ఇష్టారాజ్యం

27 Feb, 2019 04:08 IST|Sakshi

గుంటూరు జిల్లాలో ఓటర్ల జాబితాలో అవకతవకలు  

‘వినుకొండ’లో ఫారం –6 ఇచ్చినా ఓటు నమోదు చేయని వైనం 

‘గురజాల’లో ఫారం – 7 పేరుతో ఓట్లు తొలగించేందుకు సన్నాహాలు 

‘చిలకలూరిపేట’లోనూ అక్రమాలు

తమకు అనుకూలంగా మార్పులు చేయాలని బీఎల్వోలపై టీడీపీ నేతల ఒత్తిడి

ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలు   

సాక్షి, అమరావతి బ్యూరో: ఓటమి భయం వెంటాడుతుండడంతో అధికార పార్టీ నేతలు ఎన్నికల్లో గట్టెక్కేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. అధికార దర్పంతో కిందిస్థాయి ఉద్యోగులను బెదిరించి అవకతవకలకు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఓటర్ల లిస్టుపై దృష్టి సారించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనుకూల ఓట్లను ఏదో రకంగా తొలగించడంతో పాటు దొంగ ఓట్లను నమోదు చేయించుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో ఈ వ్యవహారం ఇష్టారాజ్యంగా సాగిస్తున్నారు. సర్వేల పేరుతో ఓటర్ల పేర్లు సేకరించి, వాటిని తొలగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. జాబితాలో లేని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారు కొత్తగా ఓటరు నమోదు కోసం ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకున్నా, వాటిని నమోదు చేయకుండా బీఎల్వోలపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో  ఓటర్ల జాబితాలో గందరగోళం నెలకొంది. ఇటీవల జిల్లాలో పర్యటించిన ఎన్నికల ఆడిట్‌ బృందం ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఆరు నియోజకవర్గాల రికార్డులను పరిశీలించినట్లు సమాచారం. ప్రధానంగా డబుల్, ట్రిపుల్, అనుమానాస్పద ఓట్లపైనే ఎన్నికల కమిషన్‌ దృష్టి సారించింది. ఇందులో భాగంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఓటర్ల జాబితాల మార్పులు, చేర్పుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఆరుగురు బీఎల్వోలపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ముగ్గురు తహసీల్దార్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అధికార పార్టీ నేతలు బీఎల్వోలను తమకు అనుకూలంగా మలుచుకొని పెద్ద ఎత్తున ఓట్లు చేర్పించుకోవటంతో పాటు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనుకూల ఓట్లను చేర్చకుండా అడ్డుకొంటున్నారు.

ఓటర్ల జాబితాలో అవకతవకలు ఇవే...
వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలంలో వడ్డెకుంట, జయంతిరామపురంలో మల్లు వెంకటేశ్వర్లుతో పాటు 33 మంది ఇప్పటికి 4సార్లు ఓటుహక్కు కల్పించమని దరఖాస్తు చేసుకున్నారు. వీటిని జాబితాలో చేర్చే చర్యలు తీసుకోవడంలేదు.

- బొల్లాపల్లి మండలంలోని వడ్డెకుంట, వెల్లటూరు, పేరూరులో డబుల్‌ ఎంట్రీ ఓట్లు అధికంగా ఉన్నాయి. రెడ్డిపాలెం గ్రామానికి చెందిన పేరం శ్రీనివాసరావు, కృపానాయక్, యర్రంశెట్టి మస్తాన్‌రావుతో పాటు మరో 16 మంది ఆ స్వగ్రామంతో పాటు, వేరే గ్రామాల్లోనూ ఓట్లు కలిగి ఉన్నారు.
గురజాల నియోజకవర్గంలో పోలింగ్‌ బూత్‌కు 50 ఓట్ల చొప్పున, వైఎస్సార్‌సీపీకి చెందిన 15 వేల అనుకూల ఓట్లను తొలగించేందుకు ప్రణాళిక రచించారు. మాచవరం మండలం సింగరాయపాలెం తండాకు చెందిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులవి 66 ఓట్లను తొలగించాలని గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత దరఖాస్తు చేయడం గమనార్హం.
జిల్లా వ్యాప్తంగా అనుమానాస్పద ఓట్లు 2,07,209 ఉండగా, అత్యధికంగా చిలకలూరిపేట నియోజక వర్గంలో 16,659 ఉన్నాయి. వీటిపై విచారణ జరపాలని పలువురు ఫిర్యాదు చేశారు. సత్తెనపల్లి నియోజక వర్గంలో ఇష్టారాజ్యంగా పోలింగ్‌ బూత్‌లను మార్చారు.  
పొన్నూరు నియోజకవర్గంలో 4500 ఓట్లు తొలగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దొంగ ఓట్లు 10 వేలకు పైగా ఉన్నట్లు ఫిర్యాదులు అందాయి.

ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు...
గురజాల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఓట్లను తొలగించే కుట్ర సాగిందని, శాసనమండలి  ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఇటీవల ఫిర్యాదు చేశారు. ఇంతకుమునుపు సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త పోలింగ్‌ కేంద్రాల మార్పుపై ఫిర్యాదు చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త రజని ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటు చేసుకున్నాయని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ జరిపి, న్యాయం చేయాలని కోరారు.

నాడు చంద్రగిరి.. నేడు చిత్తూరులో
ఓట్ల తొలగింపునకు అధికంగా ఫారం–7 దరఖాస్తులు
చిత్తూరు కలెక్టరేట్‌ : చిత్తూరు జిల్లాలో ఓట్ల తొలగింపు కోసం ఆన్‌లైన్‌ ద్వారా అధికంగా దరఖాస్తులు నమోదవుతున్నాయి. ఇటీవల ఆ సమస్య చంద్రగిరి నియోజకవర్గంలో ప్రారంభమైంది. చిత్తూరు నియోజకవర్గంలో వేలాది మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని ఫారం–7 ద్వారా ఆన్‌లైన్‌ దరఖాస్తులు అందాయి. సోమవారం, మంగళవారం చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో తహసీల్దారు చంద్రశేఖర్‌తో పాటు ఎన్నికల డెప్యూటీ తహసీల్దారు, ఇతర రెవెన్యూ అధికారులు ఓట్ల నమోదు, మార్పులు చేర్పులు, తొలగింపులపై ఆన్‌లైన్‌లో వచ్చిన వినతులు చూసి షాక్‌కు గురయ్యారు. నియోజకవర్గ పరిధిలో 8,020 మంది కొత్తగా ఓటర్లు నమోదు చేసుకోవడానికి దరఖాస్తులు ఇవ్వగా సవరణల కోసం 1,019మంది, బూత్‌ మార్పు కోసం 439 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇదే సమయంలో 7 వేల మందికి పైగా ఓట్లను తొలగించాలని ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. 

మరిన్ని వార్తలు