వరకట్నం...నవ వధువు బలవన్మరణం

9 Jul, 2016 03:57 IST|Sakshi
వరకట్నం...నవ వధువు బలవన్మరణం

భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య   
45 రోజుల క్రితమే వివాహం

భర్త వరకట్న దాహంభార్యను బలి తీసుకుంది... ‘డబ్బు తెస్తేనే నాతో మాట్లాడు.. లేదంటే వద్దు.. అంత వరకు నీ మొహమే నాకు చూపించకు’ అని అతను హెచ్చరించడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది... పెళ్లయిన 45 రోజులకే తమ కూతురు కానరాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

 ప్రొద్దుటూరు క్రైం : స్థానిక ఆదర్శనగర్‌లో నివసిస్తున్న ప్రసాద్ భార్య రాజేశ్వరి (19) గురువారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పెనగలూరు మండలానికి చెందిన వెంకటనరసమ్మకు రాజేశ్వరి, గంగాభవాని అనే కుమార్తెలు, శివప్రసాద్ అనే కుమారుడు ఉన్నారు. రాజేశ్వరికి ప్రొద్దుటూరులోని ఆదర్శనగర్‌కు చెందిన ప్రసాద్‌తో ఈ ఏడాది మే 22న వివాహం చేశారు. అతను మున్సిపాలిటీలోని సెకండ్ డివిజన్‌లో స్వీపర్‌గా పని చేస్తున్నాడు. పెళ్లి సమయంలో రూ.3 లక్షల నగదు, బంగారు చైన్, బ్రాస్‌లేట్, ఉంగరం కట్నంగా ఇస్తామని రాజేశ్వరి తల్లిదండ్రులు ఒప్పుకొన్నారు. వీటన్నింటిని పెళ్లి సమయంలో కాకుండా, రెండు నెలల్లో ఇస్తానని వారు చెప్పగా.. అందుకు ప్రసాద్ కుటుంబ సభ్యులు అంగీకరించారు.

 పెళ్లి అయినప్పటి నుంచి వేధింపులే : తల్లిదండ్రులు రెండు నెలల్లో కట్నం డబ్బు ఇస్తామని చెప్పినప్పటికీ.. ప్రసాద్ మాత్రం భార్యను నిత్యం వేధించే వాడు. పుట్టింటికి వెళ్లి డబ్బు తీసుకొని రావాలని ఆమెతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే ప్రసాద్ అత్తామామలకు ఫోన్ చేసి డబ్బు తీసుకొని రమ్మ ని దబాయించాడు. వారం, పది రోజుల్లో ఇస్తామని వారు చెప్పారు. గురువారం అతను భార్యతో మళ్లీ గొడవ పెట్టుకున్నాడు. కట్నం డబ్బు ఇస్తేనే ‘నాతో మాట్లాడు.. లేదంటే నీ మొహమే నాకు చూపించకు’ అని అన్నాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. రాజేశ్వరి ఈ విషయం గురించి తల్లి వెంకటనరసమ్మకు ఫోన్ చేయడంతో.. ఆమె వెంటనే ప్రొద్దుటూరు వచ్చింది. మూడు, నాలుగు రోజుల్లోనే డబ్బు, బంగారు ఇస్తామని అల్లుడి వద్ద ప్రాధేయపడింది. అంత వరకు తన కుమార్తెను ఏమీ అనవద్దని చెప్పింది. తర్వాత ఆమె కూతురితో మాట్లాడి స్థానికంగా ఉన్న తన తల్లి వద్దకు వెళ్లిపోయింది.

ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని...
‘నీ కుమార్తె తలుపులు వేసుకుంది. ఎంత పిలిచినా పలకలేదు’ అని అత్తింటి వారు వెంకటనరసమ్మకు రాత్రి పొద్దుపోయాక సమాచారం అందించారు. ఆమె హుటాహుటిన ఆదర్శనగర్‌లోని కుమార్తె ఇంటి వద్దకు వచ్చారు. తర్వాత బంధువులందరూ తలుపులు పగులకొట్టారు. రాజేశ్వరి ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించడంతో వెంటనే కిందికి దించారు. అప్పటికే చనిపోయినట్లు వారు నిర్ధారించుకున్నారు. కాగా అత్తింటి వాళ్లే తన కుమార్తెను చంపేసి ఉరికి వేలాడ దీశారని తల్లి ఆరోపిస్తోంది. శుక్రవారం ఉదయం ఇన్‌చార్జి డీఎస్పీ సర్కార్ ఆదర్శనగర్‌కు వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన జిల్లా ఆస్పత్రికి చేరుకొని రాజేశ్వరి మృతదేహాన్ని పరిశీలించారు. తల్లి వెంకటనరసమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అర్బన్ సీఐ సుధాకర్‌రెడ్డి తె లిపారు.

మరిన్ని వార్తలు