తలమార్పిడి చేస్తే కల్పవృక్షమే

25 Jun, 2018 11:23 IST|Sakshi
తలమార్పిడి చేసిన మామిడి చెట్టుకు అంట్లు కడుతున్న నిపుణులు

సకాలంలో కొమ్మలు కత్తిరిస్తేనే ఉపయోగం

సెప్టెంబర్‌లోగా అంట్లు కట్టుకునేలా చూసుకోవాలి

కడప అగ్రికల్చర్‌ : పురాణాల్లో ప్రస్తావనకు వచ్చే కల్పవృక్షం కోరిన కోరికలు తీరుస్తుందో లేదో తెలియదుగానీ మామిడి తోటల్లో ఎక్కువ వయసున్న ముదురు మామిడి చెట్లకు తల మార్పిడి (టాప్‌ వర్కింగ్‌) చేస్తే అవి నిజంగానే కోరిన కాయలు ఇస్తాయి. నమ్మశక్యం కాకపోయినా ఈ పద్ధతిని అనుసరించి ఇప్పుడు అనేక మంది మామిడి రైతులు రూపాయి రాబడిరాని తోటల నుంచి అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. ముదురు మామిడి చెట్ల నుంచి ఆశించిన దిగుబడి రాదన్న విషయం రైతులందరికీ తెలిసిందే. వీటిని తొలగించి వెంటనే కొత్త మొక్కలు నాటినా వాటి నుంచి దిగుబడి, రాబడి పొందడానికి కనీసం ఐదారు సంవత్సరాలు పడుతుంది. పైగా ఇది ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. అంతేకాక కొత్తగా వేసే తోటలను సంరక్షించేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది.

దీనికి బదులుగా ముదురు చెట్లకే తలమార్పిడి చేస్తే రెండు సంవత్సరాలలో పంట దిగుబడి (కాపు) తీసుకోవచ్చు. దీనివల్ల కాలం కలిసి రావడమే కాకుండా లాభసాటి రకం కాని చెట్ల కొమ్మలకు నాణ్యమైన, వాణిజ్య పరమైన రకాలను అంట్లు కట్టి మంచి మేలైన దిగుబడి, రాబడి పొందవచ్చు. రాయచోటి, రైల్వేకోడూరు, రాజంపేట నియోజక వర్గాల్లో అధిక విస్తీర్ణంలోను, మిగతా నియోజక వర్గాల్లో తక్కువ విస్తీర్ణంలో మామిడి తోటలు సాగయ్యాయి. వీటిలో చాలా వరకు ముదురు తోటలే ఉంటున్నాయి. వీటి నుంచి సరైన ఆదాయం రాక కొందరు తోటలను వదిలేయగా మరి కొందరు వచ్చిన కాడికే దిగుబడి అంటూ సరి పుచ్చుకుంటున్నారు. ఈ తరుణంలో ఉద్యానశాఖ తలమార్పిడి పద్ధతిని ప్రచారంలోకి తెచ్చింది. దీనిని అమలు చేసే తోటలకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. దీంతో రైతులు ఈ ప్రక్రియపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో తలమార్పిడి పద్ధతి గురించి జిల్లా ఉద్యాన శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్లు వెంకటేశ్వరరెడ్డి, రవీంద్రనాధరెడ్డి పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఆ సలహాలు...సూచనలు ఏమిటో వారి మాటల్లోనే..

ఎలా చేయాలంటే...: ముదురు తోటల్లో చెట్ల కొమ్మలను నాలుగైదు అడుగులు ఉంచి మిగిలిన భాగాన్ని తొలగించాలి.   ఆ పెద్ద కొమ్మకు ఒక చిన్నకొమ్మ మాత్రమే ఉంచి మిగిలిన వాటిని కత్తిరించాలి. కొమ్మలను కత్తిరించే సమయంలో కొమ్మ చీలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కొమ్మలను వాలుగా కత్తిరించి వర్షపు నీరు నిలువకుండా జారిపోతుంది. దీనివల్ల చీడపీడలు పెద్దగా సోకవు. కత్తిరించిన భాగాలకు వెంటనే బోర్డోపేస్టు పూయాలి. ఇలా కత్తిరించిన కొమ్మలపై రెండు మూడు నెలలకు పెన్సిల్‌ మందంతో ఇగురు కొమ్మలు పుట్టుకొస్తాయి. ఆ కొత్త కొమ్మల్లో 20 కొమ్మల వరకు ఉంచి మిగిలిన వాటిని తొలగించాలి.

