మిస్టరీగా మారిన మానస కేసు

27 Apr, 2016 03:59 IST|Sakshi
మిస్టరీగా మారిన మానస కేసు

* నూడుల్సే కారణమంటున్న తల్లిదండ్రులు
* ఫోరెన్సిక్ లేబరేటరీకి వివరాలు

యనమలకుదురు (పెనమలూరు): యనమలకుదురు గ్రామం లో సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పదో తరగతి విద్యార్థిని వెలిశిల మానస(15)కేసు మిస్టరీగా మారింది. బాలిక నూడిల్స్ తిని మృతి చెందిందని తల్లిదండ్రు లు చెబుతుండగా, వడదెబ్బ వలనే ఆమె మృతి చెందిందని వైద్యులు, పోలీసులు భావిస్తున్నారు. కేసు వివాదంగా మారటంతో పూర్తి వివరాల కోసం హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ లేబరేటరీకి వివరాలు పంపారు.

యనమలకుదురు అంబేడ్కర్‌నగర్‌కు చెందిన వెలిశిల విజయ్‌కుమార్‌కు ముగ్గురు కుమార్తెలు. తల్లిదండ్రులు కొండపల్లికి వెళ్లటంతో ఇంట్లో ఉన్న మానస, మమత, నమ్రత సమీపంలో ఓ షాపులో ప్రముఖ కంపెనీకి చెందిన నూడుల్స్ కొని ఇంట్లో వండుకుని శీతల పానీయంతో తిన్నారు. కొద్ది సమయానికి మానస వాంతులు చేసుకుని కుప్పకూలి పోయింది. మిగతా ఇద్దరూ స్వల్ప అస్వస్థతకు గురైనా వారికి ఏమీ కాలేదు. మానసను వైద్యం కోసం విజయవాడ తరలించగా ఆమె చనిపోయింది. అయితే ఆమె ఎందుకు చనిపోయిందనేది మిస్టరీగా ఉంది.
 
తల్లిదండ్రులు ఏమంటున్నారంటే..
ఆమె తల్లితండ్రులు మాత్రం తమ బిడ్డ నూడుల్స్ తినటం వలనే చనిపోయిందని చెబుతున్నారు. దీంతో పోలీసులు నూడుల్స్ ప్యాకెట్, వండగా మిగిలిన నూడుల్స్, శీతలపానీయం సీజ్ చేశారు. అలాగే నూడుల్స్ అమ్మిన కొట్టు యజమాని తమ్ము సుశీల స్టేట్‌మెంట్‌ను పోలీసులు నమోదు చేశారు. నూడుల్స్ చాలా మందికి అమ్మానని వాటి డేట్ ఎక్సపేర్ కాలేదని ఆమె పోలీసులకు తెలిపింది. పోలీసులు మానస మృతదేహానికి పోస్టుమార్టం చేయించి ఆయా వివరాలు, సీజ్ చేసిన ఆహార పదార్ధాన్ని హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ లేబరేటరీకి పంపారు. ఈ నివేదిక నెల రోజుల్లో వస్తుందని పోలీసులు తెలిపారు.అప్పటి వరకు కేసు విషయం ఏమీ తేల్చి చెప్పలేమన్నారు.

మరిన్ని వార్తలు