మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. అగ్రనేత హతం!

22 Sep, 2019 15:24 IST|Sakshi

 అగ్రనాయకురాలు అరుణ ఉన్నట్లు అనుమానం

కిడారి హత్యకు నాయకత్వం వహించిన అరుణ

సాక్షి, విశాఖపట్నం: మావోయిస్టు వారోత్సవాల సమయంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. విశాఖపట్నం జిల్లా జీకే వీధి మండలం మాదినమల్లు అటవీ ప్రాంతంలో ఆదివారం ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు వర్గాలు ఇప్పటికే ధృవీకరించాయి. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ అగ్రనాయకురాలు, అరుణ కూడా ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఇటీవల ఈస్ట్‌జోన్‌కు వచ్చిన అరుణ గతకొంత కాలంగా విశాఖ మన్యంలో పార్టీ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. సుదీర్ఘకాలం పాటు మావోయిస్టు ఉద్యమంలో ఉన్న ఆమె పలు ఆపరేషన్స్‌లో పాల్గొన్నట్లు పోలీసు వర్గాల సమాచారం. ఆమె మృతిపై పోలీసుల నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.

కాగా గతంలో మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన నేత కిడారి సర్వేశ్వరరావు ఎన్‌కౌంటర్‌లో అరుణ క్రియాశీలకంగా వ్యవహరించినట్లు అప్పట్లో పలు వార్తలు బలంగా వినిపించాయి. 2015లో కొయ్యూరు ఎన్‌కౌంటర్‌లో పోలీసుల చేతిలో హతమైన మావోయిస్టు అగ్రనేత అజాద్‌ సోదరి అరుణ అలియాస్‌ వెంకట రవి చైతన్య కిడారి హత్యకు నాయకత్వం వహించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలను బట్టి పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను దగ్గరి నుంచి కాల్చింది కూడా అరుణగానే భావించారు. ఆ తరువాత ఆమెపై అనేకసార్లు ఎదురుకాల్పులు జరిపినప్పటికి అరుణ తప్పించుకున్నారు. అయితే తాజాగా ధారకొండలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆమె మృతి చెంది ఉంటారన్న అనుమానం వ్యక్తమవుతోంది. కాగా తాజా ఘటనతో విశాఖలోని ఏజెన్సీ గ్రామాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతూ ఉండటంతో.. ఏవోబీలో అధికారలు హై అలర్ట్‌ ప్రకటించారు.

చదవండి: విశాఖలో భారీ ఎన్‌కౌంటర్‌

మరిన్ని వార్తలు