కన్నీటి వీడ్కోలు

24 Oct, 2018 06:34 IST|Sakshi
జి.వెంకటాపురంలో మృతదేహాలకు ఒకే చోట దహన సంస్కారాలు

రోడ్డు ప్రమాద మృతులకు జి.వెంకటాపురంలో అంత్యక్రియలు  

వేలాదిగా తరలివచ్చిన బంధువులు,స్నేహితులు

కిక్కిరిసిన శ్మశాన వాటిక మిన్నంటిన రోదనలు

అంతవరకూ గుండెలోతుల్లో గూడుకట్టుకున్న బాధ కన్నీళ్లరూపంలో ఎగసిపడింది... దు:ఖాన్ని దిగమింగుకుని అంతవరకూ నిశ్శబ్దంగా లోలోపల కుమిలికుమిలి పోయిన వారు ఒక్కసారిగా ఘొల్లుమన్నారు. విగతజీవులుగా మారిన తమ ఆప్తులను చూసి   తట్టుకోలేకపోయారు. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చేబ్రోలు వద్ద సోమవారం జరిగిన ప్రమాదంలో  తొమ్మిది మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఏడుగురి మృతదేహాలకు మంగళవారం జి.వెంకటాపురంలో సామూహికంగా అంత్యక్రియలు నిర్వహించారు. కడసారి చూపు కోసం వేలాదిగా తరలివచ్చిన వారితో శ్మశానవాటిక కిక్కిరిసి పోయింది. స్థానికులే కాకుండా మండల వ్యాప్తంగా ప్రజలు చేరుకున్నారు.   మృతుల బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల   రోదనలతో శ్మశాన వాటిక మార్మోగింది.  

విశాఖపట్నం, మాకవరపాలెం(నర్సీపట్నం): కాకినాడలో జరిగిన శుభకార్యానికి వెళ్లి తిరిగివస్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జి.వెంకటాపురం గ్రామానికి చెందిన  సబ్బవరపు నూకరత్నం(35), సబ్బవరపు అచ్చియ్యమ్మ(50), పైల లక్ష్మి(45), సబ్బవరపు మహాలక్ష్మి(54), సబ్బవరపు పైడితల్లి(42), సబ్బవరపు వరహాలు(45), గవిరెడ్డి రాము(40)తోపాటు ఇ.కోడూరుకు చెందిన ఆళ్ల సంతోష్‌(34) మరణించిన సంగతి తెలిసిందే.   వీరి మృత దేహాలకు పిఠాపురంలో మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి,  మధ్యాహ్నం 3 గంటలకు స్వగ్రామం తీసుకొచ్చారు. మృతదేహాలు పోస్టు మార్టం పూర్తయిన అనంతరం బయలుదేరాయన్న సంగతి తెలుసుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు వేలాదిగా శ్మశాన వాటికకు తరలివచ్చారు. దీంతో   శ్మశాన వాటిక కిక్కిరిసిపోయింది. మృతదేహాల వాహనాలు చేరుకోవడంతో ఒక్కసారిగా వారంతా ఈ వాహనాల వద్దకు చేరకుని భోరున విలపించారు. తమ వారి మృతదేహం ఎక్కడ ఉందోనంటూ చూస్తూ వెక్కివెక్కి ఏడ్చారు. అనంతరం ఇక్కడే ఏర్పాటు చేసిన టెంటుల్లోకి ఏడు దేహాలను తీసుకువచ్చి ఉంచారు. దీంతో వాటిని గుర్తించిన కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలకు అవధుల్లేకుండాపోయింది.

ఒకే చోట దహనం..
సంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు పూర్తి చేసిన అనంతరం ఒకే చోట పేర్చిన చితులపై ఉంచి మృతదేహాలను దహనం చేశారు.  ఎన్నడూ ఇలాంటి ఘటనను చూడలేందటూ అందరూ గుండెలవిసేలా రోదించారు.  ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘటన ఎన్నడూ చూడని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా ఈ విషాదం నుంచి కోలుకోలేకపోతున్నారు.  

