ఇదేమి అంచనా?

26 Mar, 2018 01:07 IST|Sakshi

‘పోలవరం’పై సీడబ్ల్యూసీ ప్రశ్నలకు సమాధానం చెప్పండి

అలాగైతేనే మీ ప్రతిపాదనలను పరిశీలిస్తాం..  

రాష్ట్ర ప్రభుత్వానికి మసూద్‌ హుస్సేన్‌ కమిటీ స్పష్టీకరణ  

‘పోలవరం’లో సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనల్లో లోగుట్టు ఏమిటి?

వ్యయం తగ్గాలి గానీ పెరిగింది ఎందుకు?  

ఒకేసారి రూ.30,924.03 కోట్లు పెంచేస్తారా?  

రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జలసంఘం ప్రశ్నలు  

ప్రతిపాదనలను ఇప్పటికే రెండుసార్లు వెనక్కి పంపిన సీడబ్ల్యూసీ

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెబితేనే.. అంచనా వ్యయంలో సవరించిన ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తుందని మసూద్‌ హుస్సేన్‌ నేతృత్వంలోని నిపుణుల కమిటీ తాజాగా తేల్చిచెప్పింది. 2015–16 ధరలతో పోలిస్తే.. 2013–14 ధరల ఆధారంగా రూపొందించిన ప్రతిపాదనల్లో అంచనా వ్యయం ఎక్కువగా చూపడాన్ని సీడబ్ల్యూసీ తప్పుపట్టింది. హెడ్‌వర్క్స్, భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ తదితర అంశాల వ్యయాన్ని ఒకేసారి రూ.30,924.03 కోట్లు పెంచేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సవరించిన అంచనా వ్యయం ప్రతిపాదనల్లో తప్పులను సీడబ్ల్యూసీ ఇప్పటికే బహిర్గతం చేసింది. ఫిబ్రవరి 19న ఒకసారి, మార్చి 6వ తేదీన మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ప్రాతిపాదనలను తిప్పిపంపింది. తాము సంధించిన ప్రశ్నలకు ఆధారాలతో సహా సరైన వివరణ ఇస్తేనే సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను పరిశీలిస్తామని స్పష్టం చేసింది.  

రెండున్నరేళ్ల తర్వాత ప్రతిపాదనలు  
సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనల విషయంలో సీడబ్ల్యూసీ ప్రశ్నలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పందించడం లేదు. ఈ నెల 17, 18 తేదీల్లో పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించిన మసూద్‌ హుస్సేన్‌ కమిటీ ఈ నెల 21వ తేదీన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇచ్చింది. సీడబ్ల్యూసీ లేవనెత్తిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇస్తేనే సవరించిన వ్యయ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఆ నివేదికలో మరోసారి స్పష్టం చేయడం కలకలం రేపుతోంది. కాగా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) తొలి సమావేశం 2015 మార్చి 12న జరిగింది. తాజా ధరల మేరకు ప్రాజెక్టులో సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను తక్షణమే పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కానీ, రెండున్నరేళ్ల తర్వాత అంటే 2017 ఆగస్టు 16న ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.16,010.45 కోట్ల నుంచి రూ.58,319.06 కోట్లకు పెంచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలవనరుల శాఖకు ప్రతిపాదనలు పంపింది. వీటిని పరిశీలించిన సీడబ్ల్యూసీ తీవ్రమైన అభ్యంతరాలను లేవనెత్తుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నాస్త్రాలను సంధించింది.  

సీడబ్ల్యూసీ లేవనెత్తిన ప్రశ్నలు.. 
- పోలవరం ప్రాజెక్టు ప్రధాన జలాశయం (హెడ్‌ వర్క్స్‌) అంచనా వ్యయాన్ని 2015–16 ధరల ప్రకారం రూ.5,535.41 కోట్లకు పెంచుతూ 2016 సెప్టెంబర్‌ 8న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, 2013–14 ధరల ఆధారంగా రూపొందించి సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనల్లో రూ.11,637.98 కోట్లుగా పేర్కొన్నారు. 2015–16 ధరలతో పోల్చితే 2013–14 ధరలతో రూపొందించిన అంచనా వ్యయం తక్కువగా ఉండాలి. కానీ, అధికంగా ఉండటానికి కారణాలు ఏమిటి?  
కుడి కాలువ అంచనా వ్యయం 2015–16 ధరల ప్రకారం రూ.4,375.77 కోట్లుగా నిర్ధారిస్తూ 2016 డిసెంబర్‌ 6న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2013–14 ధరల ప్రకారం రూపొందించిన సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనల్లో కుడి కాలువ వ్యయాన్ని రూ.3,645.15 కోట్లుగా పేర్కొంది. అలాగే ఎడమ కాలువ అంచనా వ్యయాన్ని 2015–16 ధరల ప్రకారం రూ.3,645.15 కోట్లుగా ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2013–14 ధరల ఆధారంగా దాని వ్యయం తగ్గాలి. కానీ, రూ.4,960.83 కోట్లకు వ్యయం ఎలా పెరిగింది?  
పోలవరం జలాశయం, కుడి, ఎడమ కాలువలకు భూసేకరణ చట్టం–2013 అమల్లోకి రాక ముందు ఎంత భూమి సేకరించారు? ఆ తర్వాత ఎంత సేకరించారు? ఇందులో అసైన్డ్, సీలింగ్, దేవాదాయ, గిరిజనుల భూముల విస్తీర్ణం ఎంత?  
2010–11 ధరల ప్రకారం భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ అంచనా వ్యయం రూ.2,934.42 కోట్లే. కానీ, 2013–14 ధరల ప్రకారం ఆ మొత్తాన్ని రూ.33,858.45 కోట్లకు పెంచేశారు. వ్యయం ఒకేసారి రూ.30,924.03 కోట్లు ఎందుకు పెరిగింది?  

స్పందించని ప్రభుత్వం
పోలవరం ప్రాజెక్టు పనుల్లో అంచనా వ్యయం పెంపు, టెండర్లు తదితర అంశాలకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి. కానీ హెడ్‌ వర్క్స్, కుడి, ఎడమ కాలువ అంచనా వ్యయాన్ని 2015–16 ధరల ప్రకారం పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులకు పీపీఏ అనుమతి లేదు. ఇదే అంశాన్ని సీడబ్ల్యూసీ తప్పుబట్టడం, ఈ వ్యవహారంలో అక్రమాల గుట్టు రట్టయ్యే అవకాశం ఉండటంతో రాష్ట్ర సర్కార్‌ ఆందోళన చెందుతోంది. భూసేకరణలో చోటుచేసుకున్న అవకతవకలు బహిర్గతమయ్యే ప్రమాదం ఉందని భయపడుతోంది. అందుకే సీడబ్ల్యూసీ సంధించిన ప్రశ్నలపై స్పందించడం లేదని తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు