కొబ్బరి పొట్టుతో ప్రయోజనాలెన్నో!

5 Sep, 2014 01:26 IST|Sakshi
కొబ్బరి పొట్టుతో ప్రయోజనాలెన్నో!

సేంద్రియసాగు
సేంద్రియ ఎరువు తయారీకి అవకాశం
నీటి లభ్యత లేని ప్రాంతాలకు వరం
అమలాపురం : కొబ్బరి చెట్టు కల్పతరువు. దీని నుంచి వచ్చే కాయలే కాదు..  అన్ని పదార్థాలు రైతుకు ప్రయోజనం చేకూర్చేవే. కొబ్బరి కాయ లు ఒలిచిన తర్వాత వచ్చే డొక్కలు, పీచు వృథా పోకుండా వంట చెరుకుగా వాడుతున్నారు. దీనిని మరింత ఉపయుక్తంగా నారతీసి రకరకాల అవసరాలకు వినియోగించినప్పుడు ఉప ఉత్పత్తిగా ‘పొట్టు’ వస్తుంది. గతంలో ఇటుక బట్టీల్లో దీనిని వినియోగించేవారు. అయితే వ్యవసాయ అవసరాల కోసం కొబ్బరి పొట్టును విని యోగించుకుంటే ఎన్నో ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు.

అమలాపురం రైతుమిత్ర రూరల్ టెక్నాలజీ పార్కు కన్వీనర్ (94402 50552, 93925 50552) అడ్డాల గోపాలకృష్ణ. వివరాలు ఆయన మాటల్లోనే... కొబ్బరి పీచును ఉత్పత్తి చేసే సమయంలో వచ్చే కొబ్బరి పొట్టుతో ఎన్నో వ్యవసాయ ఉపయోగాలున్నాయి. ఈ పొట్టును నేరుగా పొలంలో వినియోగించకూడదు. దానిని శుద్ధిచేసి.. ఆ తరువాత కుళ్లబెట్టి రకరకాలుగా వినియోగించవచ్చు. దీంతో మంచి సేంద్రియ ఎరువును తయారుచేసుకోవచ్చు.
 
శుద్ధి చేసి వాడాలి

 
డొక్కల నుంచి నార (కోకోనట్ యార్న్) తీయగా వచ్చే ‘కొబ్బరిపొట్టు’లో ముందుగా చిన్న చిన్న నారముక్కలు వేరయ్యేలా జల్లెడ పట్టాలి. తర్వాత పెద్ద సిమెంట్ తొట్టెలో నీరు నింపి నాలుగు రోజులు ఉంచాలి. ఆపై ఆ నీరు తీసి మళ్లీ కొత్త నీటితో తొట్టె నింపాలి. ఒక రోజు ఉంచి మరుసటి రోజు పొట్టును తీసి ఎండలో ఆరనివ్వాలి. ఇలా ఆరిన పొట్టులో ‘లిగ్నన్’ బాగా తగ్గుతుంది. దీనిని ప్రత్యేక యంత్రాలతో ఇటుకల మాదిరిగా కంప్రెస్ చేసి మార్కెటింగ్ చేస్తారు.
 
ప్రత్యేకించి పోషక విలువలు ఏమీ లేకపోయినా ఎడారి ప్రాంతాల్లో నీటి సామర్థ్యం పెంచేందుకు ఈ కొబ్బరి పొట్టు ఇటుకలు బాగా ఉపకరిస్తాయి. త్వరత్వరగా నీరు పోయనవసరం లేకుండా ఈ ఇటుకలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కుండీల్లో, నేలలో వేసి నీరు పెడతారు. ఆపై 10 నుంచి 15 రోజుల వరకు మొక్కలకు కావాల్సిన తేమ ఈ ఇటుకల నుంచి నెమ్మదిగా విడుదలవుతుంది.
 
నేరుగా ఎందుకు వాడకూడదంటే...
కొబ్బరి పొట్టును నేరుగా వినియోగిస్తే దీనిలో ఉన్న లిగ్నన్ మొక్కలకు హాని చేస్తుంది.
కుళ్లబెట్టకపోతే మొక్కలకు ఎరువుగా ఉపయోగపడదు.
పోషకాలను పట్టి ఉంచే లక్షణాన్ని కోల్పోతుంది.
నీటి నిల్వ సామర్థ్యం కూడా తక్కువగా ఉంటుంది.
సి : ఎన్ (కర్బనం, నత్రజనిల నిష్పత్తి) మొక్కలకు అనుకూలంగా ఉండదు.
దీనిని శుద్ధి చేసి కొన్ని రకాలుగా, కుళ్లబెట్టి మరికొన్ని అవసరాలకు వినియోగించుకోవచ్చు.
 
