దాచేపల్లిలో మావోయిస్టుల పోస్టర్ల కలకలం

16 Nov, 2018 13:36 IST|Sakshi
దాచేపల్లిలోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం వద్ద పోస్టర్లు

అధిక వడ్డీ, రేషన్‌ బియ్యం వ్యాపారులకు హెచ్చరిక

గుంటూరు, దాచేపల్లి(గురజాల): మావోయిస్ట్‌ పార్టీ పల్నాడు రీజియన్‌ కమిటీ పేరుతో దాచేపల్లిలో వెలసిన పోస్టర్లు కలకలం సృష్టించాయి. దాచేపల్లిలోని ముత్యాలంపాడు రోడ్డులో ఉన్న ప్రభుత్వ బీసీ బాలుర వసతిగృహం గోడకు అధిక వడ్డీ, రేషన్‌ బియ్యం వ్యాపారులను హెచ్చరిస్తూ వెలసిన ఈ పోస్టర్లు చర్చనీయాంశమయ్యాయి. మావోయిస్ట్‌ పార్టీ పల్నాడు రీజియన్‌ కమిటీ పేరుతో వెలసిన ఒక పోస్టర్‌లో ‘‘రోజువారీ, వారాలవారీ, నెలవారీ వడ్డీలు, తాకట్టు రిజిస్ట్రేషన్లు, అధిక వడ్డీ వ్యాపార మార్గాల ద్వారా అక్రమ వ్యాపారం చేస్తున్న వారికి హెచ్చరిక. అధిక వడ్డీల ద్వారా ప్రజల శ్రమను దోచుకునే వారందరి వివరాలు మా దగ్గర ఉన్నాయి. ఇది చివరి అవకాశంగా భావించి ఒక నెల రోజులలో మీరు మీ అక్రమ వడ్డీ వ్యాపారాలు అన్నీ మానేసి సక్రమ పద్ధతిలో జీవనం సాగించాల్సిందిగా కోరుతున్నాం. లేకపోతే ప్రజా కోర్టులో తీవ్రమైన శిక్ష అనుభవించాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించారు.

మరో పోస్టర్‌లో.. ‘‘రేషన్‌ బియ్యం దొంగ రవాణా చేస్తున్న మందపాటి నరసింహారావు, దొంగ బియ్యం రవాణాకు నెలవారీ లంచాలు, మామూళ్లు తీసుకుని సహకరిస్తున్న రాజకీయ నాయకులకు, పత్రికా విలేకరులకు ఇదే మా మొదటి, చివరి హెచ్చరిక. ఒక నెల రోజుల్లో మీ అక్రమ వ్యాపారాన్ని మానివేయాలి. లేకపోతే ప్రజాకోర్టులో తీవ్రమైన శిక్షను అనుభవించాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించారు. గోడపై వెలసిన ఈ పోస్టర్లను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్టర్లు నిజంగా మావోయిస్టులు అంటించారా.. లేకపోతే స్థానికుల ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ షేక్‌ మహ్మద్‌ రఫీ చెప్పారు. ఒకప్పుడు మావోయిస్ట్‌ల ప్రభావం అధికంగా ఉన్న పల్నాడులో తాజాగా పోస్టర్లు వెలియటంతో స్థానికులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. దాచేపల్లిలోని మన్నెంవారి కుంటలో జరుగుతున్న ఇళ్ల స్థలాల అక్రమాలపై ముగ్గురు వ్యక్తులను హెచ్చరిస్తూ 2017 ఫిబ్రవరి 2న దాచేపల్లిలోని షాపింగ్‌ కాంప్లెక్స్‌ దగ్గర ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి మావోయిస్ట్‌ పార్టీ పేరుతో ఒక పోస్టర్‌ను వేశారు. ఈ పోస్టర్‌ అప్పట్లో తీవ్ర
సంచలనమైంది.

>
మరిన్ని వార్తలు