ఇసుక...మస్కా కుదరదిక

6 Sep, 2013 02:42 IST|Sakshi

సాక్షి,విశాఖపట్నం: ఇసుకాసురుల ఆగడాలిక చెల్లవు. అనధికారికంగా,దొంగచాటుగా ఇసుక తరలింపునకు వీరు దూరం కావలసిందే. అపార్ట్‌మెంట్లు,పరిశ్రమలు,ఏ ఇతర అవసరాలకైనా సమీప జిల్లాల నుంచి కొనితెచ్చుకోవాల్సిందే. అధికారిక వేలంపాటల కోసం ఇటీవల తనిఖీలు చేపట్టిన ఉన్నతాధికారులు అసలెక్కడా తవ్వకాలకు అనుమతులు ఇవ్వకూడదని ప్రాథమికంగా నిర్ధారించారు. జిల్లాలో ఏ నదిలోను ఇసుక తీయకూడదని తేల్చారు. అక్రమంగా ఇసుక తవ్వి తరలించేవారికి ఇది విషగుళికే. పారిశ్రామిక అవసరాలు పెరగడం, రియల్‌ఎస్టేట్ రంగం విస్తరణతో జిల్లాలో నిర్మాణాలు ఊపందుకున్నాయి.

ఎక్కడాలేని విధంగా జిల్లాలో ఇసుకకు డిమాండ్ ఏర్పడింది. అధికారికంగా జిల్లాలో అనుమతులు లేకపోవడంతో ఏడాదిగా వ్యాపారులు కనిపించిన చోటల్లా తవ్వి ఇసుక తరలించుకుపోతున్నారు. కొందరైతే దొడ్డిదారి లాభాలకు అలవాటుపడి మాఫి యా అవతారమెత్తారు. ప్రజాప్రతినిధుల అండదండలతో బరితెగించి ప్రభుత్వ సిబ్బంది,పోలీసులపై ఏకంగా దాడులకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. ఇలా ఇసుక వ్యాపారుల ఆగడాలు శ్రుతిమిం చడం, ప్రభుత్వానికి ఆదాయానికి గండిపడటంతో ఇసుక రీచ్‌లకు అధికారికంగా వేలానికి ఇటీవల బదిలీపై వెళ్లిన కలెక్టర్ శేషాద్రి నీటిపారుదల, భూగర్భజలశాఖల అధికారులతో ప్రత్యేక కమిటీ వేశారు.

ఈ కమిటీ సభ్యులు అనకాపల్లి,చోడవరం,మాడుగుల,నర్సీపట్నం,అనంతగిరి ప్రాంతాల్లోని శారదా,వరాహ,తాండవ,సర్పా,గోస్తని నదుల పరిసరాలను పరిశీలించారు. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదకరస్థాయిలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలతో బ్రిడ్జిలతోపాటు,నదీగర్భానికి ప్రమాదం పొంచి ఉందని నిర్థారణకొచ్చారు. ఇకపై ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వకూడదని ప్రాథమిక నివేదికలో తేల్చారు. చోడవరం,అనకాపల్లిలోని వరాహ,శారదా నదుల్లో అసలు ఇసుక జోలికి పోకూడదని స్పష్టంచేశారు.

ముఖ్యంగా మూడు కేటగిరీలుగా నదులు,కాలువలను విభజించి తవ్వకాలకు అనుమతులు ఇవ్వాలా?వద్దా? అని తని ఖీచేస్తే.. ఏ విభాగంలో కూడా పరిస్థితులు అనుకూలంగా లేవని తేలింది. జిల్లాలో అధికారికంగా మూడు నుంచి నాలుగు రీచ్‌లకు ఏటా వేలం నిర్వహించేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్.రాయవరం మండలం పొందూరు రీచ్ ఒక్కదాన్ని మాత్రమే వేలానికి అనుమతించే అవకాశాలున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. సమైక్య ఉద్యమం కారణంగా కొన్నిచోట్ల తనిఖీలు ఆగిపోయాయి. సమ్మె ముగిశాక ఈ ప్రక్రియ పూర్తిచేసి జాయింట్‌కలెక్టర్‌కు నివేదిక ఇవ్వనున్నారు. దాని ఆధారంగా వేలం నిర్వహించాలా?లేదా? అనేదానిపై నిర్ణయం తీసుకుంటారు.

అంతేకాదు ఇసుక తవ్వకాలు అక్రమంగా చేపట్టేవారిపై నిఘా పెం చేందుకు పోలీసుశాఖను పూర్తిస్థాయిలో రం గంలోకి దించాలని కమిటీ తన నివేదికలో ప్రస్తావించనుంది. కాగా ఆకస్మిక దాడులతో స్వాధీనం చేసుకున్న ఇసుకను ఎక్కువ కాలం నిల్వ ఉంచకుండా వెంటనే అవసరమైనవారికి విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఇటీవల చోడవరం,దేవరాపల్లి, అనకాపల్లిల్లో దాడు లు చేసి పట్టుకున్న వెయ్యి క్యుబిక్ మీటర్ల ఇసుకను అతి తక్కువగా క్యుబిక్ మీటరు రూ.40చొప్పున పంచాయతీరాజ్, రైల్వేకు విక్రయించారు.
 

మరిన్ని వార్తలు