అంటుకట్టడం...:కొత్తగా వచ్చిన కొమ్మలకు మనకు కావలసిన రకాల తల్లి చెట్ల నుంచి సేకరించిన పుల్లలను అంటుకట్టుకోవాలి. కొమ్మల మీద కొంచెం ఏటవాలుగా పై భాగంలో నాలుగైదు సెంటీమీటర్ల పొడవున పైనుంచి కిందకు పదునైన చాకుతో కోయాలి. ఇలా కొమ్మమీద పెట్టిన గాటుతో కావాల్సిన రకం పుల్లలను ఉంచి పాలిథిన్‌ పేపరుతో గట్టిగా చుట్టాలి. కొద్ది రోజుల తరువాత చిగురు తొడిగిన అంటు పుల్ల రెమ్మలు గాలికి విరిగిపోకుండా చిన్న ౖసైజు తాళ్లతో కట్టాలి. అంటు కట్టినప్పుడు మొక్కకు పోషక పదార్థాలు బాగా అందుతాయి. సెప్టెంబర్‌ నెలాఖరు లోపల తల మార్పిడి చేసి అంటుకట్టుకుంటే మంచిది. ఈ ప్రక్రియను శీతాకాలంలో చేయడం మంచిదికాదు.

ఉద్యానశాఖ సబ్సిడీ : ముదురు తోటలను రైతులు సొంతంగా పునరుద్ధరించుకోవడానికి తలమార్పిడి చేస్తే హెక్టారుకు రూ.25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇందులో ఉద్యానశాఖ హెక్టారుకు రూ.17,500 సబ్సిడీ ఇస్తుంది. మరి కొంత మొత్తానికి సూక్ష్మపోషక ఎరువులు వ్యవసాయశాఖ ఇస్తుంది. ఆయా ముదురు తోటలు ఉన్న రైతులు సమీప మండల ఉద్యానశాఖ అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకుంటే తప్పని సరిగా ముదురుతోటలకు తలమార్పిడి చేయించుకోవచ్చు.

పనికిరాని చెట్లే అనుకుంటే..
ముదురు తోటల నుంచి ఎలాంటి ఫలసాయం రాకపోవడంతో వాటికి ఎరువులు వేయకుండా, మందులు కొట్టకుండా వదిలేశానని లక్కిరెడ్డిపల్లెకు చెందిన రైతులు నారాయణరాజు అన్నారు. అయితే ముదురు చెట్లలో తలమార్పిడి విధానం గురించి ఉద్యానశాఖ అధికారులు మీటింగ్‌ పెట్టారు. ఆ మీటింగ్‌లో ముదురు తోటల్లోని చెట్లను ఎట్లా కాపునకు తీసుకురావచ్చు, దిగుబడి ఎలా తీయవచ్చు, ఎలా కత్తిరింపులు చేసుకోవాలి, ఎప్పుడు చెట్లు కత్తిరించుకోవాలనే విషయాలు చెప్పారు. ఆ ప్రకారం చెట్లను కత్తిరింపులు చేసుకుని తోటను సాగులోకి తెచ్చుకున్నాను. ఇప్పుడు కొత్త తోటలకు వచ్చిన విధంగా పంట దిగుబడి వస్తున్నది చెబుతుంటే సంతోషంగా ఉంది.

ముదురు చెట్లకు తలమార్పిడి చేసుకుంటేనే ఆదాయం
తోటలో కొన్ని చెట్లు ముదురు చెట్లైపోయాయి. వాటిని ఏం చేయాలో తెలియక సతమతం అయ్యేవాణ్ణి. ఉద్యానశాఖ అధికారుల సూచలనల మేరకు శిక్షణ కార్యక్రమంలో విషయాలను తెలుసుకుని ముదురు చెట్లకు తలమార్పిడి చేసి మల్లిక, బేనిషా, నీలీషా, మల్‌గోవా, చెరకు రసం, కాలేపాడు, ఇమామ్‌ పసంద్, బెంగుళూరా, రుమానీ, ఇలా పలు రకాల అంట్లను తల్లి చెట్లకు కట్టించాను. ఇప్పుడు మంచి దిగుబడిని ఇస్తున్నాయి.– నరసింహారెడ్డి, మామిడి రైతు, నందిమండలం, పెండ్లిమర్రి మండలం

మరిన్ని వార్తలు