అమరుల త్యాగాలు వృధా కానివ్వం

27 Oct, 2013 00:29 IST|Sakshi

మెదక్‌టౌన్, న్యూస్‌లైన్: తెలంగాణ అమరవీరుల తల్లుల గోస ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పట్టడం లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో స్థానిక క్రిస్టల్ గార్డెన్‌లో తెలంగాణ అమర వీరుల తల్లుల కడుపుకోత పేరుతో మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మందకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ కోసం 1200 మంది యువకులు, విద్యార్థులు తమ విలువైన ప్రాణాలను బలిపెట్టుకున్నారన్నారు.
 
 అయినప్పటికీ వారి తల్లుల ఘోస ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. సీమాంధ్ర పెట్టుబడిదారుల కుట్రలను టీవీల్లో చూసి తీవ్ర మనోవేదనకు గురైన యువకులు ఆత్మబలిదానాలు చేసుకుంటున్నారన్నారు. 2014 వరకు తెలంగాణ రాదని స్వయంగా సీఎం కిరణ్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే ఆయనను సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు ఆగాలంటే తక్షణమే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభించి తెలంగాణ బిల్లును ఆమోదించాలన్నారు.
 
 తాము సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నామన్నారు.  యువకులు, విద్యార్థులు బలిదానాలకు పాల్పడకుండా బతికి పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చేనెల 10న తెలంగాణ తల్లుల ఘోసను హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న నిజాం కళాశాల మైదానంలో భారీ ఎత్తున నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన అమరులకు నివాళులర్పించారు.  కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి మాసాయిపేట యాదగిరి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అల్లారం రత్నయ్య, జిల్లా కార్యదర్శి చింతల రాములు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకర్, సిద్దిరాంలు, నాయకులు బాల్‌రాజ్, మహిపాల్, రవి, విఠల్, అబ్రహం, శ్యామ్యూల్  పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా