కోటి ఆశలు

9 Jun, 2015 05:42 IST|Sakshi
కోటి ఆశలు

- ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీ అమలు అయ్యేనా?
- పూర్తి స్థాయిలో భర్తీ కాని ఉద్యోగాలు
- ఉద్యోగులకు రెఫరల్ ఆస్పత్రుల మంజూరు జరిగేనా?  
- ఇళ్ల స్థలాల కల నేరవేరేనా !
సాక్షి ప్రతినిధి,తిరుపతి/అర్బన్:
తిరుమలలో మంగళవారం జరగనున్న టీటీడీ పాలకమండలి తొలి సమావేశంపై టీటీడీ ఉద్యోగులు కోటి ఆశలు పెట్టుకుని ఉన్నారు. గతంలో జరి గిన పాలకమండళ్ల సమావేశాల్లో ఇచ్చిన హామీలు చాలా వరకు అమలుకు నోచుకోలేదు. అయితే ప్రస్తుత చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి స్థానికుడు కావడంతో ఈ పాలకమండలి సమావేశం తమ సమస్యల పరిష్కారానికి వేదిక అవుతుందని టీటీడీ ఉద్యోగులు భావిస్తున్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని అన్ని విభాగాల్లో ఖాళీలను పూర్తిస్థాయిలో భర్తీ చేయపోవడంతో కొత్త పాలక మండలి ఈ అంశంపై దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు.

మూడేళ్ల క్రితం టీటీడీలోని ఉద్యోగులందరికీ అత్యాధునిక వైద్యసౌకర్యాలు అందేలా బెంగళూరు, చెన్నై, వేలూరు, విజయవాడ నగరాల్లో కార్పొరేట్ ఆస్పత్రులను రెఫరెల్ ఆస్పత్రులుగా కేటాయించేందుకు చేసిన తీర్మానం వాయిదా పడుతూ వస్తోంది. ఈ అంశాన్ని కొత్త పాలకమండలి  పరిష్కరిస్తుందన్న ఆశతో ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. వీటన్నింటితో పాటు ఉద్యోగులు, సిబ్బందికి పూర్తి స్థాయిలో మేలు జరిగే నిర్ణయాలు, ఇళ్ల స్థలాల మంజూరు కూడా కొత్త పాలకమండలి పరిగణనలోనికి తీసుకోవాలని టీటీడీ యూనియన్లు, ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో సమానంగా టీటీడీ ఉద్యోగులకు కూడా పీఆర్‌సీ అమలు చేసేలా చర్యలు తీసుకునేందుకు ఈవో ప్రారంభించిన ప్రతిపాదనలు ఆచరణలోకి త్వరగా తీసుకొచ్చి న్యాయం చేయాలన్న ఉద్యోగుల డిమాండ్ ఫలిస్తుందని వేచి చూస్తున్నారు. 2010లో జరిగిన కొద్దిపాటి నియామకాల్లో కూడా అటెండర్ల ఉద్యోగాలను భర్తీ చేయలేదు.

అయితే ఈ ఐదేళ్ల కాలంలో తిరుమల, తిరుపతి పుణ్యక్షేత్రాల్లో వసతి గృహాలు, గెస్ట్ హౌస్‌లు, టీటీడీ కార్యాలయ భవణాల నిర్మాణాలు భారీ స్థాయిలో జరిగాయి. దీంతో వీటన్నింటికీ అటెండర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కొన్ని అతిథి గృహాలకైతే అటెండర్లు కూడా లేకుండానే ఉద్యోగులే నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. సుమారు 300 అటెండర్ పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. తిరుపతిలోని స్విమ్స్ ఆధ్వర్యంలో అన్ని విభాగాల వైద్యసేవలు, మరిన్ని సూపర్ స్పెషాలిటీ విభాగాలను టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేందుకు పాలకమండలి చర్యలు తీసుకోవాల్సి ఉంది.

చివరిగా ఉద్యోగుల జీతభత్యాలు పెంచే దిశగా పాలకమండలి ఇప్పటికే ఓ ప్రణాళిక రూపొందించుకుని నివేదికలు సిద్ధం చేసుకున్న నేపథ్యంలో చర్యలు జోరుగా జరుగుతాయా? అని ఉద్యోగులు, సిబ్బంది ఎదురుచూస్తున్నారు. టీటీడీలో 9వేల మంది ఉద్యోగులున్నారు. వీరికి నెలకు దాదాపు *21 కోట్ల జీతాలు చెల్లిస్తోంది. అయితే పీఆర్సీ వస్తే అదనంగా *4.5 కోట్ల భారం పడుతుందని నివేదిక సిద్ధం చేసినట్లు తెలిసింది. టీటీడీలో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు పాలక వర్గం కొత్త నిర్ణయాలు ప్రకటిస్తుందేమోనని భక్తులు ఎదురు చూస్తున్నారు.

తిరుపతి అభివృద్ధిపై..
తిరుపతి నగరం టీటీడీలో అంతర్భామేననని, దీనిని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి పదేపదే చెబుతున్నారు. ఈ హామీ కార్య రూపం దాల్చితే బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు