చిన్నారి ప్రాణంతో చెలగాటం

29 Dec, 2018 03:15 IST|Sakshi
నొప్పితో విలవిలలాడుతున్న చిన్నారితో తల్లిదండ్రులు

ఒళ్లంతా కాలిపోయి నెలన్నరగా అల్లాడిపోతున్న మూడేళ్ల చిన్నారి 

ఆరోగ్యశ్రీ వర్తించదంటూ చికిత్స చేయని ఎన్నారై, మణిపాల్‌ ఆస్పత్రి వైద్యులు 

బర్న్స్‌ వార్డు లేదంటూ చిన్నారిని వెనక్కి పంపిన జీజీహెచ్‌ వైద్యులు 

సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయడంతో వెనక్కి పిలిచిన జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ 

బర్న్స్‌ వార్డు నిర్మాణానికి కేంద్రం నిధులిచ్చినా.. స్పందించని రాష్ట్రం

సాక్షి, గుంటూరు: ఆ చిన్నారి కష్టం పగవాడికి కూడా రాకూడదు..బుడిబుడి అడుగులు వేసే మూడేళ్ల  వయస్సులోనే దాదాపు 45 రోజులుగా క్షణం క్షణం నరకం చవిచూస్తోంది. శరీరం వెనుక భాగంలో తీవ్రంగా కాలిన గాయాల బాధతో కొట్టుమిట్టాడుతున్న చిన్నారికి ఎన్టీఆర్‌ వైద్య సేవ ద్వారా ఉచితంగా వైద్యం చేసే వీలున్నప్పటికీ.. ఇప్పటికే బకాయిలు అధికంగా ఉండడంతో ప్రైవేటు వైద్యులు ఎవరూ ముందుకు రాని దుర్భర పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా వినుకొండ పాత క్రిస్టియన్‌పాలెంలో నివాసం ఉంటున్న యెలికపాటి ఆదయ్య, కీర్తి దంపతుల చిన్న కుమార్తె అమూల్య తోటి పిల్లలతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గౌనుకు నిప్పంటుకుని వీపు నుంచి కింది భాగమంతా పూర్తిగా కాలిపోయింది. నవంబరు 14వ తేదీన ఘటన జరగడంతో తల్లిదండ్రులు వినుకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కొద్దిరోజులు చికిత్స చేయించారు. అక్కడ రూ.50 వేలు ఖర్చు కావడంతో నిరుపేద కుటుంబం కావడంతో అప్పు తేలేక, ఆస్పత్రి నుంచి అమూల్యను ఇంటికి తీసుకెళ్లి మందులు వాడుతున్నారు. అయితే వైద్యుల పర్యవేక్షణ లేకపోవడంతో గాయం మానకుండా పెద్దది అవుతూ వచ్చింది. దీంతో  గురువారం తాడేపల్లిలోని మణిపాల్‌ ఆస్పత్రి, మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రులకు అమూల్యను తీసుకెళ్లారు.

ఎన్టీఆర్‌ వైద్య సేవ కార్డు ఉందని,  దాని ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించాలని కోరారు. అయితే ఎన్టీఆర్‌ వైద్య సేవలో ఉచితంగా చేసే వీలు ఉన్నప్పటికీ అనుమతులు వచ్చే వరకు అయ్యే ఖర్చు భరించాలని, అనుమతులు రాకపోతే పూర్తిగా డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుందని వైద్యులు తేల్చి చెప్పారు. ఆర్థిక స్థోమత లేని ఆదయ్య దంపతులు అమూల్యను తీసుకుని సాయంత్రం 5.30 గంటల సమయంలో జీజీహెచ్‌కు వెళ్లారు. జీజీహెచ్‌లో బర్న్స్‌ వార్డు లేదని, చిన్న పిల్లల వార్డులో ఉంచితే ఇన్‌ఫెక్షన్‌ వచ్చి ఇంకా ఎక్కువ ఇబ్బంది జరుగుతుందంటూ అక్కడి వైద్యులు చెప్పడంతో  చేసేది లేక ఇంటికి బయల్దేరారు. వారి సమీప బంధువు సోషల్‌ మీడియాలో ఈ వ్యవహారం అంతా పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అయింది. దీన్ని గమనించిన జీజీహెచ్‌ అధికారులు ఆదయ్యకు ఫోన్‌ చేసి వెనక్కు రావాలని కోరారు. దీంతో  గురువారం రాత్రి జీజీహెచ్‌కు తీసుకొచ్చి అమూల్యను అడ్మిట్‌ చేశారు. ప్రస్తుతం అమూల్య జీజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. అయితే జీజీహెచ్‌లో దీనికి సంబంధించి ఎటువంటి మందులూ లేకపోవడం గమనార్హం.  
బర్న్స్‌ వార్డు నిర్మాణానికి రూ. 8 కోట్లు కేంద్రం మంజూరు చేసినట్లు జారీ చేసిన జీవో 

బర్న్స్‌ వార్డుకు కేంద్రం నిధులిచ్చినా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం.. 
గుంటూరు జీజీహెచ్‌కు కోస్తాంధ్రలోని ఆరు జిల్లాల నుంచి రోగులు వస్తుంటారు. ఆరు జిల్లాల్లో ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా వైద్యులు ఇక్కడకు రిఫర్‌ చేస్తుంటారు. అయితే ఇంత పెద్ద ఆస్పత్రిలో బర్న్స్‌ వార్డు లేకపోవడంతో కాలిన గాయాలతో వచ్చిన అనేకమంది రోగులు ప్రాణాలు కోల్పోతున్న దుర్భర స్థితి నెలకొంది. రాజధాని ప్రాంతంలో ఉన్న పెద్ద ఆస్పత్రిలో సైతం బర్న్స్‌ వార్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయని పరిస్థితి. కాలిన గాయాల నివారణ, నియంత్రణ జాతీయ కార్యక్రమం (ఎంపీపీఎంబీఐ)లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు బోధనా ఆస్పత్రుల్లో బర్న్స్‌ వార్డుల నిర్మాణానికి ఏడాది క్రితం కేంద్ర ప్రభుత్వం రూ.40 కోట్లు మంజూరు చేసింది. గుంటూరు జీజీహెచ్‌కు సైతం రూ.8 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసినప్పటికీ కనీసం టెండర్లు కూడా పిలిచిన దాఖలాలు లేవు. బర్న్స్‌ వార్డు నిర్మాణానికి నిధులు ఉన్నా నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత చూపకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

డబ్బు చెల్లించమని చెప్పిన మాట వాస్తవమే.. 
కాలిన గాయాలతో అమూల్య అనే చిన్నారిని తీసుకుని మా వద్దకు వచ్చారు. అయితే ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్టుకు అనుమతి కోసం పంపుతామని, అనుమతి వచ్చే వరకు డబ్బు చెల్లించాల్సి ఉంటుందని చెప్పాం. అనుమతి వస్తే ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని తెలిపాం. అయితే వారు ఆస్పత్రిలో చేర్చకుండా వెళ్లిపోయారు. ఎన్టీఆర్‌ వైద్యసేవలో ఎక్కువగా కాలిన గాయాలు ఉంటే మాత్రమే అనుమతి వస్తుంది. అందుకే ముందుగా ఎన్టీఆర్‌ వైద్య సేవలో చేర్చుకోలేకపోయాం.
– రామాంజనేయులు,ఎన్నారై ఆస్పత్రిలో ఎన్టీఆర్‌ వైద్య మిత్ర 

మరిన్ని వార్తలు