వివాహిత దారుణ హత్య

13 Aug, 2017 07:28 IST|Sakshi
వివాహిత దారుణ హత్య

- మృతదేహాన్ని కాలువలో పడేసిన హంతకులు
- పోలీసుల అదుపులో అనుమానితులు

కందుకూరు: వివాహిత దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన పట్టణంలో శనివారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. పొన్నలూరు మండలం వెల్లటూరుకు చెందిన ఇత్తడి మరియమ్మ(27)కు జరుగుమల్లి మండలం నందనవనం గ్రామానికి చెందిన రవితో పదకొండు ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి పదేళ్ల కుమారుడు ఉన్నాడు. భర్తతో విభేదాల కారణంగా ఆమె ఒంటరిగా నివాసం ఉంటోంది. పట్టణంలోని జనార్దన కాలనీలో ఓ గదిని అద్దెకు తీసుకుంది. వివాహాలు, ఫంక్షన్‌లకు భోజనాలు తయారుచేసే పనులకు వెళ్తూ జీవనం సాగిస్తోంది.

ఈ నేపథ్యంలో ఇంటికి సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో మరియమ్మ మృతదేహమై కనిపించింది. మృతదేహం పడి ఉన్న తీరు, ఒంటిపై దుస్తులు చెరిగిపోవడంతో హంతకులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. స్థానికులు కూడా హత్యేగానే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని సీఐ నరసింహారావు పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీస్‌ జాగిలాన్ని రప్పించారు. జాగిలం సంఘటన స్థలంలో కొద్దిసేపు తిరిగిన అనంతరం అక్కడి నుంచి నేరుగా సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు వరకు వెళ్లింది.

పోలీసుల అదుపులో అనుమానితులు
మహిళ హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు అనుమానితులను పోలీ సులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రధానంగా పట్టణంలో మెకానిక్‌గా పనిచేసే బాజీ అనే యువకుడితో మరియమ్మకు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి హత్య జరిగి ఉంటుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పలువురు వంట మేస్త్రిలను కూడా పోలీసులు విచారిస్తున్నారు. పోలీసుల విచారణ అనంతరం మరియమ్మ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అకాశం ఉంది.

మరిన్ని వార్తలు