కానిచోట కల్యాణ మండపమట..!

27 Nov, 2018 13:04 IST|Sakshi
కాపు కళ్యాణ మండపానికి శంఖుస్థాపన చేస్తున్న కాపు కార్పోరేషన్‌ ఛైర్మన్‌ సుబ్బారాయుడు (ఫైల్‌)

కాలనీ కామన్‌ సైట్‌లో ప్రారంభోత్సవం

కాపు కార్పొరేషన్‌ నిధులతో నిర్మాణం

ప్రభుత్వానికి వెళ్లిన ప్రతిపాదనలు

కాలనీ వాసుల అభ్యంతరం

కోర్టును ఆశ్రయించే యోచన

జిల్లా కేంద్రమైన ఏలూరులోరూ.5 కోట్ల కాపు కార్పొరేషన్‌ నిధులతో నిర్మించనున్న కల్యాణ మండపం వివాదంలో పడింది. కాలనీలో పార్క్‌ కోసం కేటాయించిన కాలనీ కామన్‌ సైట్లో అధికార పార్టీ నేతలు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో హడావుడిగా శంకుస్థాపన చేశారు. దీనిని కాలనీవాసులు వ్యతిరేకించి కోర్టును ఆశ్రయిం చేందుకు సన్నద్ధం అవుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, తమ అంగీకారం లేకుండా మండపం నిర్మాణం పనులు చేపడుతున్నారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.  

సాక్షి ప్రతినిధి,పశ్చిమగోదావరి , ఏలూరు :ఏదైన ప్రదేశంలో కొత్తగా లేఅవుట్‌ వేసిన సమయంలో కొంత స్థలాన్ని కాలనీవాసుల అవసరాలకు అనుగుణంగా కామన్‌ సైట్‌గా వదిలేసి, మిగిలిన స్థలాన్ని విక్రయించుకుంటారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆ లేఅవుట్‌లో స్థలాలు కొనుగోలు చేసుకున్న వారు ఆ కామన్‌ సైట్‌ను ఆటస్థలంగాను, పార్కుగాను వినియోగించుకోవాల్సి ఉంటుంది. తమ్మిలేరుకు అనుకొని ఉన్న సుమారు పదిహేడున్నర ఎకరాల్లో 2002లో ప్రస్తుత నగరపాలక సంస్థ  మేయరు నూర్జహాన్‌ భర్త ఎస్‌ఎంఆర్‌ పెదబాబు లేవుట్‌ను వేశారు. ప్రభుత్వ నిబంధన (72 జీవో) ప్రకారం ఆ లేఅవుట్‌లో 4816 చదరపు గజాల స్థలాన్ని కామన్‌ సైట్‌ను ఆట స్థలం, పార్కుకు గాను వదిలి, 2008లో  నగరపాలకసంస్థకు రిజిస్టర్డ్‌ గిఫ్ట్‌ డీడ్‌  (1306/2008)గా ఇచ్చారు.

ఈ కామన్‌ సైట్‌లో పార్కును నిర్మించేందుకు అమృత్‌ నిధులు సుమారు రూ.40 లక్షలు మంజూరు కావడంతో అధికారులు పనులు కూడా ప్రారంభించారు. అయితే ఈ కామన్‌సైట్‌లో కాపు కల్యాణ మండపం నిర్మించేందుకు ప్రభుత్వ అనుమతులు ఇవ్వాల్సిందిగా గత ఏడాది డిసెంబర్‌  23న జరిగిన కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశంలో అజెండాలోని 30 అంశంగా పొందుపరిచారు. దీనిని సభ్యులందరూ ఆమోదం తెలిపి ప్రభుత్వానికి పంపించారు. ఇప్పటికే ఆ లేఅవుట్‌లో చాలా మంది ఇళ్లను నిర్మించుకొని నివాసంఉంటున్నారు. అయితే ఈ స్థలాన్ని అక్కడ స్థలాలు కొనుగోలు చేసిన వారికి ఎటువంటి ఉపయోగకరంగా లేకుండా ఓ సామాజిక వర్గం పేరుతో కల్యాణ మండపాన్ని నిర్మించేందుకు పాలకులు శంకుస్థాపన చేయడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు కామన్‌ సైట్‌లో పార్కు, ఆట స్థలాన్ని తప్ప ఎటువంటి నిర్మాణాలను చేపట్టకూడదని నిబంధనలు చెబుతున్నాయి.

అసలు నిర్మాణం ఎవరు చేస్తారు..?
ఎస్‌ఎంఆర్‌ నగర్‌లోని కాపు కళ్యాణ మండపం నిర్మాణానికి ఈ నెల 2వ తేదీన కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కొత్తపల్లి సుబ్బారాయుడు, స్థానిక ఎమ్మెల్యే బడేటి బుజ్జిలు శంకుస్థాపన చేశారు. కాపు కార్పొరేషన్‌ నిధులు రూ.5 కోట్ల వ్యయంతో ఈ  కల్యాణ మండపం నిర్మిస్తున్నట్లు వారు ప్రకటించారు. దాంతో పాటు నగరంలో పలు ప్రాంతాల్లో  పెద్ద పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ కల్యాణ మండపం నిర్మాణం ఎవరు చేపడతారనే విషయమై  గందరగోళం నెలకొంది. ఈ కామన్‌ సైట్‌లో పార్కును నిర్మించేందుకు అమృత్‌ నిధులు సుమారు రూ.40 లక్షలతో  ప్రతిపాదనలు సిద్ధం చేసిన నగరపాలకసంస్థ అధికారులు ఇప్పటికే సుమారు రూ.20 లక్షల వరకు ఖర్చు చేసి కామన్‌ సైట్‌ చుట్టూ ప్రహరీ నిర్మించి, మట్టితో మెరక చేశారు.

అయితే ఈ కామన్‌ సైట్‌లో కల్యాణ మండపం నిర్మించేందుకు పాలకులు శంకుస్థాపన చేయడంతో ఆ నిధులు వృథా అయినట్లే. అయితే ఈ కల్యాణ మండపాన్ని నగరపాలకసంస్థ, పబ్లిక్‌ అండ్‌ హెల్త్‌  నిర్మిస్తుందా, లేక నామినేషన్‌ పద్ధతి ద్వారా ఎవరైనా కాంట్రాక్టర్‌కు నిర్మాణ పనులను అప్పగిస్తారా అనేది ఇంకా çస్పష్టత లేదు. కామన్‌ సైట్‌లో కల్యాణ మండపం నిర్మించడం నిబంధనలకు విరుద్ధం కావడంతో ఈ నిర్మాణ పనులను చేపట్టేందుకు నగరపాలకసంస్థ అధికారులు ముందుకు రావడం లేదని సమాచారం. దీనిపై కాలనీ వాసులు కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారు.కోర్టును ఆశ్రయిస్తే తాము ఇబ్బందుల్లో పడతామని కార్పొరేషన్‌ అధికారులు అందోళన చెందుతున్నారు.

ప్రభుత్వఆమోదం వస్తేనే పనులు
కామన్‌సైట్‌గా ఉన్న ఈ స్థలాన్ని కాపు కార్పొరేషన్‌ భవన నిర్మాణం కోసం కౌన్సిల్‌లో తీర్మానం చేసి ప్రభుత్వ ఆమోదం కోసం పంపించాం. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తేనే పనులు ప్రారంభిస్తాం.
– మోహన్,మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌

మరిన్ని వార్తలు