లింగ నిర్ధారణ కేంద్రాల రిజిస్ట్రేషన్‌లో అవకతవకలు

24 Jul, 2014 00:21 IST|Sakshi

సాక్షి, కర్నూలు : ప్రైవేటు ఆస్పత్రులను నియంత్రించేందుకు.. సామాన్య రోగులను రక్షించేందుకు.. నిర్ణీత రుసుంతో వారికి నాణ్యమైన వైద్యం అందేలా చూసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టం ఆచరణకు నోచుకోవడం లేదు. ఇది పరోక్షంగా అధికారులకు కల్పవృక్షంగా మారిందనే విమర్శలున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవడంతోపాటు నిర్ణీత ఫీజులను నిర్ణయించాలి. అలాగే లింగనిర్ధారణ(స్కానింగ్) కేంద్రాలపై నిఘా ఉంచి గర్భంలో ఉన్న బిడ్డ ఆడ, మగ అనేది తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.

ఈ రెండింటి మాటున వైద్య ఆరోగ్య శాఖ వసూళ్ల పర్వం సాగిస్తోంది. నిబంధనల సాకు చూపి నజరానాలు పుచ్చుకోవడంతో చట్టం అమలు మచ్చుకైనా జరగడం లేదు. ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలను అతిక్రమించినా వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటి వరకు ఎక్కడా చర్యలు తీసుకోలేదు. ప్రైవేటు ఆస్పత్రుల్లో వసూలు చేసే ఫీజుల వివరాలను ప్రదర్శించాలనేది నిబంధనల్లో ఒకటికాగా, చాలాచోట్ల ఇది అమలుకు నోచుకోవడం లేదు. అక్కడక్కడ ఫీజుల బోర్డులు పెట్టినా అవి అలంకరణప్రాయమేనని తెలుస్తోంది. ఈ విషయాలు అధికారుల దృష్టికి వచ్చినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.

 ఇవీ నిబంధనలు..: ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్-2002 ప్రకారం ప్రతి ప్రైవేటు వైద్యశాల నిర్ణీత ఫీజు చెల్లించి వైద్యశాఖ రిజిస్ట్రేషన్ పొందాలి. ఒకటి నుంచి 20 పడకల మధ్య ఆసుపత్రులైతే రూ. 3,750, 21-50 మధ్య రూ. 7,500, 51-100 మధ్య రూ. 10 వేలు చొప్పున ఫీజు చెల్లించాలి. ఒకసారి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఐదేళ్ల వరకు అమలులో ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ క్రమబద్ధీకరించుకోవాలి. అర్హత గల వైద్యులు, పారామెడికల్, ల్యాబొరేటరీల్లో అర్హులైన సిబ్బంది ఉండాలనే నిబంధనలున్నాయి.

 పరీక్షలకు, శస్త్రచికిత్సలకు వసూలు చేసే ఫీజులను ఆస్పత్రుల వద్ద ప్రదర్శించి అమలు చేయాలి. వీటిలో ఏదో ఒక లొసుగు ఉండడం వల్ల అధికారులతో లోపాయికారీ అవగాహన కుదుర్చుకొని ఆమోదముద్ర పొందుతున్నారనే ఆరోపణలున్నాయి. లింగ నిర్ధారణ కేంద్రాల రిజిస్ట్రేషన్‌లో కూడా మతలబు జరుగుతోంది. ఆస్పత్రిలో ఉన్న స్కానింగ్ సెంటర్‌కు రూ. 35 వేలు చొప్పున, ఆస్పత్రి లేకుండా నిర్వహించే వారికి రూ. 25 వేలు చొప్పున ఫీజుగా వసూలు చేస్తారు. దీనికి అనుబంధంగా అర్హులైన వైద్యుడు ఉండాలనే నిబంధన ఉంది. ఈ విషయంలో వెసులుబాటు కల్పించినందుకు అధికారులను ప్రసన్నం చేసుకుంటున్నారు.

 ఫీజులపై నియంత్ర ణ డొల్ల..
 చట్టప్రకారం ఆస్పత్రుల వద్ద నోటీసు బోర్డులో నమోదు చేసిన ఫీజులు వసూలు చేయాలి. ఇది మచ్చుకైనా అమలు జరగడం లేదు. కొన్ని ఆస్పత్రుల్లో ప్రసవానికి వచ్చిన వారి నుంచి రూ. 25 వేలు నుంచి రూ. 35 వేల వరకు వసూలు చేస్తున్న ఘటనలూ ఉన్నాయి. వివిధ రకాల పరీక్షలను సాకుగా చూపి బిల్లులు వసూలు చేస్తున్నా ఆడిగేవారు లేరు. రిజిస్ట్రేషన్ సమయంలో వైద్యాధికారులు వారికి వచ్చే ఆదాయాన్ని సమకూర్చుకొని ఆ తర్వాత అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదనే విమర్శలు ఉన్నాయి. బయో మెడికల్ వేస్ట్‌కు సంబంధించి కాలుష్య నియంత్రణ మండలి ధ్రువీకరణపత్రం సమర్పించాలి. ఇలాంటివి కొన్ని ఆస్పత్రులకు లేకపోయినా పట్టించుకునే వారు లేరు. జిల్లాలో ఇప్పటి వరకు 225 స్కానింగ్ సెంటర్లు, 296 ఆస్పత్రులు రిజిస్ట్రేషన్ పరిధిలోకి వచ్చాయి.
 
 నిబంధనలు పాటించకపోతే మూసివేస్తాం:
 ప్రైవేటు ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం నిబంధనలు పాటించని ఆస్పత్రుల మీద చర్యలు తీసుకుంటాం. ఏ చికిత్సకు ఎంత వసూలు చేస్తున్నారో ఆస్పత్రుల వద్ద తప్పనిసరిగా బోర్డులు ఏర్పాటు చేసి అమలు చేయాలి. నిబంధనలకు విరుద్ధంగాఫీజులు  వసూలు చేసినట్లు రుజువైతే అలాంటి ఆస్పత్రులను, స్కానింగ్ సెంటర్లను మూసివేస్తాం.  - నరసింహులు, డీఎంహెచ్‌ఓ

మరిన్ని వార్తలు