సాగు.. బాగైంది!

27 May, 2020 03:50 IST|Sakshi

‘మన పాలన–మీ సూచన’లో సీఎంతో ముచ్చటించిన రైతులు, లబ్ధిదారులు, శాస్త్రవేత్తలు

రైతుల గురించి సీఎం జగన్‌ ఆలోచనలు బాగున్నాయి

మాట మేరకు రైతు భరోసా ఇచ్చారు 

కోవిడ్‌తో కుదేలైన ఆక్వా రైతులను ఆదుకున్నారు

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట ప్రకారం రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయాన్ని అందిస్తూ వ్యవసాయాన్ని పండుగ చేసి కొండంత అండగా నిలిచారని పలువురు రైతులు, రైతు సంఘాల నేతలు, శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆక్వా రైతుల గురించి గతంలో ఏ సీఎం పట్టించుకోలేదని కరోనా విపత్తు సమయంలో ధర నిర్ణయించి దారుణమైన పరిస్థితి నుంచి గట్టెక్కించారని చెప్పారు. గతంలో వైఎస్‌ఆర్‌ గిరిజనులకు పట్టాలు ఇచ్చారని, ఇప్పుడు మళ్లీ  మీరు (సీఎం జగన్‌) పట్టాలు ఇస్తున్నారని ఓ ఆదివాసీ మహిళా రైతు కృతజ్ఞతలు తెలిపింది. ‘మన పాలన– మీ సూచన’లో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మేధోమధన సదస్సులో పలువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. 

రైతులకు భరోసాతోపాటు ఆత్మగౌరవం..
సీఎం గారు చెప్పిన విషయాలన్నీ ఆకళింపు చేసుకుంటే మేం అడిగేందుకు ఇంకేమీ మిగలలేదు. గ్రామ స్ధాయి పరిపాలన సుస్ధిరంగా ఏర్పాటు చేస్తే గ్రామ స్వరాజ్యం సాకారమవుతుంది. రాష్ట్రంలో 8 లక్షల హెక్టార్ల వృధా భూములున్నాయి. ఏటా పచ్చదనం పెంచే కార్యక్రమాన్ని చేపట్టాలి. రైతులు పండించే పంటలో కనీసం 30 శాతం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం గొప్ప విషయం. రైతుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు గ్రామ స్ధాయిలో చేస్తున్నారు. సచివాలయాల ఏర్పాటు ద్వారా వేల ఉద్యోగాలను ఎలాంటి అవినీతికి తావులేకుండా చేపట్టారు కాబట్టి నిజాయితీగా పనిచేస్తున్నారు. రైతులకు మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ చూస్తుంటే భరోసాతో పాటు ఆత్మగౌరవాన్ని కూడా ఇనుమడింప చేస్తున్నారు. రైతుల కోసం పట్టణాల్లో రాజన్న వసతి గృహాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలి.
  – రాఘవరెడ్డి, రిటైర్డ్‌ వైస్‌ చాన్స్‌లర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం

ఆదివాసీలను ఆదరించారు..
మా ఆదివాసీ బిడ్డకే డిప్యూటీ సీఎం పదవిచ్చి గౌరవించారు. గ్రామ సచివాలయాల ద్వారా గిరిజన సమాజానికి పాలన అందించే ఘనత మీకే దక్కింది. గిరిజన ప్రాంతాల్లో పండించే చిరుధాన్యాలను ప్రోత్సహించేందుకు మిల్లెట్స్‌ బోర్డు పెట్టారు. అటవీ హక్కుల చట్టం గురించి 30వ తేదీన క్యాలెండర్‌లో పొందుపర్చారు. ఉపాధిహామీని వ్యవసాయంతో అనుసంధానిస్తే వలసలు తగ్గుతాయి. 
– పడాల భూదేవి, హిరమండలం, శ్రీకాకుళం జిల్లా

