పెల్లుబికిన నిరసనలు

18 Dec, 2013 05:50 IST|Sakshi

ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: తెలంగాణ బిల్లు ప్రతులను రాష్ట్ర విద్యార్థి జేఏసీ నేతలు దహనం చేసి నిరసన తెలిపారు. తెలంగాణ  ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని, దీనిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని ముక్తకంఠంతో నినదించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మంగళవారం స్థానిక రంగారాయుడు చెరువు వద్ద నుంచి ర్యాలీగా బయల్దేరి జయరాం సెంటర్, కోర్టు భవనాల మీదుగా పొట్టిశ్రీరాములు విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర కో-కన్వీనర్ రాయపాటి జగదీశ్ మాట్లాడుతూ తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నేతలు ఏ ఉదయ్‌కుమార్, యువజన జేఏసీ కన్వీనర్ కన్నా వరప్రసాద్, నాయకులు సాయి, విష్ణు, జాషువా, తదితరులు పాల్గొన్నారు.
 
 చీరాలలో..
 చీరాల అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన కుట్రను తిప్పికొట్టాలని సమైక్యాంధ్ర జెఏసీ నాయకులు పిలుపునిచ్చారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి రావడాన్ని నిరసిస్తూ జెఏసీ నాయకులు, విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. తొలుత స్థానిక విజ్ఞానభారతి జూనియర్ కళాశాల నుంచి మార్కెట్ మీదుగా గడియార స్తంభం సెంటర్ వరకు ర్యాలీ సాగింది. విద్యార్థులు అక్కడ మానవహారం ఏర్పాటు చేసి సమైక్యాంధ్రకు మద్దతు తెలిపారు. అనంతరం సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జెఏసీ నాయకులు గుంటూరు మాధవరావు, కర్నేటి రవికుమార్, సయ్యద్ బాబు, ఊటుకూరి రత్తయ్య మాట్లాడుతూ సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సీఎం కిరణ్ వైఫల్యంతో విభజన బిల్లు రాష్ట్రానికి వచ్చిందని విమర్శించారు. స్వార్థం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తోన్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించరన్నారు.  
 
 సీమాంధ్ర ద్రోహి స్పీకర్ ‘నాదెండ్ల’
 చీరాల వీఆర్‌ఎస్‌వైఆర్‌ఎన్ కళాశాల విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల జెఏసీ అధ్యక్షుడు కే ఆంజనేయులు, కో-ఆర్డినేటర్ ఎం మోషే, ఉపాధ్యక్షుడు ఏ జయరావు, ప్రధాన కార్యదర్శి సతీష్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు