ఏం కష్టం వచ్చిందో!

28 Apr, 2017 06:10 IST|Sakshi
ఏం కష్టం వచ్చిందో!

కొడుకు సహా తల్లి బలవన్మరణం
శరీరంపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్న వైనం
పాలకొండలో విషాదం


శ్రీకాకుళం జిల్లా : సమయం.. గురువారం ఉదయం 11 గంటలు..  పాలకొండలోని సీతంపేట–ప్రభుత్వ ఆస్పత్రి రహదారి జనం రాకపోకలతో సందడిగా ఉంది. ఎవరి పనిలో వారు నిమగ్నమై ఉన్నారు.. ఇంతలో ఒళ్లంతా మంటలతో ఐదు సంవత్సరాల బాలుడు ఆహాకారాలు చేస్తూ రోడ్డపై పరుగులు తీస్తున్నాడు...జనం చూస్తుండగానే కొద్ది నిమిషాల్లోనే మరో మహిళ ఒళ్లంతా మంటలతో బాబు వెనకాలే పరుగులు తీస్తోంది.. ఒక్కసారిగా ఉలిక్కిపడిన జనం.. ఆ షాక్‌ నుంచి తేరుకునేలోపే బాబు పరుగు ఆగిపోయింది..గొంతుమూగపోయింది. రహదారి పక్కనే పడిపోయి ప్రాణాలు వదిలాడు.. అక్కడికి పది అడుగుల దూరంలోనే మహిళ కూడా కుప్పకూలిపోయింది. స్థానికులు మంటలను ఆర్పి ఒంటిపై తడి గోనెసంచులు కప్పినప్పటికీ ప్రయోజనం లేదు. అప్పటికే ఆమె కూడా ప్రాణాలు వదిలింది. ఈ విషాద ఘటనలో చందనాల ప్రమీల(25).. కుమారుడు సాయి(5) చనిపోయారు.  

విషాద వివరాలు ఇలా..
పాలకొండలోని జెట్టివారి వీధికి చెందిన ప్రమీలకు 2010 సంవత్సరంలో సరుబుజ్జిలి మండలం నందికొండ కాలనీకి చెందిన చందనాల మురళితో వివాహమైంది. వీరికి ఐదేళ్ల కుమారుడు సాయి ఉన్నాడు. వ్యాన్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న మురళి మద్యానికి బానిసై నిత్యం భార్యను వేధిస్తుండేవాడు. రోజూ తాగివచ్చి ప్రమీలను కొట్టడంతో అనారోగ్యం పాలైంది. భర్త పెట్టే వేధింపులు తాళలేని ఆమె కుమారుడుని తీసుకొని పాలకొండలోని తల్లి నాగమణి వద్దకు కొద్ది నెలల క్రితం వచ్చేసింది. బతుకు తెరువు కోసం స్థానికంగా ఓ వస్త్ర దుకాణంలో  పనిచేసుకుంటూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. అయితే మూడు రోజుల క్రితం తల్లి నాగమణి వేరే గ్రామానికి బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న మురళి ఇక్కడకు కూడా వచ్చి భార్య ప్రమీలను వేధించాడు.

గురువారం ఉదయం కూడా గొడవ జరగడంతో ఇంటి నుంచి కుమారుడుతో సహా బయటకు వచ్చేసిన ప్రమీల ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు...స్థానికులు చెబుతున్నారు. తొలుత కుమారుడుపై కిరోసిన్‌ పోసి, తాను పోసుకుని నిప్పు అంటించుకున్నట్టు భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని పాలకొండ డీఎస్పీ సీహెచ్‌ ఆదినారాయణ, సీఐ ఎన్‌.వేణుగోపాలరావు, ఎస్సై ఎం.చంద్రమౌళిలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ ఆదినారాయణ చెప్పారు. అలాగే ప్రమీల భర్త మురళీని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు.

చంపేశాడు..
తన కుమార్తె ..మనమడుని మురళీయే కిరోసిన్‌ పోసి..నిప్పంటించి చంపేశాడని ప్రమీల తల్లి నాగమణి పోలీసుల వద్ద వాపోయింది. మురళీకి గతంలో ఆమదాలవలస మండలం మెట్టక్కివలసకు చెందిన అతని అక్క కూతురుతో వివాహం జరిగిందని, ఆమె కూడా 2005లో కిరోసిన్‌ పోసుకుని చనిపోయిందని చెబుతూ రోదించింది. తాజా ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి న్యాయం చేయాలని వేడుకుంది.

పుట్టిన రోజునే..తిరిగిరాని లోకానికి..
గురువారమే చిన్నారి సాయి పుట్టిన రోజు. అయితే తల్లిదండ్రుల వివాదంలో అభం..శుభం తెలియని బాబు మృత్యువు ఒడి చేరాడు. విషాదాన్ని మిగిల్చాడు.

మరిన్ని వార్తలు