ఈ-మస్తర్ ఏదీ? ఎక్కడ!

12 Dec, 2013 01:51 IST|Sakshi
ఈ-మస్తర్ ఏదీ? ఎక్కడ!

=జిల్లాలో సక్రమంగా అమలుకాని కొత్త విధానం
 =మాన్యువల్‌గానే ఉపాధి పనుల వివరాలు నమోదు
 =అక్రమాలకు ఊతమిస్తున్న పాత పద్ధతి

 
సాక్షి,  విశాఖపట్నం: ఉపాధి హామీ పథకం పనుల మస్తర్ల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చిందా? ఈ-మస్తర్ విధానం పనిచేయడం లేదా? మాన్యువల్ మస్తర్లే గత్యంతరమా? అక్రమాలు మళ్లీ చోటు చేసుకోక తప్పదా? ఈ-మస్తర్ కోసం కుమ్మరిస్తున్న నిధులు నిరుపయోగమేనా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఉపాధి పనుల మస్తర్లలో అక్రమాలు జరుగుతున్నాయని, క్షేత్ర స్థాయి సిబ్బంది  చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న కారణంతో  2010లో ఈ-మస్తర్ విధానాన్ని జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు.

ఒక సాప్ట్‌వేర్ కంపెనీతో ఒప్పందం చేసుకుని ఈ విధానాన్ని ప్రారంభించారు. దీంతో జిల్లాకు ప్రత్యేక పురస్కారం కూడా లభించింది. ఆదర్శంగా తీసుకుని ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణాభివృద్ధిశాఖ అమల్లోకి తెచ్చింది. కానీ ప్రారంభమైన చోటే వ్యవహారం మొదటికొచ్చింది. ఏజెన్సీలో సిగ్నల్ సమస్యతో తొలి నుంచి ఈ-మస్తర్ విధానం పనిచేయకపో గా తాజాగా మైదానంలో పనిచేయడం లేదు. సెల్‌ఫోన్‌లు పనిచేయడం లేదని, వాతావరణం అనుకూలించడం లేదని, ఇతరత్రా సాంకేతిక సమస్యల కారణంగా మాన్యువల్‌గా తీసుకుని మస్తర్లు వేస్తున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయన్న కారణంతో మాన్యువల్‌గా తీసుకుని మస్తర్లు క్రోడీకరిస్తున్నారు.

ఇటీవల ఉపాధి మస్తర్ల నమోదునే ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈనెల 6న ఈ-మస్తర్ ద్వారా 1380 మందికి మస్తర్లు పడగా, 5088 మాన్యువల్ మస్తర్లు నమోదయ్యాయి. అలాగే 7న ఈ-మస్తర్ ద్వారా 1405మస్తర్లు పడగా, మాన్యువల్‌గా 7286 మస్తర్లు పడ్డాయి. 9న ఈ-మస్తర్ ద్వారా 4929పడగా, మాన్యువల్‌గా 8627మస్త ర్లు నమోదయ్యాయి. ఈ-మస్తర్ల కన్నా.. మా న్యువల్ మస్తర్లే ఎక్కువవుతున్నాయి. చేతివాటాన్ని అరికట్టాలన్న సంకల్పంతో ప్రవేశపెట్టిన విధానం సక్రమంగా పనిచేయకపోవడంతో వ్యవహారం మొదటికొచ్చినట్టవుతోంది. అంటే అక్రమాలకు మళ్లీ అవకాశమిచ్చినట్టే.

మాన్యువల్ మస్తర్లపై ఇటీవల జరిగిన ఒక సమీక్షలో కలెక్టర్ కూడా అధికారులను నిలదీసినట్టు తెలి సింది. తప్పనిసరిగా ఈ-మస్తర్ ద్వారానే వే యాలని ఆదేశించినట్టు సమాచారం. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ-మస్తర్ కోసం చేసిన ఖర్చు కూడా నిరుపయోగమవుతోంది. ఇప్పటికైనా కొత్త విధానంపై దృష్టిసారించకపోతే సంపాదించిన పేరంతా పోవడమే కాకుండా గమనించలేనంత అక్రమాలు జరిగే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని డ్వామా అడిషనల్ పీడీ ఆనందరావును ‘సాక్షి’ వివరణ కోరగా పలు సమస్యలు కారణంగా మాన్యువల్‌గా తీసుకోవల్సి వస్తోందని, పరిష్కారమయ్యేలా త్వరితగతిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
 

మరిన్ని వార్తలు