మావోల లొంగు‘బాట’ !

10 Jan, 2014 04:03 IST|Sakshi
మావోల లొంగు‘బాట’ !

 తమకు సమాచారం ఉందన్న డీజీపీ
 అగ్రనేత గణపతి ఆచూకీ కోసం వాకబు
 ‘ఉసెండి’ దంపతుల లొంగుబాటులో మంత్రి ప్రమేయం లేదు
 డీజీపీ ముందుకు ఉసెండీ దంపతులు

 
 సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ నేతల్లో అత్యధికమంది లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తమకు సమాచారం ఉందని డీజీపీ బి.ప్రసాదరావు చెప్పారు. ఆ పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఆచూకీ కోసం కూడా వాకబు చేస్తున్నామని వెల్లడించారు. రెండు రోజుల కిందట లొంగిపోయిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి గుమ్మడివెల్లి వెంకటకిషన్ ప్రసాద్ అలియాస్ గుడ్సా ఉసెండి, ఆయన భార్య సంతోషి మార్కంను ఎస్‌ఐబీ పోలీసులు గురువారం డీజీపీ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల్లో మావోయిస్టు పార్టీ సభ్యులు అధిక సంఖ్యలో లొంగిపోయారని వివరించారు.
 
 2011లో 212 మంది, 2012లో 297 మంది మావోయిస్టులు, 11 మంది ఇతర విప్లవపార్టీల సభ్యులు, 2013లో 81 మంది మావోయిస్టులతోపాటు 14 మంది ఇతర గ్రూపులవారు లొంగిపోయారని తెలిపారు. మావోయిస్టు కేంద్ర కమిటీ స్థాయి సభ్యుడిపై రూ. 25 లక్షలు, రాష్ట్ర కమిటీ సభ్యుడిపై రూ. 20 లక్షలు, జిల్లా కార్యదర్శిపై రూ. 8 లక్షలు, జిల్లా కమిటీ సభ్యుడిపై రూ. 5 లక్షలు, ఏరియా కార్యదర్శిపై రూ. 4 లక్షలు, ఏరియా కమిటీ సభ్యుడిపై రూ. 2 లక్షలు, దళ సభ్యుడిపై రూ.లక్ష వంతున రివార్డు ఉందన్నారు. ఉసెండి పేరుతో ఉన్న రూ. 20 లక్షల రివార్డును అతని పునరావాసం కోసం అందజేస్తామని తెలిపారు. ఉసెండి దంపతుల లొంగుబాటులో తెలంగాణకు చెందిన మంత్రి పాత్ర లేదన్నారు. ఈ దంపతులపై రాష్ట్రంలో ఎలాంటి కేసులూ లేవని, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలలో మాత్రం కేసులున్నాయని తెలిపారు.
 
 రాజకీయ విభేదాలతోనే లొంగుబాటు
 ఆరోగ్య సమస్యలతోపాటు పార్టీ విధి విధానాలపై కేంద్ర కమిటీతో విభేదించి ఉసెండి దంపతులు లొంగిపోయారని డీజీపీ ప్రసాదరావు ప్రకటించారు. ఇన్‌ఫార్మర్ల పేరిట అమాయకులను విచక్షణారహితంగా హతమార్చడం, పాఠశాల భవనాలు పేల్చివేయడం వంటి విధానాలను పార్టీ వేదికలపైనే ఉసెండి పలుసార్లు ఖండించినట్లు తమ విచారణలో తెలిపాడన్నారు. ఉసెండి 1987లో అరెస్టు కాగా... అనంతరం ఏడుగురు ఐఏఎస్ అధికారుల అపహరణ ఘటన నేపథ్యంలో అతన్ని అప్పట్లోనే బెయిల్‌పై విడుదల చేశామని తెలిపారు.
 
 రహస్య కార్యకలాపాల్లో 275 మంది: మావోయిస్టు పార్టీ 17 మంది కేంద్ర కమిటీ సభ్యుల్లో 11 మంది, అలాగే పొలిట్‌బ్యూరోలోని ఆరుగురిలో నలుగురు మన రాష్ట్రానికి చెందినవారేనని డీజీపీ తెలిపారు. దేశవ్యాప్తంగా 275 మంది తెలుగువారు రహస్య జీవితం గడుపుతున్నారని, వారిలో 77 మంది మన రాష్ట్రపరిధిలోని కమిటీలలో పనిచేస్తున్నారని చెప్పారు. మిగతా 198 మంది ఇతర రాష్ట్రాల కమిటీల్లో పనిచేస్తున్నారని ఆయన వివరించారు. నక్సల్స్‌కు సంబంధించి రాష్ట్రంలో ప్రస్తుతం ఎలాంటి రిక్రూట్‌మెంట్ జరగట్లేదని డీజీపీ వివరించారు.
 
 ఎన్‌ఐఏ కస్టడీకి ఉసెండి?
 ఇదిలాఉండగా ఉసెండి దంపతులను తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కోరే అవకాశముందని తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు మందుపాతరపేల్చి సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మ, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నంద కుమార్ పటేల్ తదితర నేతలను హతమార్చిన సంఘటనకు సంబంధించి ఉసెండి వద్ద కీలక సమాచారం లభ్యంకాగలదని ఎన్‌ఐఏ భావిస్తోంది.

>
మరిన్ని వార్తలు