ఎంబీబీఎస్‌.. మ.. మ.. మాస్‌! 

30 Jul, 2019 10:09 IST|Sakshi

ఎంబీబీఎస్‌ పరీక్షలలో మాస్‌ కాపీయింగ్‌

సెల్‌ఫోన్‌ వాట్సప్‌ ద్వారా ప్రశ్న పత్రాలు, జవాబులు

అబ్జర్వర్‌ను మేనేజ్‌ చేసిన కళాశాల అధికారులు

ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసిన వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ 

వారంతా రేపటి ప్రాణదాతలు.. నాడిని పరీక్షించాల్సిన భావి వైద్యులు. రోగులు దైవంగా భావించే వృత్తిని చేపట్టా ల్సిన వారు. కానీ, పరీక్షల సమయంలోనే పెడదారి పట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం దుర్వినియోగపర్చారు. సెల్‌ఫోన్ల సాయంతో ఎంచక్కా మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడ్డారు. నిబంధనలకు కాలదన్ని పరీక్ష హాల్లోకి స్మార్ట్‌ఫోన్లు తెచ్చారు. వాట్సప్‌ ద్వారా ప్రశ్నలను స్నేహితులకు పంపి, జవాబులు తెప్పించుకొని మరీ రాస్తున్నారు. ఇది తప్పని చెప్పాల్సిన వైద్య కళాశాల అధికారులే వారికి సహకరించారు. ఒంగోలు రిమ్స్‌ వెద్య కళాశాలలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ తంతు సోమవారం కొత్త అబ్జర్వర్‌ రాకతో బట్టబయలైంది. వెంటనే అప్రమత్తమైన కళాశాల అధికారులు విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. అజ్జర్వర్‌ నోటికి సైతం తాళం వేశారు. ఎంబీబీఎస్‌ విద్యార్థులు ఇలా పరీక్షల్లోనే కాపీ కొడితే ఇక ప్రజల ప్రాణాలేం కాపాడతారు? అనే ప్రశ్న ఉదయిస్తోంది.

సాక్షి, ఒంగోలు సెంట్రల్‌: జిల్లా కేంద్రం ఒంగోలులోని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌)లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో గత నాలుగు రోజులుగా ఎంబీబీఎస్‌ సప్లమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల 21వ తేదీ నుంచి మొత్తం మూడు బ్యాచ్‌ల విద్యార్థులు ఎంబీబీఎస్‌ థియరీ సప్లిమెంటరీ, ప్రాక్టికల్‌ పరీక్షలకు హాజరవుతున్నారు. ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు 19 మంది, సెకండ్‌ ఇయర్‌లో ఒక విద్యార్థి, మూడో సంవత్సరం విద్యార్థులు ఏడుగురు తాము ఫెయిల్‌ అయిన పరీక్షలను రాస్తున్నారు. మొత్తం 27 మంది వైద్య విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలను రాస్తున్నారు. సోమవారం ఫైనల్‌ ఇయర్, సెకండ్‌ ఇయర్‌ సప్లిమెంటరీ ఫోరెన్సిక్, ఈఎన్‌టి, పీడియాట్రిక్‌ పరీక్షలు జరిగాయి. వైద్య కళాశాల అధ్యాపకులు, ప్రిన్సిపల్‌ వీటిని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హెల్త్‌ యూనివర్సిటీ నుంచి సోమవారం నెల్లూరుకు చెందిన ఒక ప్రొఫెసర్‌ అబ్జర్వర్‌గా వచ్చారు. 

అబ్జర్వర్‌ రాకతో పట్టుబడిన వైద్య విద్యార్థులు
ఈనెల 21వ తేదీ నుంచి వైద్య పరీక్షలు జరుగుతున్నా, ఎక్సటర్నల్‌ పరీక్షల అబ్జర్వర్‌ సోమవారం రావడంతో వైద్య విద్యార్థుల కాపీయింగ్‌ గుట్టు రట్టయింది. ఈ పరీక్షలలో ఫైనల్‌ ఇయర్‌కు చెందిన ఎనిమిది మంది కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు నెల్లూరు నుంచి వచ్చిన యూనివర్సిటీ అబ్జర్వర్‌ గుర్తించారు. ఆయన ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని విద్యార్థుల నుంచి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సెల్‌ఫోన్‌ ద్వారా విద్యార్థులు ప్రశ్న పత్రాలను బయట వారి స్నేహితులకు పంపి, అక్కడి నుంచి సమాధానాలను తిరిగి పొందుతున్నట్లు గుర్తించారు. కొంత మంది విద్యార్థుల వద్ద కాపీయింగ్‌ స్లిప్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొదట ఓ విద్యార్థి వద్ద సెల్‌ఫోన్‌ను చూసిన అబ్జర్వర్, ఇతర విద్యార్థులను తనిఖీ చేయగా ఇంకొందరి వద్ద కూడా సెల్‌ఫోన్‌లు ఉన్నాయి. దీంతో అబ్జర్వర్‌ వాటన్నిటినీ స్వాధీనం చేసుకున్నారు. ఎరేజర్‌ పై కాపీ రాసిన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం తెలిసి, అప్రమత్తమైన వైద్య కళాశాల అధికారులు అబ్జర్వర్‌తో మాట్లాడి, కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థులను డీబార్‌ కాకుండా కాపాడారు. 

పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్లా..
సెల్‌ఫోన్‌లను పరీక్ష హాలులోకి తీసుకు రాకూడదనే నిబంధన ఉన్నా వైద్య కళాశాల అధికారులు, నిబంధనలను తుంగలో తొక్కారు. సెల్‌ఫోన్‌లను పరీక్షల గదిలోకి అనుమతించారు. అధికారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం. పరీక్షల గదిలో సీసీ కెమెరాలు ఉన్నా కాపీయింగ్‌ విషయం వాటి కంట పడకుండా అధికారులు మేనేజ్‌ చేసినట్లు సమాచారం. విద్యార్థుల నుంచి డబ్బు దండుకుని వైద్య కళాశాల అధికారులే ఈ వ్యవహారాన్ని గుట్టుగా నడుపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారే సోమవారం కాపీయింగ్‌ను గుర్తించిన అబ్జర్వర్‌ను బతిమాలి చర్యలు లేకుండా చూశారనే విమర్శలూ వినిపిస్తున్నాయి.  నాలుగు రోజులుగా జరుగుతున్న పరీక్షల్లో రోజూ ఇదే తంతు కొనసాగిందని వైద్య కళాశాలలోని కొందరు సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు.  

స్పందించని ప్రిన్సిపల్‌..
పరీక్షల్లో వైద్య విద్యార్థులు కాపీయింగ్‌ వ్యవహారంపై ‘సాక్షి’ ఫోన్‌లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా ప్రిన్సిపల్‌  అందుబాటులోకి రాలేదు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున నగదు చేతులు మారిన్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. 

మరిన్ని వార్తలు