శోకసంద్రంలో సబ్బవరపు వీధి..
మాకవరపాలెం(నర్సీపట్నం): స్థానిక  సబ్బవరపు వీధి శోకసంద్రంలో మునిగిపోయింది. కాకినాడలో జరిగిన శుభకార్యానికి వెళ్లి తిరిగివస్తూ చేబ్రోలు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జి.వెంకటాపురం గ్రామానికి చెందిన ఏడుగురు మహిళలు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే మృతుల్లో ఒకే ఇంటిపేరుతో ఉన్న సబ్బవరపు వరహాలు, నూకరత్నం, మహాలక్ష్మి, అచ్చియ్యమ్మ, పైడితల్లి ఉన్నారు. వీరంతా ఆ గ్రామంలో ఒకే వీధిలో ఉంటున్నారు. దగ్గర బంధువులు కూడా.  నూకరత్నం, పైడితల్లి తోటికోడళ్లు. ఈ ఇంటిలో ఇద్దరు, మిగిలిన ఇళ్లల్లో ఒక్కొక్క మహిళ మరణించడం సబ్బవరపు వారి వీధి వాసులు విషాదంలో మునిగిపోయారు.  

మాకు దిక్కెవరమ్మా..
మాకవరపాలెం(నర్సీపట్నం): తనకు పుట్టి న  కుమార్తెకే కాదు తనను కనిపెంచిన తల్లి దండ్రులు కూడా ఆమె సమానంగా సపర్యలు చేస్తూ సాకుతోంది.  పుట్టుకతోనే కుమా ర్తె మానసిక వికలాంగురాలు.   తల్లిదండ్రులు కూడా వయసు మీదపడి చివరి క్షణాల్లో ఉండడంతో వారిని కూడా చిన్న పిల్లల్లాగే సాకుతోంది.  తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో  గవిరెడ్డి రాము మృతి చెందడంతో తమకు దిక్కెవరంటూ అటు ఆమె కుమార్తె, ఇటు తల్లిదండ్రులు రోదిస్తున్నారు. రాముకు 18 ఏళ్ల క్రితం గంగతల్లి జన్మించింది. పుట్టుకతోనే మానసిక వికలాంగురాలు కావడంతో ఏమీ చేసుకోలేని కుమార్తెను అన్నీ తానై చూసుకుంటోంది. ఇక తల్లిదండ్రులు లాలం తాతారావు, కొండమ్మ తనే పోషిస్తోంది.   భర్తకు ఒక కన్ను కనిపించక పోవడంతో కూలి పనులే చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రమాదంలో రాము మృతి చెందిందని తెలిసిన వీరంతా   ఇక మాకు దిక్కెవరంటూ రోదిస్తున్నారు.

రోదనలతో దద్దరిల్లిన ఆస్పత్రి
పిఠాపురం: గొల్లప్రోలు మండలం చేబ్రోలు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో ఎనిమిది  మృతదేహాలకు మంగళవారం పిఠాపురం ప్రభుత్వాసుపత్రి వైద్యులు విజయశేఖర్, పద్మశ్రీ పోస్టుమార్టం నిర్వహించారు.  మృతుల కుటుంబ సభ్యులు మాకవరపాలెం  మండలం జి.వెంకటాపురం, భీముకోటపాలెం, జి.కోడూరు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. తమ వారిని కడసారి చూసేందుకు ప్రయత్నించి వారి కోసం కన్నీరుమున్నీరయ్యారు. వారి రోదనలతో ఆస్పత్రి మార్మోగిపోయింది. పోస్టుమార్టం పూర్తయిన వెంటనే అధికారులు మృతదేహాలను వారి బంధువులకు అప్పగించి ప్రత్యేక ప్రభుత్వ వాహనాల్లో వారి స్వగ్రామాలకు పంపించారు. గౌరెడ్డి రాము(35), సబ్బారపు పైడితల్లి (42), సబ్బారపు అచ్చిరాజు(50), పైలాలక్ష్మి (45), సబ్బారపు పాప (30) సబ్బారపు మహాలక్ష్మి(54) వ్యాన్‌ డ్రైవరు ఆళ్ల సంతోష్‌ (30) తో పాటు సబ్బారపు వరహాలు(45) మృతదేహాలకు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. 

వైఎస్సార్‌సీపీ నేతల ఓదార్పు : చేబ్రోలు ప్రమాద ఘటనలోని బాధిత కుటుంబీకులను వైఎస్సార్‌ సీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు మంగళవారం పరామర్శించారు. మాజీ మంత్రి కొప్పన మోహనరావుతో కలిసి ఆయన పిఠాపురం ప్రభుత్వాస్పత్రిలో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులను ఓదార్చారు. వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆదేశాల మేరకు బాధితులకు అండగా ఉంటామని, వారిని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, క్షతగాత్రులకు రూ.పది లక్షల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు