వివాహిత ఆత్మహత్య

14 Nov, 2018 07:54 IST|Sakshi

పశ్చిమగోదావరి,ఏలూరు టౌన్‌: భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు రూరల్‌ మండలం పోణంగి గ్రామానికి చెందిన జువ్వల ఏసుబాబు, మౌనికకు 22 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఏసుబాబు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మౌనిక తల్లి తండ్రి కూడా ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. కొంత కాలంగా భార్యభర్తల మధ్య వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో మౌనిక ఇంటిలో పడకగదిలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇదే సమయంలో మౌనిక తల్లి కూడా ఆమె ఇంటికి చేరుకుంది. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతున్న మౌనికను భర్త కిందికి దించాడు. అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మౌనిక మృతి చెందినట్టు నిర్థారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురికీ తరలించి, పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గుర్తు తెలియని వృద్ధుడి మృతి
ఏలూరు టౌన్‌: ఏలూరు శాంతినగర్‌ ఒకటో రోడ్డులో గుర్తు తెలియని వృద్ధుడు(65) ఒక అపార్టుమెంట్‌ వద్ద మృతిచెంది పడి ఉన్నాడు. స్థానికులు సమాచారం అందించటంతో త్రీటౌన్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆ వృద్ధుడు ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాడని, అతని పేరు తుమ్మల నరేంద్ర చౌదరి అని చెబుతున్నారు. వివరాలు తెలిసిన వారు త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై పైడిబాబు ఫోన్‌ నెంబర్‌ 9063334448కు గానీ, 08812 22338కు గానీ ఫోన్‌ చేసి సమాచారం అందించాలని కోరారు.

ఆర్థిక బాధలు తాళలేక..
ఏలూరు టౌన్‌: భర్త అనారోగ్యంతో బాధపడటం, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు సతమతం చేయటంతో ఆర్థిక బాధలు తాళలేక వివాహిత అధిక మోతాదులో మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు రూరల్‌ వెంకటాపురం పంచాయతీ రామనగర్‌ కాలనీకి చెందిన కిశోర్‌కుమార్, పుష్పకు కొంతకాలం క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. రెండేళ్ల క్రితం కిశోర్‌కుమార్‌కు పక్షవాతం రావటంతో అప్పటి నుంచి ఇంటివద్దనే ఉంటున్నాడు. ఇంటి వద్ద చిన్న దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు అధికం కావటంతో తీవ్ర మనస్తాపానికి గురైన పుష్ప అధిక మోతాదులో మాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. గమనించిన బంధువులు ఆమెను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
ఏలూరు టౌన్‌: కడుపునొప్పి తాళలేక ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు అశోక్‌నగర్‌ ప్రాంతానికి చెందిన మోహన్‌ ఒక ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీలో ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. మోహన్‌కు తీవ్రస్థాయిలో కడుపునొప్పి రావటంతో భరించలేక ఇంటివద్దనే మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు అతడిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 

మరిన్ని వార్తలు