంతో మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కనీసం పూత కూడా రాలేదు. ఆ ప్రభావం కాస్త ఇప్పుడు దిగుబడి మీద పడింది. వర్షాలు క్రమంగా పడి వాతావరణం అనుకూలిస్తే ఎకరానికి దాదాపు 5 నుంచి 6 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. కానీ ఈ ఏడాది ఎకరానికి ఒక టన్ను దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. వేల ఎకరాల్లో ఇప్పటి వరకు కనీసం పూత కూడా రాలేదు. చెట్లు ఎండిపోయాయి. వీటిని కాపాడుకునే పరిస్థితి కూడా రైతుల్లో లేదు. దీంతో రైతులు చేతులెత్తేశారు. దీంతో ఈ ఏడాది మామిడి దిగుబడి దారుణంగా పడిపోయింది. దిగుబడి ప్రభావంతో రైతులు కష్టాలను ఎదుర్కొంటున్నారు. కందుకూరు డివిజన్‌ నుంచి ప్రతి ఏడాది దాదాపు 76 వేల మెట్రిక్‌ టన్నుల మామిడి దిగుబడి వస్తుంది. ఇందులో ఉలవపాడు, గుడ్లూరు మండలాల నుంచి అధికంగా దిగుబడి వస్తుంది. అయితే గత కొన్ని సంవత్సరాలు ఈ దిగుబడులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రతి ఏడాది సరాసరిన 10 మెట్రిక్‌ టన్నుల వరకు దిగుబడి తగ్గుతున్నట్లు ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఎగుమతులపైన ప్రభావం
ఈ ప్రాంతం నుంచి దేశ వ్యాప్తంగా ఈ సీజన్‌లో మామిడి ఎగుమతులు జోరుగా సాగుతాయి. ప్రధానంగా ఉలవపాడు కేంద్రంగా హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ వంటి ప్రాంతాలకు భారీగా ఎగుమతులు ఉంటాయి. దీంతో దాదాపు సీజన్‌ మూడు, నాలుగు నెలల పాటు మార్కెట్‌ ఉత్సాహంగా సాగుతుంది. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి కానరావడం లేదు. మార్కెట్‌లోకి కాయలు రావడమే గగనంగా మారింది. అత్యంత నాణ్యమైన పేరుగాంచిన మామిడి రకాలు ఈ ప్రాంతంలోనే దొరుకుతాయి. బంగినపల్లి, చెరుకురసాలు, చోటాపురి, ఇమామిపసందు వంటి తదితర రకాలు పండుతాయి. కానీ ఈ రకాలు ఏవి కూడా ప్రస్తుతం దొరికే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో మామిడి ఎగుమతులపై కూడా ప్రభావం పడనుంది. ఇక సామాన్యుడు మామిడి రుచిని ఆస్వాదించడం అంత సులువు కాదు ఈ ఏడాది.

మరిన్ని వార్తలు