ఆన్‌లైన్‌లో వివాహ రిజిస్ట్రేషన్లు

18 Nov, 2017 09:55 IST|Sakshi

మీసేవ’లో వివరాల నమోదు

ఆధార్‌ సమర్పణ తప్పనిసరి

ఆధార్‌ అథారిటీ సూచన మేరకు రిజిస్ట్రేషన్‌ శాఖ నిర్ణయం

అక్రమాలకు తలుపులు తెరిచినట్లేనంటున్న అధికారులు

సాక్షి, అమరావతి: వివాహ రిజిస్ట్రేషన్‌ కోసం సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయాన్ని వెతుక్కుంటూ వెళ్లాల్సిన శ్రమ తప్పనుంది. సమీపంలోని మీసేవ కేంద్రానికి వెళ్లి ఆన్‌లైన్‌లోనే వివాహ రిజిస్ట్రేషన్‌ చేసుకుని వివాహ సర్టిఫికేట్‌ పొందే వెసులుబాటు కల్పించాలని స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటివరకూ పెళ్లికుమారుడు, లేదా పెళ్లి కుమార్తె నివాస ప్రాంతంలోని, లేదా వివాహం చేసుకున్న ప్రాంతం పరిధిలోని సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయంలోనే వివాహ రిజిస్ట్రేషన్‌ చేసుకునే విధానం అమల్లో ఉంది. ఇక నుంచి రాష్ట్రంలోని ఏ మీసేవ కేంద్రంలోనైనా వివాహ రిజిస్ట్రేషన్‌ చేసుకునే వెసులుబాటు కల్పించాలని రిజిస్ట్రేషన్‌ శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను కూడా ఖరారు చేసింది. వివాహాలు నమోదు చేసుకుని వివాహ సర్టిఫికేట్‌ తీసుకోదలచిన దంపతులు మీసేవ కేంద్రానికి తగిన డాక్యుమెంట్లతో వెళ్లాల్సి ఉంటుంది. 

దంపతులు ఇద్దరి ఆధార్‌ కార్డులు, వివాహ ఆహ్వాన పత్రిక, పెళ్లి ఫొటోలు, పాస్‌పోర్టు సైజు ఫొటోలతో పాటు దంపతులిద్దరూ తామిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలను మీసేవ కేంద్రంలోని ఆపరేటర్‌కు సమర్పించాలి. వీటి ఆధారంగా ఈకేవైసీ (నో యువర్‌ కష్టమర్‌) డేటాను మీసేవ కేంద్రం ఆపరేటర్‌ చెక్‌ చేసి ధ్రువీకరించుకుంటారు. తర్వాత  దంపతులిద్దరి సంతకాలు, సాక్షి సంతకాలను ఆపరేటర్‌ తీసుకుంటారు. వీటిని మీసేవ కేంద్రం సిబ్బంది ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఫొటోలు, దంపతులు, సాక్షుల సంతకాలను స్కాన్‌ చేసి అప్‌లోడ్‌  చేస్తారు. ఈ డేటా వెంటనే రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌లోకి వస్తుంది. దీనిని సంబంధిత సబ్‌ రిజిస్ట్రారు తనిఖీ చేసి ఆమోదిస్తారు. సబ్‌ రిజిస్ట్రారు ఆమోదించగానే డిజిటల్‌ సిగ్నేచర్‌తో కూడిన వివాహ సర్టిఫికేట్‌ను దంపతులు మీసేవ కేంద్రాల ద్వారా తీసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు త్వరలో చేస్తామని సంబంధిత అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. 

