అంతరిక్షంలోకి మనమూ మనుషులను పంపొచ్చు!

18 Dec, 2014 14:11 IST|Sakshi
అంతరిక్షంలోకి మనమూ మనుషులను పంపొచ్చు!

జీఎస్ఎల్వీ మార్క్‌- 3 ప్రయోగం విజయవంతం కావడంతో.. ఇక మన దేశం సగర్వంగా మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలు చేయడానికి మొదటి అడుగు పడినట్లయింది. అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపడం ఇప్పటివరకు కేవలం అగ్రరాజ్యాలకు మాత్రమే తెలిసిన విద్య. ఇక మీదట మనవాళ్లు కూడా సురక్షితంగా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపగలరన్న విశ్వాసం కుదిరింది.  రూ.155 కోట్ల ఖర్చుతో చేసిన ఈ ప్రయోగం.. తొలి అడుగులోనే ఘన విజయం సాధించింది. ఇస్రో ఇంతవరకు చేసిన అత్యంత బరువైన ప్రయోగం ఇదే. జీఎస్ఎల్వి మార్క్-3 ద్వారా క్రూ మాడ్యూలును నింగిలోకి పంపి, అక్కడి నుంచి మళ్లీ సురక్షితంగా నేల మీదకు తీసుకురాగలిగారు మన ఇస్రో శాస్త్రవేత్తలు. రాకెట్ పైభాగంలో మూడు వేల కిలోల కంటే బరువైన క్రూ మాడ్యూల్‌ (వ్యోమగాముల గది)ను అమర్చారు.

భూమి నుంచి 126 కిలోమీటర్లు పైకి వెళ్లిన తరువాత దీనిని రాకెట్ వదిలేసింది. పారాచూట్ల సాయంతో ఈ క్రూ మాడ్యూల్ తిరిగి భూమికి చేరుకుంది. అండమాన్కు సమీపంలోని సముద్రం వద్ద దీన్ని ఇస్రో బృందం సేకరించింది. అండమాన్లోని ఇందిరా పాయింటుకు 180 కిలోమీటర్ల దూరంలో ఈ మాడ్యూల్ సముద్రంలో పడింది. మూడు టన్నులు, 3.1 మీటర్ల వ్యాసం ఉన్న ఈ మాడ్యూలు.. 31 మీటర్ల వ్యాసం ఉన్న పారాచూట్ సాయంతో కిందకి దిగింది. సెకనుకు 7 కిలోమీటర్ల వేగంతో మాడ్యూల్ కిందకు వచ్చింది. ఈ మాడ్యూలును ఆగ్రాలోని డీఆర్డీఓలో తయారుచేశారు. ఇద్దరి నుంచి ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లేలా దీన్ని రూపొందించారు.

మరిన్ని వార్తలు