ఎరువు తయారీ ఇలా..

కొబ్బరి పొట్టును సేంద్రియ ఎరువుగా వినియోగించుకోవాలంటే దీనిని తప్పని సరిగా కుళ్లబెట్టాలి.
ఒక టన్ను కొబ్బరి పొట్టులో ఐదు కేజీల రాతి భాస్వరం, ఐదు కేజీల యూరియా వేసి తడిపి 10 నుంచి 15 రోజుల పాటు నిల్వ ఉంచాలి. ఇలా ఉంచిన పొట్టును పొరలు పొరలుగా తడుపుతూ ఐదు కేజీల ప్లూరోటస్ సాజర్‌కాజూ అనే శిలీంధ్రాన్ని (పుట్టగొడుగుల తయారీలో వాడతారు) చల్లి నీటితో పలుచగా తడపాలి.
పొట్టును నాలుగు అడుగుల వెడల్పు, సుమారు మూడడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు కలిగిన కుప్పలా చేయాలి. దీనికి సూర్యరశ్మి నేరుగా తగలకుండా (నీడ) ఏర్పాటు చేయాలి. బాగా పైభాగంలో కొబ్బరి ఆకులు కప్పితే మరింత చల్లగా ఉండడం వల్ల శిలీంధ్రం వేగంగా విస్తరించి పొట్టు త్వరగా కుళ్లిపోతుంది.
సాధారణంగా శీతాకాలం చల్లగా ఉండ డం వల్ల ఈ ప్రక్రియ వేగంగా 60 నుంచి 90 రోజుల్లో కొబ్బరి పొట్టు కుళ్లిపోతుంది. ఆవు పేడ, దాని మూత్రం, గ్లైరిసిరియాలను ఈ పొట్టులో పొరల మధ్య వేయడం ద్వారా పొట్టు మరో పది రోజులు ముందుగా కుళ్లడమే కాకుండా మరింత నత్రజని శాతం పెరిగి వ్యవసాయాని బాగా ఉపయోగపడుతుంది.
ప్లూరోటస్ సాజర్ కాజూను కేరళ, ధవళేశ్వరంల్లో క్వాయర్ బోర్డు కార్యాలయాలు, అంబాజీపేట హెచ్‌ఆర్‌ఎస్‌లో గాని రైతులు పొందవచ్చు.
పొట్టు కుళ్లే 90 రోజుల సమయంలో రెండు లేదా మూడుసార్లు బాగా తడిపితే పొట్టు మరింత త్వరగా కుళ్లుతుంది.
 
కలిగే ప్రయోజనాలు
పొట్టుతో తయారు చేసిన సేంద్రియ ఎరువును అన్ని రకాల పంటలకు వాడవచ్చు.
దీనికి నీటి నిల్వ సామర్థ్యం చాలా ఎక్కువ. నీరు లభ్యత తక్కువగా ఉండే కరువు ప్రాంతాలకు ఇది వరం.
అతి తక్కువ బరువు ఉండడం వల్ల విమానాల్లో రవాణా చేసే మొక్కలకు ఉపయోగకరం. ప్రయాణాల్లో నీరు వేయాల్సిన పని లేదు.
పాలీ హెజ్‌ల్లో, నర్సరీ ట్రేలల్లో, జర్జెరా, కార్నేషన్ వంటి పూలమొక్కలకు బాగా ఉపయోగపడుతుంది.
కూరగాయల విత్తనాలు ట్రేలలో పెంచేందుకు వాడుకోవచ్చు.
సేంద్రియ, జీవన, రసాయనిక ఎరువులను నీటితో కలిపి సులువుగా దీనిలో వేసి మొక్కలకు నెమ్మదిగా అందించవచ్చు.
ఈ పొట్టు వల్ల మొక్కల వేర్లకు గాలి బాగా సోకి మొక్క ఆరోగ్యంగా పెరుగుతాయి.
వేసవిలో మొక్కలకు నీటి ఎద్దడికి గురి కాకుండా నర్సరీ కవర్‌లో పైన వేసేందుకు చాలా ఉపయోగపడుతుంది.
నీరు లేని (కంప్రెస్డ్) కుళ్లిన కొబ్బరి పొట్టు బరువు చాలా తక్కువగా ఉండడం వల్ల దూర ప్రాంతాలకు తక్కువ వ్యయంతో ఎక్కువ పొట్టును రవాణా చేయవచ్చు.

మరిన్ని వార్తలు