వట్టిమీనపల్లి సొసైటీ చైర్మన్‌గా మాణిక్‌రెడ్డి

21 Dec, 2013 00:38 IST|Sakshi

నవాబుపేట, న్యూస్‌లైన్ : వట్టిమీనపల్లి ప్రాథమిక సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్‌గా కొంపల్లి మాణిక్‌రెడ్డి ఎన్నికయ్యారు. కోరం లేకపోవడంతో చైర్మన్ ఎన్నిక గురువారం వాయిదా పడిన విషయం తెలిసిందే. శుక్రవారం ఎన్నికల అధికారి తకీహుస్సేన్ ఆధ్వర్యంలో బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. ఉదయ 9 నుంచి 11 గంటల వరకు చైర్మన్, ఉపాధ్యక్ష పదవుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరించారు. చైర్మన్ పదవికి కాంగ్రెస్‌లో కాలె యాదయ్య వర్గానికి చెందిన కొంపల్లి మాణిక్ రెడ్డి, చిట్టెపు మల్లారెడ్డి వర్గానికి చెందిన రాంరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. ఉపాధ్యక్ష పదవికి టీడీపీకి చెందిన లింగన్నొల ప్రమూకమ్మ, కాంగ్రెస్‌లో మల్లారెడ్డి వర్గానికి చెందిన మాణిక్‌రెడ్డి నామినేషన్లు వేశారు. వీటిని పరిశీలించిన ఎన్నికల అధికారి నామినేషన్ల ఉపసంహరణకు అరగంట గడువిచ్చి, గుర్తులు కేటాయించారు. అభ్యర్థులు ప్రచారం చేసుకోవడానికి మరో అరగంట వ్యవధి ఇచ్చి ఓటింగ్ నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ చేసి ఫలితాలు వెల్లడించారు. మొత్తం 13 ఓట్లలో చెరి 7 చొప్పున ఓట్లు సాధించిన కొంపల్లి మాణిక్‌రెడ్డి చైర్మన్‌గా, ప్రమూకమ్మ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
 
 ఉత్కంఠగా ఎన్నిక...
 గత బుధవారం వట్టిమీనపల్లి పీఏసీఎస్‌కు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నప్పటికీ పార్టీలోని రెండు వర్గాల విభేదాలతో అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోలేని పరిస్థితి. మొత్తం 13వార్డుల్లో కాలె యాదయ్య వర్గానికి 3వార్డులు, చిట్టెపు మల్లారెడ్డి వర్గానికి 5వార్డులు దక్కాయి. కాగా టీడీపీకి 3వార్డులు, టీఆర్‌ఎస్‌కు 2వార్డులు దక్కాయి. గురువారం అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా ఎవరికీ మెజారిటీ స్థానాలు దక్కని పరిస్థితిలో వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో యాదయ్య వర్గానికి చెందిన ముగ్గురు సభ్యులు వ్యూహాత్మకంగా టీడీపీ, టీఆర్‌ఎస్ సభ్యుల మద్దతు కూడగట్టారు. టీడీపీకి చెందిన ఓ సభ్యుడు మాత్రం మల్లారెడ్డి వర్గంవైపు మొగ్గు చూపారు. దీంతో ఆ వర్గానికి చెందిన రాంరెడ్డికి ఆరు ఓట్లు లభించాయి. ఒక్క ఓటు ఆధిక్యంతో కొంపల్లి మాణిక్‌రెడ్డి చైర్మన్‌గా, ఉపాధ్యక్షురాలిగా ప్రమూకమ్మ విజయం సాధిం చారు. ఎన్నికైన వారికి అధికారులు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసి గ్రామంలో విజయోత్సవ ఊరేగింపు నిర్వహించారు.
 
 భారీ బందోబస్తు...
 పోలింగ్ రోజున జరిగిన ఘర్షణలను దృష్టిలో ఉంచుకుని చైర్మన్ ఎన్నిక సందర్భంగా పీఏసీఎస్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వికారాబాద్ డీఎస్పీ పి.నర్సింలు, ట్రైనీ డీఎస్పీ హర్ష,  సీఐ విజయ్‌లాల, ఎస్‌ఐలు చతుర్వేది, మోహినోద్దిన్,  శిక్షణ ఎస్‌ఐలు వెంకటేశ్వర్ గౌడ్, శంషోద్దిన్, రమేష్, నర్సింలు ఆధ్వర్యంలో 52 మంది ఏఆర్, సివిల్ సిబ్బందిని మోహరిం చారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
 

మరిన్ని వార్తలు