వీరప్పన్ ఇలాకాలో మావోయిస్టులు

26 Nov, 2013 00:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: పశ్చిమ కనుమల ద్వారా నల్లమల అడవుల్లోకి ప్రవేశించేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారు. కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల మూడు కూడళ్లలో విస్తరించిన సత్యమంగళం అడవులను తమ ఉద్యమ విస్తరణకు మావోయిస్టులు అనువైన ప్రాంతంగా ఎంచుకున్నారు. ఈ అంశాన్ని నిఘా వర్గాలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు నివేదించాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రిత్వశాఖ దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ హెచ్చరించింది. గంధపు చెక్కలస్మగ్లర్ వీరప్పన్ ఒకప్పుడు మకాం వేసిన సత్యమంగళం అడవులను గెరిల్లా జోన్‌గా మార్చుకుని దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేసేందుకు మావోయిస్టులు పక్కా ప్రణాళిక రూపొందించుకున్నారు.
 
 తమిళనాడులోని నీలగిరి, కృష్ణగిరి, కేరళలోని సకిలేశ్వపూర్, మాలెమహాదేశ్‌పూర్ కొండల మీదుగా సత్యమంగళం అటవీ ప్రాంతాలలో ఆ పార్టీ కార్యకలాపాలు ఉధృతం అయినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. అక్కడ నుంచి దక్షిణ కర్ణాటకలోని ఉడిపి, షిమోగ, చిక్‌మగళూర్ జిల్లాలకు ఉద్యమాలను విస్తరిస్తున్నారు. సత్యమంగళం అడవుల్లో మావోయిస్టులు వరుసగా సమావేశాలు నిర్వహించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. మన రాష్ట్రానికి చెందిన మల్లా రాజిరెడ్డి సౌత్ వెస్ట్ రీజినల్ బ్యూరో(ఎస్‌డబ్ల్యూఆర్‌బీ) బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కుప్పుస్వామి పేరుతో దక్షిణాది రాష్ట్రాలలో ఉద్యమ పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టారు.  దక్షిణాది రాష్ట్రాల ఉద్యమంతో రాజిరెడ్డికి మంచి సంబంధాలుండటంతో  పార్టీ ఆయనకే ఆ బాధ్యతలను అప్పగించింది.

మరిన్ని వార్తలు