సమస్యలు ‘పది’లం

17 Mar, 2017 23:08 IST|Sakshi
సమస్యలు ‘పది’లం
– జిల్లాలో ఓ విద్యార్థి డిబార్‌... ఇన్విజిలేటర్‌పై వేటు
– తల్లి మృతిచెందినా కన్నీటితో పరీక్షకు హాజరైన విద్యార్థిని 
– పరీక్ష కేంద్రాల్లో అరకొర బెంచీలపైనే పరీక్షలు రాసిన విద్యార్థులు 
– అంకిరెడ్డిపల్లె సెంటర్‌లో సీసీ కెమెరాల ఏర్పాటుపై తల్లిదండ్రుల ఆందోళన 
– 66 కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు 
– మొదటి రోజు 249 మంది గైర్హాజరు 
 
కర్నూలు(సిటీ): ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పదో తరగతి పరీక్షలు అసౌకర్యాలతోనే శుక్రవారం ప్రారంభమయ్యాయి. చాలా చోట్ల విద్యార్థులు.. పాత బెంచీల మీదనే పరీక్షలు రాశారు. మొదటిరోజు కావడంతో విద్యార్థులు తల్లిదండ్రులతో కలసి కేంద్రాల వద్దకు వచ్చారు. అయితే 144 సెక్షన్‌ అమలు చేస్తుండడంతో పోలీసులు..వారిని కేంద్రాల దగ్గరికి రానివ్వలేదు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు అరగంటకు ముందుగానే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. సరైన రవాణా సదుపాయం లేకపోవడంతో  గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కొంత ఆలస్యమైంది. మొదటిరోజు కావడంతో పరీక్షా సమయానికి 5, 10 నిముషాలు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను అనుమతించారు. కేంద్రంలోకి విద్యార్థులను పంపించేటప్పుడే ప్రతిచోటా అబ్బాయిలు, అమ్మాయిలకు వేర్వేరుగా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. 
 
అరకొర బెంచీలతోనే పరీక్షలు...
జిల్లాలో 240 కేంద్రాల్లో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలకు మొదటిరోజున 50,198 మంది విద్యార్థులకు గాను 49,948 మంది విద్యార్థులు హాజరయ్యారు. 249 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. అధికారుల గణాంకాల ప్రకారం పది సెంటర్లలో మాత్రమే పూర్తిస్థాయిలో బెంచీలు లేవు. అయితే సగానికి సగం కేంద్రాల్లో అద్దె తీసుకుని ఏర్పాటు చేసిన బెంచీలపైనే విద్యార్థులు పరీక్షలు రాయడం గమనార్హం. సప్లయర్‌ దుకాణాల్లోని బెంచీలు ఏర్పాటు చేశారు. అయితే కొంత మంది విద్యార్థులు ఆ బెంచీలపై కుర్చునేందుకు ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు ప్రభుత్వ స్కూళ్ళు కేంద్రాలుగా ఉన్న చోట గదుల్లో ఫ్యాన్లు లేకపోవడంతో పరీక్షలు రాసేందుకు విద్యార్థులు అవస్థలు పడ్డారు. అదే విధంగా పరీక్ష కేంద్రాల్లో తాగు నీటి సదుపాయం పూర్తి ఏర్పాటు చేయలేదు. గార్గేయపురం హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పాత బెంచీలను మార్పులు చేయాలని డీఈఓ ఆదేశాలు ఇచ్చారు. పాత బెంచీల స్థానంలో ఓ దాత  స్కూల్‌కు బెంచీలు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. 
 
ఓ విద్యార్థి డిబార్‌...ఇన్విజిలేటర్‌లపై వేటు
ఈ ఏడాది పది పరీక్షల్లో మాస్‌ కాపింగ్‌ను నియంత్రించేందుకు చట్టం 25/97ను పగడ్బందీగా అమలు చేయాలని విద్యా శాఖ ఆదేశాలు ఇచ్చింది. మొదటి రోజునే సప్లమెంటరీ పరీక్ష రాస్తున్న విద్యార్థి కాపీయింగ్‌ పాల్పడుతూ ఫ్లయింగ్‌స్క్వాడ్‌ తనిఖీలో పట్టుబడ్డాడు. ఆ విద్యార్థిని డిబార్‌ చేశారు. ఇన్విజిలేటర్‌పై కూడా వేటు వేసినట్లు అధికారులు తెలిపారు.
 
సీసీ కెమెరాల ఏర్పాటుపై ఆందోళన 
పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే సీ క్యాటగిరి(22), సమస్యాత్మకమైన కేంద్రాల్లో(18) కూడా కేవలం 5 చోట్ల మాత్రమే ఏర్పాటు చేశారు. వీటి ఏర్పాటులోను ఓ హెచ్‌ఎం తన స్కూల్‌కు కాకుండా మరో స్కూల్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చేయడంతో కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లె కేంద్రంలో పరీక్షలకు హాజరు అయిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే అన్ని చోట్ల చేయాలని, కొన్ని చోట్ల మాత్రమే ఏర్పాటు చేయడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొద్ది సేపు అక్కడి వారితో వాదనకు దిగారు. పోలీసులు కల్పించుకోని సర్ది చెప్పడంతో ఆందోళన విరిమించుకున్నట్లు తెలిసింది.
 
66 కేంద్రాల్లో తనిఖీలు 
డీఈఓ తాహెరా సుల్తానా... కర్నూలు నగరంలోని మాంటిస్సోరి స్కూల్, గార్గేయపురం, బ్రాహ్మాణకొట్కూరులలో ఏర్పాటు చేసిన కేంద్రాలను తనిఖీ చేశారు. ఎస్‌సీఈఆర్‌టీ నుంచి జిల్లా పరిశీలకులుగా వచ్చిన లక్ష్మీవాట్స్‌..గడివేముల, మిడ్తూరు మండలాల్లో 4 కేంద్రాలను, ఫ్లయింగ్‌స్క్వాడ్‌ టీంలు కలిసి మొత్తం 66 కేంద్రాలను తనిఖీ చేశారు.
 
పుట్టెడు దుఃఖంతో పరీక్షకు
తల్లి చనిపోవడంతో పుట్టెడు దుఃఖంతో ఓ విద్యార్థిని పదోతరగతి పరీక్ష రాసింది. నంద్యాల పట్టణం ఎన్‌జీఓ కాలనీకి చెందిన మద్దిలేటి, కళావతిల పెద్ద కుమార్తె బిందుమాధవి..కేశవ రెడ్డి పాఠశాలలో పదో తరగతి చదివింది. పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానుండగా తల్లి కళావతి గురువారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్నేహితులు విద్యార్థిని వద్దకు వెళ్లి ఓదార్చారు. పరీక్షలు రాసి తల్లి ఆశయాన్ని నెరవేర్చాలని ఉపాధ్యాయులు సూచించడంతో  శుక్రవారం ఆ విద్యార్థిని శ్రీ గురురాజా పాఠశాలలో  పరీక్ష రాసింది. 
 

 

మరిన్ని వార్తలు