వివక్షపై మారతమ్మ పంచ్‌

7 Mar, 2018 09:53 IST|Sakshi
అంతర్జాతీయ రింగ్‌లో ప్రత్యర్థితో తలపడుతున్న మారతమ్మ ,సతివాడ మారతమ్మ, అంతర్జాతీయ బాక్సర్, పెందుర్తి

ఇద్దరూ ఆడపిల్లలనే నెపంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన తండ్రి

కష్టాలు..కన్నీళ్ల మధ్య పెరిగిన వైనం

అంతర్జాతీయ బాక్సింగ్‌ పోటీల్లో రాణిస్తున్న మారతమ్మ

స్ఫూర్తిగా నిలుస్తున్న బాక్సర్‌

విశాఖపట్నం, పెందుర్తి : కొందరు జీవితాలను తెరిచి చూస్తే ఎంతో స్ఫూర్తి కలిగిస్తుంటాయి. కష్టాలకు..కన్నీళ్లకు బెదిరిపోకుండా..కరిగిపోకుండా ముందుకు వెళ్లే వారి ధైర్యం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తాయి. రెండో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టిందని భర్త వదిలేసి వెళ్లిపోయాడు. ఇద్దరు ఆడపిల్లల భారాన్ని మోయలేక వెళ్లిపోయాడు. మరి ఆ కన్నతల్లి అలా అనుకోలేదు. పేగుతెంచుకున్న పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు కష్టాలెన్ని వచ్చినా ఎదుర్కొంది. ఉగ్గుపాలల్లో ధైర్యం నింపి పట్టిందేమో గానీ రెండో కుమార్తె తల్లి కల నెరవేర్చేలా ఎదిగింది.

ఓ నిరుపేద కుటుంబం..రెక్కాడితేగాని డొక్కాడని వైనం..అప్పటికే ఓ కూతురు..రెండోకాన్పులో కొడుకే పుడతాడని ఆమె భర్త గట్టిగా నమ్మాడు..కానీ మరోసారి ఆడబిడ్డే..తప్పు భార్యదే అన్నట్టు ఇళ్లు విడిచిపెట్టి వెళ్లిపోయాడా మగాడు..ఇద్దరు ఆడపిల్లలతో పూటగడవడం కూడా కష్టమైన దుస్థితి ఆ తల్లిది..ఏదోలా ఓ అపార్ట్‌మెంట్‌కు వాచ్‌ఉమెన్‌గా ఆ తల్లికి ఉపాధిమార్గం దొరికింది..కిష్టపరిస్థితిలో సంసారజీవీతాన్ని భారంగా ఈడుస్తూ ఆ తల్లి పడుతున్న కష్టం కళ్లారా చూస్తూ పెరిగింది ఆ రెండో బిడ్డ..ఈ క్రమంలో పురుషుల క్రీడగా పేరొందిన కఠినమైన బాక్సింగ్‌ వైపు మళ్లింది ఆ చిన్నారి మనసు..తాను కుటుంబం పరంగా గడిపిన అత్యంత కఠినమైన రోజులతో పాటు బాక్సింగ్‌లో ప్రత్యర్థి నుంచి ఎదురైన కఠోర పంచ్‌లు ఆమెను మరింత రాటుదేల్చాయి..నాడు ఆడపిల్ల అని తండ్రి చేత ఛీదరించుకున్న ఆ బిడ్డే నేడు అంతర్జాతీయస్థాయిలో మెరుస్తూ ‘సబల’గా ప్రజల మన్ననలు అందుకుంటుంది. పెందుర్తికి చెందిన సతివాడ మారతమ్మ ప్రస్తుతం భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న బాక్సర్‌. నిరుపేద కుటుంబం జన్మించిన మారతమ్మ కఠోర శ్రమ, అకుంటిత దీక్షతో అంతర్జాతీయ వేదికపై మెరుస్తోంది.

చిన్నతనం నుంచే..
మారతమ్మ తల్లి రామలక్ష్మి కాయకష్టం చేసుకుని కుటుంబాన్ని ఈదుతున్న సమయంలో మారతమ్మకు బాక్సింగ్‌పై ఆసక్తి కలిగింది. స్థానికుల సహాయంతో ప్రాక్టిస్‌ మొదలుపెట్టిన మారతమ్మ అనతికాలంలోనే మేటి బాక్సర్‌గా తయారైంది. అంతర్జాతీయ స్థాయిలో రెండు(ఒక రజతం, ఓ కాంస్యం) పతకాలు సాధించిన ఆమె జాతీయ స్థాయిలో మూడు బంగారు పతకాలను కొల్లగొట్టింది. అంతే కాకుండా జాతీయస్థాయిలో సీనియర్‌ బాక్సింగ్‌లో రెండు కాంస్యాలు గెలుచుకుంది. ఏడాదిన్నర జరిగిన జాతీయ క్రీడల్లో కాంస్య పతకాన్ని సాధించింది. ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సంపాదించిన మారతమ్మ అంతకంటే మంచి ఉద్యోగం కోసం అన్వేషిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న మారతమ్మ  రానున్న ఒలింపిక్స్‌ క్రీడల్లో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించి పతకాలను సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

మరిన్ని వార్తలు