కట్నం వేధింపులతోవివాహిత ఆత్మహత్య

16 Nov, 2013 00:14 IST|Sakshi

కొల్చారం, న్యూస్‌లైన్ :  కులాల గోడలను కూలగొట్టి.. ప్రేమ బంధంతో పెద్దలను ఒప్పించి ఏకమైన ఓ జంట. అయితే పెళ్లి అయి ఏడాది కాకనే సదరు యువతిని వరకట్నం కాటేసింది. కట్నం కోసం భర్త, అత్తమామల వేధింపులు భరించలేని ఆమె చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంది.

ఈ సంఘటన  మండలం అప్పాజిపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..  
 అప్పాజిపల్లి గ్రామానికి చెందిన సాలె తిరుపతి - నాగమణిలకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. పెద్ద కుమార్తె అలివేణి ఇదే గ్రామానికి చెందిన చింతకింది కృష్ణను ప్రేమించి 2012 డిసెంబర్‌లో పెద్దల సమక్షంలో కులాంతర వివాహం చేసుకుంది. కొన్ని రోజులు వీరి సంసారం సాఫీగా సాగింది. అయితే కొంత కాలంగా అలివేణిని వరకట్నం తేవాలంటూ అత్తమామలు చిందకింది శాఖయ్య, మంగమ్మ, భర్త కృష్ణ వేధింపులకు గురిచేసేవారు.

అక్టోబర్‌లో కూడా ఇదే విషయమై గ్రామ పెద్దల వద్ద పంచాయితీ కూడా నిర్వహించారు. కాగా శుక్రవారం సైతం వేధింపులకు గురి చేయగా అలివేణి (20) అత్తవారి ఇంటి నుంచి సాయంత్రం ఎటో వెళ్లిపోయింది. కాగా అలివేణి కోసం ఆరా తీయగా గ్రామ శివారులోని కిన్నెర్ల కుంట వైపు వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో చెరువులో రాత్రి వరకు గాలించడంతో అలివేణి మృతదేహం బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ప్రభాకర్ అక్కడికి చేరుకుని పంచనామా నిర్వహించారు.   ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రభాకర్ వివరించారు.

మరిన్ని వార్తలు