మోసాలకు అవకాశం
మీసేవ కేంద్రాల ద్వారా వివాహ రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తే మోసాలు జరిగే ప్రమాదం ఉంటుందని క్షేత్రస్థాయి అధికారులు తెలిపారు. మీసేవకు అనుమతిస్తే విదేశాల్లో ఉన్న, విదేశాలకు వెళ్లిన వారి విషయంలో మోసపూరిత వివాహ సర్టిఫికేట్లు జారీ అయ్యే ప్రమాదం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్‌ తదితర జిల్లాల వారు అధిక సంఖ్యలో విదేశాల్లో ఉన్నారు. వైఎస్సార్‌ జిల్లాకు చెందిన వారు దుబాయ్, కువైట్‌ తదితర గల్ఫ్‌ దేశాల్లో అధికంగా ఉండగా మిగిలిన జిల్లాల వారు ఎక్కువగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వెళ్లి స్థిరపడ్డారు. దంపతులు సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయంలో హాజరుతో నిమిత్తం లేకుండా మీసేవ కేంద్రాల్లో సంతకాల ఆధారంగా వివాహ సర్టిఫికేట్లు జారీ చేసే విధానం తెస్తే భవిష్యత్తులో కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంటుందని, ఇలా కాకుండా తగు జాగ్రత్తలను విధి విధానాల్లో చేర్చాలని క్షేత్రస్థాయి అధికారులు సూచిస్తున్నారు. 

ఫోర్జరీ రిజిస్ట్రేషన్లు
భర్త విదేశాల్లో ఉంటే భార్య ఫ్యామిలీ వీసా కింద విదేశాలకు వెళ్లాలంటే వివాహ సర్టిఫికేట్‌ తప్పనిసరి. అమెరికాలో ఉన్న వారు హడావుడిగా ఇక్కడకు వచ్చి వివాహం చేసుకుని వెళ్లిపోతుంటారు. తర్వాత కొన్ని నెలలకో, రోజులకో భార్యను/ భర్తను అక్కడికీ తీసుకెళ్లేందుకు కుటుంబ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటారు. దీనికి వివాహ సర్టిఫికేట్‌ కావాల్సి ఉంటుంది. వివాహ రిజిస్ట్రేషన్‌ చేసుకోనిదే సర్టిఫికేట్‌ రాదు. వివాహ నమోదు కోసం అమెరికా నుంచి ఇక్కడకు వచ్చి వెళ్లాలంటే లక్షల్లో ఖర్చవుతుంది. దీంతో ఇక్కడకు రాకుండానే ఫోర్జరీ సంతకాలు చేయించి వివాహ సర్టిఫికేట్‌ తీసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఫోర్జరీ సంతకాలను అనుమతించి వివాహ సర్టిఫికేట్‌ ఇస్తే భవిష్యత్తులో కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందనే భయంతో సబ్‌రిజిస్ట్రార్లు అనుమతించడంలేదు. మీసేవ కేంద్రాల నిర్వాహకులు ప్రయివేటు వ్యక్తులయినందున డబ్బులకు ఆశపడి ఫోర్జరీ సంతకాలను అనుమతిస్తారు. దీనివల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. 
– నెల్లూరుకు చెందిన సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి

తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు
దంపతులిద్దరూ మా ఎదుట సంతకాలు చేసిన తేదీ, సమయాన్ని మేం రిజిష్టర్‌లో నమోదు చేసుకునే వివాహ సర్టిఫికేట్‌ ఇస్తాం. విదేశాల నుంచి రాలేని పరిస్థితుల్లో ఉన్న ఒక వ్యక్తి నాకు సన్నిహితుని ద్వారా తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. రూ.1.50 లక్షలు ఇస్తామని పెళ్లికొడుకు హాజరు లేకుండా (ముందుగానే సంతకం చేసిన పేపర్‌ పెట్టుకుని) వివాహాన్ని నమోదుచేసి వివాహ సర్టిఫికేట్‌ ఇవ్వాలని కోరారు. ఇలా చేస్తే ఆ సమయంలో ఆ వ్యక్తి విదేశాల్లో ఏమైనా తప్పు చేసి దొరికిపోతే మా ఉద్యోగానికి ఎసరే కాకుండా క్రిమినల్‌ కేసుల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. అందువల్ల నేను అంగీకరించలేదు. మీసేవ కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్లు జరిగితే ఇలాంటి అక్రమాలు జరిగే అవకాశం ఎక్కువ.     
– రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక సబ్‌ రిజిస్ట్రారు 

మరిన్ని వార్తలు