మన బలం వ్యవసాయమే..
చాలా రాష్ట్రాలు పరిశ్రమలు అంటూ ముందుకు వెళ్తున్నాయి. మనం వ్యవసాయంలో ముందున్నాం. దానిమీద మనం దృష్టి సారించాలి. మన బలం మీదే దృష్టి కేంద్రీకరించాలి. ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌తో మన అరటి, ఏపీ క్వాలిటీ సర్టిఫికెట్‌తో మిరప ఎగుమతి కావాలి. ప్రపంచంలో నాణ్యతతో కూడిన ఎగుమతిదారుగా ఏపీ గుర్తింపు పొందాలి.  అతిపెద్ద వ్యవసాయోత్పత్తుల ఎగుమతి కేంద్రంగానూ గుర్తింపు రావాలి. వ్యవసాయం, జనాభా, పరిమాణంలో మనం వియత్నాంను పోలి ఉంటాం. ఆ దేశం సాధించిన విజయాన్ని మనం కూడా కచ్చితంగా సాధించగలుగుతాం. ఐదారు  క్లస్టర్లను ఏర్పాటు చేసి పెట్టుబడులను ఆకర్షించాలి.     
    – సంజీవ్, డివిజనల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్, ఐటీసీ

మత్స్యకారులకు బాసట..
గత ప్రభుత్వంలో మత్స్య భరోసా కింద రూ.4వేలు ఇచ్చేవారు. అది చాలామందికి వచ్చేది కాదు. మీరు సీఎం అయిన తరువాత రూ.10 వేలు అందరి ఖాతాల్లో పడింది.  గత ప్రభుత్వంలో రూ.6 డీజిల్‌ సబ్సిడీ ఇస్తుండగా మీరు దాన్ని రూ.9 చేశారు. దీనివల్ల మా కుటుంబానికి నెలకి రూ.3 – 4 వేల ఆదాయం వస్తోంది. వేటకు పోయి మరణిస్తే గతంలో రూ.5 లక్షలు ఇచ్చేవారు. మీరు దాన్ని రూ.10 లక్షలకు పెంచారు. గుజరాత్‌కు వలస వెళ్లిన 6 వేల మంది మత్స్యకార్మికులను బస్సుల్లో తీసుకొచ్చి రూ.2 వేల చొప్పున ఇవ్వడం గొప్ప విషయం. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్భర్‌ మా కల, దాన్ని నెరవేరిస్తే మా మత్స్య కారులు ఇటు చెన్నై, కర్ణాటక, గుజరాత్‌ వలసపోవాల్సిన అవసరం ఉండదు.    
– కోమరి రాజు, కావలి, నెల్లూరు, జిల్లా 

ఈయనేం చేస్తాడనుకున్నాం..
బీటెక్‌ చదివి సాప్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయం చేస్తున్నా. గత ప్రభుత్వాలు వ్యవసాయం దండగ అనే అభిప్రాయాన్ని మాపై రుద్దాయి. మీరు నవరత్నాలు ప్రకటించినప్పుడు ఈ రాష్ట్రంలో గత పాలకులు ఏం మిగిల్చారు? ఇక ఈయనేం చేస్తాడని అనుకున్నాం. మీమీద నమ్మకంతో తక్కువ పెట్టుబడితో సాగయ్యే చిరుధాన్యాలను ఎంచుకున్నాం. మీరిచ్చిన రైతు భరోసా డబ్బులు 90 శాతం పెట్టుబడి ఖర్చులకు ఉపయోగపడ్డాయి. ఒకప్పుడు రైతునని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డ రోజుల నుంచి ఇవాళ నేను రైతునని మీ వల్ల గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను.
    – వెంగళరెడ్డి, మార్కాపురం, ప్రకాశం

రైతు భరోసా డబ్బులతో విత్తనాలు కొంటున్నా..
రైతుభరోసా డబ్బులతో విత్తనాలకు డబ్బులు కట్టి ఈ సభకు వచ్చా. రైతుభరోసా కేంద్రంలో అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ వల్ల మాకు ఏ సమస్య వచ్చినా వెంటనే తెలుసుకోగలగుతున్నాం. తెగుళ్లకు సరైన మందులు తెలుసుకోగలుగుతున్నాం. మినీ గోడౌన్స్‌ కట్టుకునేందుకు  రైతులకు సబ్సిడీ ఇస్తే బాగుంటుంది.
– బెల్లాన బంగారినాయుడు, గరికవలస, గుర్ల మండలం. విజయనగరం జిల్లా

