భయం గుప్పిట్లో మన్యం

1 Dec, 2018 07:19 IST|Sakshi
కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులు

రేపటి నుంచి పీఎల్‌జీఏ వారోత్సవాలు

మావోయిస్టులు విధ్వంసాలకు పాల్పడే అవకాశం

భగ్నం చేసేందుకు  సరిహద్దు రాష్ట్రాల పోలీసు ఉమ్మడి వ్యూహం

ఆందోళనలో గిరిజనులు

విశాఖ, అరకులోయ, కొయ్యూరు:  పీఎల్‌జీఏ(ప్లాటున్‌ లీబరేషన్‌ గెరిల్లా ఆర్మ్‌డ్‌) వారోత్సవాలను ఆదివారం  నుంచి   నిర్వహించేందుకు మావోయిస్టులు  ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ  మారుమూల ప్రాంతాలలో కరపత్రాలు, బ్యానర్లు వెలిశాయి.మరోపక్క వీటిని భగ్నం చేసేందుకు పోలీసు యంత్రాంగం వ్యూహరచన చేస్తోంది. విశాఖ రూరల్‌ ఎస్పీ అట్టాడ బాబూజీ రెండు రోజుల నుంచి ఏజెన్సీలోని పోలీసు యంత్రాం గంతో సమీక్షిస్తున్నారు. దీంతో   ఏవోబీలో యుద్ధవాతావరణం నెలకొంది. ఒడిశాలోని రామ్‌గుడ ఎన్‌కౌంటర్‌ ఘటనతో తీవ్రంగా నష్టపోయిన మావోయిస్టు పార్టీ రెండేళ్ల వ్యవధిలో బలం పుంజుకుంది.కొత్త రిక్రూట్‌మెంట్‌తో పోలీసులకు సవాల్‌ విసురుతోంది. డుంబ్రిగుడ మండలంలో  లివిటిపుట్టు వద్ద  అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చిచంపిన ఘటన సంచలనం సృష్టించింది.ఈ సంఘటనతో మావోయిస్టులు ఏవోబీలో బలపడ్డారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

1999లో ఆదిలాబాద్‌ జిల్లా కొయ్యూరు ఎన్‌కౌంటర్లో నరేశ్, ఆది,శ్యాం అనే ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు మరణించారు. దీనికి గుర్తుగా 2001 నుంచి పీఎల్‌జీఏ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. విశాఖ మన్యంలో మొదటి పీఎల్‌జీఏ వారోత్సవాల సమయంలో కొయ్యూరు పోలీసుస్టేషన్‌పై కాల్పులు జరిపారు.అప్పటి చింతపల్లి మాజీ ఎమ్మెల్యే దివంగత ఎం.వి.వి సత్యనారాయణకు చెందిన రెండు ఇళ్లను,తహసీల్దారు కార్యాలయాన్ని పేల్చివేశారు. దీని తరువాత ప్రతీ ఏడాది డిసెంబర్‌2–8 వరకు   ఏవోబీలోనే వారోత్సవాలను నిర్వహిస్తున్నారు.  విధ్వంసాలకు వ్యూహాలు రచించే  నంబళ్ల కేశవరావు అలియస్‌ బసవరాజ్‌ అలియాస్‌  గంగన్నకు ఏవోబీలో పట్టుంది. దీంతో  విధ్వంసాలకు  పాల్పడే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

