మావోయిస్టుల డెన్‌లోకి పీవో..

22 Jun, 2016 04:02 IST|Sakshi
మావోయిస్టుల డెన్‌లోకి పీవో..

యు.చీడిపాలెం, ఎం.భీమవరం, పలకజీడిలో పర్యటన
అదంతా పక్కా మావోయిస్టుల ప్రాంతం
తాగునీటికి, రోడ్లకు నిధులు ఇస్తామని హామీ
ఆశ్రమాల్లో పిల్లలను చేర్చాలని హెచ్‌ఎంలకు ఆదేశం

 
పాడేరు ఐటీడీఏ పీవో ఎం.హరినారాయణన్  మంగళవారం సాహసం చేశారు. పూర్తిగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో సుమారు 35 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశారు. దారకొండ నుంచి గుమ్మిరేవులు మీదుగా  పోతవరం చేరుకున్నారు. ఇలా గూడెం మండలం నుంచి అడ్డదారిలో మొదటిసారిగా ప్రయాణించిన పీవో ఈయనే కావడం విశేషం. గుమ్మిరేవుల అత్యంత మారుమూల ప్రాంతం. అక్కడకు రోడ్డు వేస్తున్నారు. దానిని పరిశీలించేందుకు మంగళవారం బయలుదేరిన ఆయన  కొయ్యూరు మండలం   పోతవరం, ఎం.భీమవరం, యు.చీడిపాలెం, పలకజీడి గ్రామాల్లో పర్యటించారు.

 

కొయ్యూరు: ఒక ఐఏఎస్ అధికారి అత్యంత మారుమూల ప్రాంతాన్ని ఏడాదిన్నరలో మూడు సార్లు సందర్శించడమంటే మాటలు కాదు. మావోయిస్టు కేంద్రాలుగా ఉన్న ప్రాంతాలకు వెళ్లడానికి ఏ ఐఏఎస్ అధికారి కూడా సాహసం చేయరు. అలాంటిది   పీవో హరినారాయణన్ సాహసం చేసి గుమ్మిరేవుల నుంచి పోతవరం చేరుకున్నారు. అక్కడకు ఐదు కిలోమీటర్ల దూరం ఉన్న ఎం.బీమవరం చేరుకున్నారు. అక్కడ ఆశ్రమ పాఠశాలలో పిల్లలు లేకపోవడంతో హెచ్‌ఎంతో పాటు ఇతర ఉపాధ్యాయులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే పిల్లలను తీసుకురావాలని ఆదేశించారు. పలకజీడి, యు.చీడిపాలెం ఆశ్రమ పాఠశాలలను కూడా ఆయన పరిశీలించారు. అక్కడ కూడా పిల్లలు లేకపోవడంతో వెంటనే గ్రామాలకు వెళ్లి పిల్లలను తీసుకురావాలని ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, దోమలు పెరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. యు.చీడిపాలెంలో ఆరోగ్య కేంద్రానికి వెళ్లి   వైద్యసేవలపై ఆరా తీశారు. అక్కడి పాఠశాలను సందర్శించిన ఆయనకు రోడ్డు, తాగునీటి సమస్యలను గ్రామస్తులు వివరించారు. త్వరలో వీరవరం నుంచి యు.చీడిపాలేనికి రోడ్డు పూర్తవుతుందని పీవో చెప్పారు.

తాగునీటికి దపదపాలుగా నిధులు ఇస్తున్నామన్నారు. మారుమూల గూడేల్లో నెలకొన్న తాగునీటి సమస్యను గ్రామస్తులు  ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అన్నింటికీ ఒకేసారి నిధులు  ఇవ్వడం సాధ్యం కాదని, దఫదఫాలుగా ఇస్తామని తెలిపారు. ఈ కాలంలో మరగబెట్టిన నీటిని తాగడం ద్వారా రోగాలకు దూరంగా ఉండవచ్చని సూచించారు.

 
రంపచోడవరం పీవోతో చర్చలు

పీవో యు.చీడిపాలెం నుంచి రంపచోడవరం వెళ్లారు. అక్కడి పీవో చక్రధరబాబుతో చర్చించారు. కొన్ని పాఠశాలలు పాడేరు దూరంగా,  తూర్పుగోదావరి జిల్లాకు దగ్గరగా ఉండటంతో ఆ జిల్లా నుంచి  రేషన్‌ను ఇచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టారు. 

 

మరిన్ని వార్తలు