కాపీయింగ్‌కు పాల్పడితే చర్యలు

3 May, 2019 12:57 IST|Sakshi
గిద్దలూరులో పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న స్క్వాడ్‌ అధికారి వెంకటేశ్వర్లు

ఓపెన్‌ పరీక్షల సిట్టింగ్‌ స్క్వాడ్‌ అధికారి, కొమరోలు ఎంఈఓ వెంకటేశ్వర్లు

ప్రకాశం, గిద్దలూరు: ఏపీ ఓపెన్‌ స్కూల్‌ పరీక్షల్లో విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడితే చర్యలు తప్పవని సిట్టింగ్‌ స్క్వాడ్‌ అధికారి, కొమరోలు ఎంఈఓ కావడి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఇంటర్మీడియెట్‌ పరీక్షలు స్థానిక జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ జరిగితే ఇన్విజిలేటర్లపై చర్యలు తప్పవని వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఓపెన్‌ స్కూల్‌ 10వ తరగతి పరీక్షల్లో ఇన్విజిలేటర్ల సహకారంతో మాస్‌కాపీయింగ్‌పై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఆర్‌జేడీ శ్రీనివాసరెడ్డి కొమరోలు ఎంఈఓ కావడి వెంకటేశ్వర్లును సిట్టింగ్‌ స్క్వాడ్‌గా నియమించారు. దీంతో గురువారం పలు పరీక్ష కేంద్రాలను వెంకటేశ్వర్లు సందర్శించి పర్యవేక్షించారు. గురువారం జరిగిన ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షలకు 285 మంది విద్యార్థులకుగానూ 40 మంది గైర్హాజరయ్యారని, 245 మంది హాజరయ్యారని స్థానిక పరీక్ష కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌ ప్రేమ్‌సాగర్‌ తెలిపారు.

కంభంలో పరీక్ష కేంద్రాల తనిఖీ...
కంభం: గురువారం జరిగిన ఏపీ ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలకు సంబంధించి పలు కేంద్రాలను స్క్వాడ్‌ అ«ధికారులు బృందాలుగా ఏర్పడి తనిఖీ చేశారు. బుధవారం ప్రారంభమైన ఓపెన్‌ పరీక్షల్లో భాగంగా కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో జోరుగా మాస్‌కాపీయింగ్‌ జరిగిన నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. కంభంలో గురువారం పరీక్ష కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. గురువారం ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కాగా, కంభం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, జేఆర్‌ఆర్‌ బీఈడీ అండ్‌ డీఈడీ కళాశాల పరీక్ష కేంద్రాలను ఒంగోలు నుంచి వచ్చిన రెండు ప్రత్యేక బృందాల స్క్వాడ్‌ అధికారులు సందర్శించి పరిశీలించారు. కాగా, కంభం తహసీల్దార్, కంభం, అర్ధవీడు, మార్కాపురం ఎంఈఓలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. మిగిలిన పరీక్షల్లోనైనా కాపీయింగ్‌ జరగకుండా జిల్లా ఉన్నతాధికారులు ఇదే పద్ధతిని కొనసాగిస్తారో.. లేదో వేచిచూడాలి.

నేడు, రేపు జరగాల్సిన ఓపెన్‌ పరీక్షలు వాయిదా...
ఒంగోలు టౌన్‌: ఉత్తర కోస్తా జిల్లాలకు ఫణి తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలను రెండురోజులు వాయిదా వేస్తూ ఏపీఓఎస్‌ఎస్‌ డైరెక్టర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 3, 4 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను 9, 10 తేదీలకు వాయిదా వేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి వీఎస్‌ సుబ్బారావు తెలిపారు. రెండు రోజుల పరీక్షలను వాయిదా వేసిన విషయాన్ని జిల్లాలోని పరీక్ష కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లు తమ పరీక్ష కేంద్రాల వద్ద డిస్‌ప్లే చేయాలని ఓపెన్‌ స్కూల్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ బండి గోవిందయ్య తెలిపారు. 9వ తేదీ మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఇంటర్మీడియెట్‌ ఇంగ్లిష్‌ పరీక్ష, 10వ తేదీ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఇంటర్మీడియెట్‌ మ్యాథ్స్‌ పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ విషయాన్ని పరీక్ష రాసే అభ్యర్థులకు తెలియజేయాలని జిల్లా కో ఆర్డినేటర్‌ కోరారు.

‘ఓపెన్‌’ విధుల నుంచినలుగురు తొలగింపు
జిల్లాలోని ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షల్లో అక్రమాలను సరిదిద్దుకునే పనిలో జిల్లా విద్యాశాఖ నిమగ్నమైంది. బుధవారం జిల్లాలోని 21 పరీక్ష కేంద్రాల్లో జరిగిన ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి పరీక్షల్లో ఇన్విజిలేటర్లు దగ్గరుండి చూచిరాత రాయించడం, కొన్నిచోట్ల బోర్డుపై సమాధానాలు రాయడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కంభంలో జరిగిన ఓపెన్‌ స్కూల్‌ పరీక్షల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురిని విధుల నుంచి తొలగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి వీఎస్‌ సుబ్బారావు గురువారం తెలిపారు. కంభం పరీక్ష కేంద్రంలోని ఇద్దరు ఇన్విజిలేటర్లు, ఒక చీఫ్‌ సూపరింటెండెంట్, ఒక సిట్టింగ్‌ స్క్వాడ్‌ను తొలగించినట్లు చెప్పారు. ఒంగోలులోని బండ్లమిట్టలో జరుగుతున్న ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలను జిల్లా విద్యాశాఖాధికారి గురువారం తనిఖీ చేశారు. ఎక్కడా ఎలాంటి అక్రమాలు జరగకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.

విచారణాధికారిగా శ్రీనివాసరావు...
కంభంలో తొలిరోజు జరిగిన ఓపెన్‌ స్కూల్‌ పరీక్షల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగిన నేపథ్యంలో ఈ సంఘటనపై సమగ్ర నివేదిక అందించేందుకు కందుకూరు మండలం పలుకూరు జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావును విచారణాధికారిగా నియమించినట్లు జిల్లా విద్యాశాధికారి సుబ్బారావు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన నివేదికను శుక్రవారం తనకు అందించాలని ఆదేశించారు. నివేదిక వచ్చిన వెంటనే ఓపెన్‌ స్కూల్‌ డైరెక్టర్‌కు పంపించనున్నట్లు డీఈఓ తెలిపారు.

మరిన్ని వార్తలు