ఇదేంటి సార్‌.. ఎన్నికల కోడ్‌ పట్టదా..?

6 Mar, 2019 17:22 IST|Sakshi
నూతనంగా నిర్మించిన కుట్టు శిక్షణ  శిబిరం వద్ద  ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఉన్న ఫ్లెక్సీ

సాక్షి, కిర్లంపూడి: సార్వత్రిక ఎన్నికలకు ముందే జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఉభయ గోదావరి జిల్లాల పట్టభధ్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసి వారం రోజులు దాటింది. ఎన్నికల నియమావళి ప్రకారం అధికార యంత్రాంగం పని చేయాలి. రాజకీయ నాయకులు సైతం ఎన్నికల నియమావళిని తూ.చ తప్పకుండా పాటించాలి.

సార్వత్రిక ఎన్నికలు వస్తాయని ముందుగానే భావించిన అధికార పార్టీ నేతలు పలు గ్రామాల్లో హడావుడి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జెడ్పీ చైర్మన్‌ జ్యోతుల నవీన్‌ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికలు నోటిఫికేషన్‌ రావడంతో మండలంలో చాలా గ్రామాల్లో అధికారులు ఆయా పార్టీల నాయకులకు సమాచారం అందించి ఫ్లెక్సీలు తొలగించాలని సూచించారు.

కొందరు స్పందించకపోవడంతో పలు చోట్ల ఫ్లెక్సీలు తొలగించారు. కృష్ణవరం గ్రామంలో మాత్రం ఎన్నికల నియమావళికి విరుద్ధంగా అధికార పార్టీ నాయకులు పెట్టిన ఫ్లెక్సీలు తొలగించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో గ్రామంలోని అధికార పార్టీ నాయకులకు అధికారులు కొమ్ము కాస్తున్నారని, అందువల్లే ఫ్లెక్సీలు తొలగించలేదని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎన్నికల నియమావళిని అమలు చేయకపోతే ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు