జలదిగ్బంధంలో పలు గ్రామాలు

14 Oct, 2014 11:54 IST|Sakshi
జలదిగ్బంధంలో పలు గ్రామాలు

 వంగర:  ఆదివారం రాత్రి వరకు ఎటువంటి ప్రమాదం ఉండదని భావించిన ఆ గ్రామాలకు సోమవారం వేకువజామున ఐదు గంటలకు ఉలిక్కిపడ్డారు.  సువర్ణముఖి, వేగావతి నదుల నీరు చుట్టుముట్టడంతో ఏం చేయాలో పాలుపోలేదు.  కళ్లు తెరిచి చూసేసరికి గ్రామాల చుట్టూ నీరు చేరిపోవడంతో ఆందోళన చెందారు. ఇదీ వంగర మండలంలోని  కొప్పర, కొండచాకరాపల్లి, గీతనాపల్లి, పాతమరువాడ, ఇరువాడ గ్రామాల దుస్థితి..  
 
 రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు
  తహశీల్దార్ కె.వరప్రసాద్ సమాచారం మేరకు ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన 150 మంది సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆయా గ్రామాలకు చేరుకున్నాయి. కొప్పర గ్రామం నుంచి గర్భిణి కొనపల బంగారమ్మ, రెండు రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న గుగ్గిలాపు తమ్మమ్మలను  బోట్లపై  తీసుకువచ్చి ఆస్పత్రులకు తరలించారు. కొప్పర గ్రామస్తులు సురక్షిత ప్రాంతాలకు వచ్చేందుకు నిరాకరించడంతో కొండచాకరాపల్లి గ్రామస్తులను ఈ బలగాలు సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపడుతున్నారు.  ఎమ్మెల్యే కంబాల జోగులు, జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్,  తుపాను ప్రత్యేకాధికారి సౌరవ్‌గౌర్ కొప్పర, కొండచాకరాపల్లి గ్రామాలను సందర్శించారు. మడ్డువలస ప్రాజెక్టు వద్ద గేట్లను సకాలంలో ఎత్తకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని  సర్పంచ్ కిమిడి సన్యాసినాయుడు ఎస్పీ ఏఎస్ ఖాన్‌కు వివరించారు. మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు.
 
 ఇన్నీసుపేట...
 ఇచ్ఛాపురం: ఇన్నీసుపేట గ్రామం జలదిగ్బంధంలో ఉండిపోయింది. హూదూద్ తుపాను కారణంగా  కురిసిన భారీ వర్షాలకు బాహుదా నదిలో నీటి ప్రవాహం పెరిగి దండుగడ్డకు నీరు ఎక్కువగా రావడం, పద్మనాభపురం గెడ్డ పొంగడంతో గ్రామం చుట్టూ నీరు చేరింది.   మోకాళ్ల లోతు  నీటిలో గెడ్డను దాటుకుంటూ ప్రమాదకరంగా వెళుతున్నారు.  ఇదిలా ఉండగా బాహుదా నది ప్రమాదకర స్థాయి లో ప్రవహిస్తోంది.   ఒడిశాలోని బోగలోట్టి డ్యాం గేట్లను ఎత్తివేయడంతో ఒక్కసారిగా నీరు  నదిలోకి చేరింది.  సుమారు 51,270  క్యూసెక్కుల నీరు నదికి చేరింది. దీంతో  నదీ పరివాహక గ్రామాలైన బొడ్డబడ, టి.బరంపురం, అరకబద్ర, శాసనం, జగన్నాథపురం తదితర గ్రామాలు  ముంపునకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది. దాంతో రెవెన్యూ అధికారులు హుటాహుటిన డ్యాం వద్దకు సోమవారం వెళ్లి పరిస్థితిని అంచనా వేశారు.  
 