వారోత్సవాలభగ్నానికి పోలీసుల వ్యూహం
మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలను భగ్నం చేసేందుకు ఆంధ్రా,ఒడిశా పోలీసు అధికారులు పకడ్బంధీగా వ్యూహ రచన చేశారని సమాచారం. ఒడిశా పోలీసు బలగాలతో పాటు,విశాఖ జిల్లాకు చెందిన పోలీసుపార్టీలుఉమ్మడిగాఏవోబీలోకూంబింగ్‌కుసిద్ధమయ్యాయి.ఇప్పటికేవిశాఖ ఏజెన్సీలోని మావోయిస్టు ప్రభావిత కొయ్యూరు,సీలేరు, జీకేవీధి,చింతపల్లి,అన్నవరం,జి.మాడుగుల,పెదబయలు,ముంచంగిపుట్టు పోలీసు స్టేషన్ల పరిధిలో అదనపు పోలీసు బలగాలను అందుబాటులో ఉంచారు. రాళ్లగెడ్డ,కోరుకొండ,నుర్మతి,రూడకోట అవుట్‌ పోస్టుల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.  అరకులోయ,డుంబ్రిగుడ పోలీసు స్టేషన్ల పరిధిలో  పోలీసు బలగాలను అప్రమత్తం చేశారు. ఒడిశాలోని మల్కన్‌గిరి,కోరాపుట్‌ జిల్లాలకు చెందిన ప్రత్యేక పోలీసు పార్టీలతో విశాఖ జిల్లా పోలీసు పార్టీలు సమన్వయం చేసుకుని ఉమ్మడి కూంబింగ్‌కు రంగం సిద్ధమైనట్టు  తెలుస్తోంది.ఇప్పటికే మారుమూల ప్రాంతాలలో పోలీసు పార్టీలు సంచరిస్తున్నాయి. హిస్ట్‌ లిస్టులో ఉన్న నేతలు మైదానప్రాంతాలకు తరలివెళ్లాలని పోలీసులు సూచించారు.

ఇతర రాష్ట్రాల నుంచి మావోయిస్టుల రాక
విశాఖమన్యానికి ఎక్కువగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గుత్తికోయలు వస్తారు.వారు వచ్చేరంటే పెద్ద  ఎత్తున ఏదో విధ్వంసానికి  వ్యూహ రచన చేసి ఉంటారన్న అనుమానం కలుగుతుంది. కొద్దిరోజుల నుంచి గుత్తికోయల ఆనవాళ్లు కనిపిస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం అందుతోంది.

సంతలో బ్యానర్లు
కొయ్యూరు మండలం పలకజీడి వారపు సంతలో శుక్రవారం సీపీఐ మావోయిస్టుల పేరిట కరపత్రాలు,బ్యానర్లు వెలిశాయి. గ్రామగ్రామాన పీఎల్‌జీఏ వారోత్సవాలను నిర్వహించాలని సీపీఐ మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ పేరిట ఆ బ్యానర్‌లో పేర్కొన్నారు. కరపత్రాలు, బ్యానర్లు దర్శనమివ్వడంతో సంతబోసిపోయింది. వ్యాపారులు తగ్గిపోయారు.

మందుపాతరల భయం
మందుపాతరల భయం పోలీసు పార్టీలను వెంటాడుతోంది. గత ఏడాది పీఎల్‌జీఏ వారోత్సవాల సందర్భంగా పెదబయలు మండలం ఇంజరి అటవీ ప్రాంతంలో మందుపాతరలను పేల్చేందుకు మావోయిస్టులు భారీ వ్యూహం పన్నారు. అయితే పోలీసు పార్టీలు   ముందుగానే గుర్తించి,వాటిని నిర్వీర్యం చేయడంతో  పెద్ద ప్రమాదం తప్పింది. జి.మాడుగుల మండలం నుర్మతి అవుట్‌ పోస్టుకు సమీపంలోని గాదిగుంట రోడ్డులో మావోయిస్టులు బుధవారం  మందుపాతరలు పేల్చిన  ఘటనలో తేలికపాటి గాయాలతో ఇద్దరు పోలీసులు సురక్షితంగా బయటపడ్డారు.దీంతో విశాఖ జిల్లా పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. రూరల్‌ ఎస్పీ అట్టాడ బాబూజీ రంగంలోకి దిగారు.నుర్మతి అవుట్‌ పోస్టును సందర్శించడంతో పాటు,చింతపల్లి,పాడేరు సబ్‌డివిజన్‌ల పోలీసు అధికారులు,ఇతర పోలీసు పార్టీలను అప్రమత్తం చేశారు.

>
మరిన్ని వార్తలు