ఆ ఊరి దారుబొమ్మలకు అందమెక్కువ..

25 Oct, 2017 07:21 IST|Sakshi

తెల్లజిల్లేడు దారుబొమ్మల తయారీకి కేరాఫ్‌ కడపగుంట దళిత వాడ  

వంద కుటుంబాలకు  ఇదే ఉపాధి  

ప్రముఖ దేవాలయాల వద్ద విక్రయం

దేవుడే దిగివచ్చాడా..తనకు తానే ఒదిగిపోయి ఊపిరి పోసు కున్నాడా? అనిపిస్తుంది ఆ హస్తకళా చాతుర్యాన్ని తిలకిస్తే. ఆ దారుబొమ్మలు దేనికవే దివ్య కళాదృష్టితో అపు రూపంగా దర్శనమిస్తాయి. తెల్లజిల్లేడుతో వినాయక దారుశిల్పాల తయారీకి ఆ ఊరు ఖ్యాతి గాంచింది. గంగాధరనెల్లూరు మండలం కడపగుంట దళితవాడలో వంద కుటుంబాలు దారు శిల్పాల తయారీయే వృత్తిగా జీవిస్తున్నాయి. గ్రామానికి చెందిన షణ్ముగం  పొట్ట చేతపట్టుకుని చెన్నైకి వలస వెళ్లి దారు వినాయక శిల్పాల తయారీని నేర్చుకుని వచ్చాడు. అదే ఇప్పుడు గ్రామానికి ఉపాధి కల్పిస్తోంది. ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తే మరింతగా రాణిస్తామని కళాకారులు చెబుతున్నారు. మైమరిపించే సుందర కళాకృతుల తయారీ వెనుక ఉన్న శ్రమైక జీవన సౌందర్యంపై ప్రత్యేక కథనం..

తమిళనాడు  వ్యాపారస్తుల నుంచి తెల్ల జిల్లేడు బెరడులను  కొనుగోలు చేస్తారు. ఒక్కొక్కటి 20 రూపాయల నుంచి 40 రూపాయల వరకు కొనుగోలు చేస్తారు. ఒక బెరడుతో ఆరు నుంచి ఎనిమిది  బొమ్మల వరకు తయారు చేస్తారు. సైజును బట్టి 30 రూపాయల నుంచి వంద రూపాయల వరకు విక్రయిస్తారు. రోజుకు ఒక కార్మికుడు 15 బొమ్మల వరకూ తయారు చేస్తాడు. రోజుకు 300 రూపాయల నుంచి 400 వరకు ఆదాయం ఉంటుంది. తయారు చేసిన బొమ్మల్ని తమిళనాడులోని తిరుచ్చి, చెన్నై, కాణిపాకం, తిరుమల, శ్రీశైలం తదితర పుణ్యక్షేత్రాల్లో వ్యాపారాలు చేసే వారికి   విక్రయిస్తుంటారు. ఇటీవల డీఆర్‌డీఏ శాఖ   వీరికి  నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది.

గిరాకీ ఉంది
తెల్లజిల్లేడుతో తయారు చేసిన బొమ్మలకు మంచి గిరాకీ ఉంది. రోజుకు 300 రూపాయల నుంచి 400 వరకు ఆదాయం వస్తుంది. ఇంట్లోనే ఉండి పని చేస్తున్నా. ఇంట్లోని మహిళలు కూడా బొమ్మల తయారీకి సహకరిస్తుంటారు. –వినాయక్,కడపగుంట

రుణం ఇవ్వాలి
ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలి. ఒక్కోసారి తెల్లజిల్లేడు దొరకదు. ఎక్కువ మొత్తానికి కొనుగోలు చేయాల్సి వస్తుంది. బ్యాంకు  రుణం అందిస్తే అర్థికాభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది. రోజుకు 300 రూపాయల ఆదాయం వస్తుంది.-ఉష, కడపగుంట

సంతృప్తిగా ఉంది
తెల్లజిల్లేడుతో బొమ్మలు తయారు చేసే పనిని నేను మొదట తమిళనాడులో నేర్చుకున్నాను.  గ్రామంలో అందరూ నా వద్ద పని నేర్చుకున్నారు. సంతృప్తిగా ఉంది. మహిళలు సైతం బొమ్మలు తయారు చేస్తారు. ఇంట్లోనే ఉండి పని చేసుకోవచ్చు. –షణ్ముగం, కడపగంట

మరిన్ని వార్తలు