 టెక్కలి మండలంలో...
 టెక్కలి:  హుదూద్ ప్రభావం వల్ల రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు  లోతట్టు ప్రాంతాలైన జెండాపేట, సింగుమహంతిపేట, పెద్దరోకళ్లపల్లి, సీతారాంపల్లి, రామనగరం, నాయుడుపేట తదితర గ్రామాలు సోమవారం మధ్యాహ్నానానికి జలదిగ్భంద మయ్యాయి.   వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ ఎగువ ప్రాంతాల నుంచి ఒక్క సారిగా వరద నీరంతా గెడ్డల నుంచి రావడంతో ఈ ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పాత నౌపడ  దాటిన తరువాత రైల్వే క్రాసింగ్ నుంచి  జెండాపేట, సింగుమహంతిపేటతో పాటు పెద్దరోకళ్లపల్లి నుంచి సీతారాంపల్లి, రామనగరం, నాయుడుపేట గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలోకి చేరడంతో ఆయా గ్రామాల ప్రజలకు  బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
 
 వీరఘట్టం మండలంలో రెండు గ్రామాలు...
 వీరఘట్టం:  స్థానిక ఒడ్డిగెడ్డకు వరదనీరు పొటెత్తడంతో  దశుమంతపురం, కంబర గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.  సహాయక చర్యల కోసం స్థానికులు ఎదురు చూస్తున్నారు.  స్త్రీశక్తి, బీసీ బాలికల వసతి గృహం చుట్టూ వరద నీరు చేరింది.
 
 పెనుగొటివాడను ముట్టడించిన నీరు
 కొత్తూరు: హుదూద్ తుపాను ప్రభావంతో ఒడిశా-ఆంధ్ర ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా  వంశధార నదికి సోమవారం వరద నీరు చేరింది. దీంతో మండలంలోని పెనుగొటివాడ  జలదిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామంలో సుమారు 50 కుటుంబాలు నివసిస్తున్నాయి.  మాతల వద్ద పీహెచ్ రోడ్డు మీదుగా వరద నీరు ప్రవహించడంతో కొత్తూరు నుంచి వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. వరద నీరు కారణంగా మండలంలో కుంటిభద్ర, మాతల, పెనుగొటివాడ, ఆకులతంపర, మదనాపురం, వసప, సురుసువాడతో పాటు పలు గ్రామాల్లో వేలాది ఎకరాలు నీట మునిగాయి.  
 
 అన్నవరం, అంపిలి, గోపాలపురం...
 పాలకొండ: నగర పంచాయతీ పరిధి గారమ్మకాలనీ, వడమ కాలనీల్లోకి వరదనీరు చేరింది. అంపిలి, అన్నవరం, గోపాలపురం గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.   తుపాను కారణంగా రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. పాలకొండ-సీతంపేట రహదారిలో వాబ గెడ్డ పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
    వీరఘట్టం, పాలకొండ రహదారిలోనూ గజాలఖానా వద్ద నీరు పొంగిపొర్లడంతో 24 గంటలు రాకపోకలు నిలిచిపోయాయి.  
 
 ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు
 ఎల్‌ఎన్‌పేట: తుపాను కారణంగా కురిసిన భారీ వర్షానికి మోదుగువలస, బొర్రంపేట, వలసపాడు కాలనీ, చింతలబడవంజ కాలనీ, వాడవలస, మురగడలోవ తదితర గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది.
 
  కొమనాపల్లిలోకి చేరిన వరదనీరు
 సారవకోట రూరల్(జలుమూరు): మండలంలోని కొమనాపల్లి గ్రామంలోకి సోమవారం వరద నీరు చేరింది.   రంగసాగరంలోకి నీరు ఉద్ధృతంగా రావడంతో ఈ పరిస్థితి ఎదురైందని  తహశీల్దార్ ఉమామహేశ్వరరావు తెలిపారు. బీసీ కాలనీలోకి నీరు చేరడంతో గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు చర్యలు తీసుకున్నారు.
 

>
మరిన్ని వార్తలు