బతుకు తెరువుకు వలస వస్తే..

14 Dec, 2013 02:55 IST|Sakshi

తోట్లవల్లూరు (కృష్ణా), న్యూస్‌లైన్ : బతుకు తెరువు కోసం దూర ప్రాంతం నుంచి వలస వచ్చిన గర్భిణి మూడు రోజుల్లోనే తిరిగిరాని లోకానికి వెళ్లిపోయింది. తోట్లవల్లూరులో గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటన స్థానికులను కలవరపరిచింది. వివరాలిలా ఉన్నాయి.

తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం ధర్మవరానికి చెందిన మొగసాల వెంకట నాగేశ్వరరావు తునికి చెందిన చందు(23)ను ఎనిమిది నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. నాగేశ్వరరావు మొదటి భార్య చనిపోవడంతో చందును రెండో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె ఆరు నెలల గర్భిణి. తమలపాకు తోటల్లో పని చేసేందుకు నాగేశ్వరరావు దంపతులు మూడు రోజుల క్రితం తోట్లవల్లూరు వలస వచ్చారు.

ఇక్కడ ఓ ఇంట్లో అద్దెకు దిగారు. నాగేశ్వరరావు అద్దెకున్న గదిలో గురువారం రాత్రి 10.30 గంటలైనా లైటు వెలుగుతూనే ఉంది. లైటు తీయమని ఇంటి యజమాని చిట్టిబాబు భార్య ఎన్ని కేకలు వేసినా స్పందన లేదు. దీంతో ఆమె కిటికీలోంచి చూడగా, చందు చీరతో ఉరికి వేలాడుతూ కనిపించింది. నాగేశ్వరరావు మద్యం మత్తులో నిద్రపోతున్నాడు. చిట్టిబాబు చుట్టుపక్కల వారి సాయంతో నాగేశ్వరరావును నిద్ర లేపారు. భార్య ఎలా చనిపోయిందో తనకు తెలియదని, తానూ చనిపోతానంటూ హడావుడి చేశాడు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈస్ట్ ఏసీపీ మహేశ్వరరాజు రాత్రి 12 గంటల సమయంలో సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

శుక్రవారం సాయంత్రం చందు తల్లిదండ్రులు, బంధువులు వచ్చి ఆమె మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదు చేయవద్దని, మృతదేహాన్ని అప్పగిస్తే చాలని పోలీసులను కోరారు. నిబంధనల ప్రకారం కేసు నమోదు తప్పదని ఎస్సై డి.సురేష్ వారికి వివరించారు. తహశీల్దార్ రాజకుమారి ఆధ్వర్యంలో ఆర్‌ఐ ధనలక్ష్మి, వీఆర్‌ఓ నాగేశ్వరరావు పంచనామా నిర్వహించారు. అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సురేష్ తెలిపారు.

మరిన్ని వార్తలు