అరటికి ఆదరణ..
కోవిడ్‌ నేపథ్యంలో అరటి రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే తీవ్రంగా నష్టపోయి ఉండేవాళ్లు. రానున్న రోజుల్లో అరటి విస్తీర్ణం బాగా పెరుగుతుంది. చీనీ బెల్ట్‌లో కూడా అరటి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. పుడ్‌ ప్రాసెసింగ్‌తో పాటు విదేశాలకు ఎగుమతి పెంచాలి. పులివెందుల  ప్రాంతంలో ఎర్రవెల్లి ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలి. నియోజకవర్గంలో ట్రాన్స్‌ఫార్మర్ల కొరత ఉంది. వాటిని మంజూరు చేయాలి. జీలుగ, జనుము సబ్సిడీ రూపంలో ఇచ్చే ఏర్పాటు చేయాలి.    
– బలరామ రెడ్డి, వైఎస్సార్‌ జిల్లా, అరటి రైతు

అడగకుండానే గ్రహించిన దేవుడు..
మీరు సీఎం కాగానే ఆక్వా రైతులకు కరెంట్‌ యూనిట్‌ రూపాయిన్నరకే ఇచ్చి గొప్ప మేలు చేశారు. ప్రభుత్వం మీద భారం పడుతున్నా మాట నిలబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు. కోవిడ్‌ సమయంలో రొయ్యల ధరలు దారుణంగా పడిపోయాయి. అప్పుడు మీరు ఆదుకోకుంటే మాకు ఆత్మహత్యలే శరణ్యమయ్యేవి. నేను ఈరోజు మీ ముందు నిలబడి ఉన్నానంటే మీరు నిర్ణయించిన ధర వల్లనే. అడగక ముందే ఎరిగిన వాడు దేవుడు. ఆ దేవుడే మీ రూపంలో రాష్ట్రానికొచ్చాడు.  మరెన్నో కాలాలు మీరే సీఎంగా ఉండి  పేద ప్రజలను ఆదరించాలి. నూజివీడు ట్రిపుల్‌ఐటీలో చదువుతున్న నా కుమార్తెకు రీయింబర్స్‌మెంట్‌ కూడా వచ్చింది.
    – గంగాధరం, ఆక్వారైతు, చల్లపల్లి గ్రామం, ఉప్పలగుప్తం, తూర్పుగోదావరి

ఈ సమయంలో సీఎం జగన్‌ స్పందిస్తూ ఆక్వా రంగంలో ధరల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఇంతవరకు జరగలేదన్నారు. ‘ఆక్వా రంగంలో  సిండికేట్‌ సమస్య ఉంది. ఫీడ్, మార్కెట్‌  ఈ రెండు అంశాల మీద వీటి ప్రభావం ఉంది. వీటిని కట్టడి చేయడం కోసం, రైతులకు తోడుగా నిలబడేవారిని ప్రోత్సహించేందుకు  ఐక్యూఎఫ్‌ను తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. దానివల్ల స్టోరేజీ కెపాసిటీ పెరిగితే తప్పనిసరిగా రేటును మనం నియంత్రించే స్థితి వస్తుంది. దీన్ని కచ్చితంగా చేస్తాం’ అని పేర్కొన్నారు.

నాణ్యమైన ఉత్పత్తులు అవసరం..
అగ్రికల్చర్‌ బీయస్సీ చదివి కేపిఎంజి సంస్ధలో పనిచేస్తున్నా. రైతు భరోసా కేంద్రాలు పునాదిలాంటివి. తక్కువ పురుగుమందుల అవశేషాలతో నాణ్యమైన దిగుబడి సాధించే వారికి అవార్డులు ఇవ్వాలి.
    – గోపీనాథ్‌ కోనేటి, కడప, కేపీఎంజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌

మరిన్ని వార్తలు