అన్నం లెక్కల్లో తిరకాసు!

15 Jul, 2018 11:48 IST|Sakshi

క్యాంటీన్లలో టిఫెన్, భోజనాలపై తలోమాట

తక్కువమందికి పెట్టి ఎక్కువ చూపే అవకాశం

టోకన్లు లేకపోవడంతో బలపడుతున్న అనుమానాలు

తాగునీరు లేక ప్రజల అవస్థలు

లోపించిన పారిశుద్ధ్యం..అందరికీ అన్నం కష్టం!

పారదర్శకంగా లేని అన్న క్యాంటీన్లు  

పేదవాడికి కడుపునిండా నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామని రాష్ట్రప్రభుత్వం అంటోంది. కేవలం రూ.5 నామమాత్రపు ధరకు అల్పాహారం, భోజనం సరఫరా చేస్తున్నామని, ఇందుకోసం కోట్లాది రూపాయలు సబ్సిడీ భారం మోస్తున్నామని ఆర్భాటం చేస్తోంది. క్యాంటీన్ల నిర్మాణంలోనే పెద్దఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఇప్పటికే వచ్చాయి. కాగా ఇప్పుడు నిర్వాహకులు అధికారులు కూడబలుక్కొని తప్పుడు లెక్కలతో భారీ అవినీతికి తెరలేపుతున్నారనే అనుమానాలు సర్వత్రా రేకెత్తుతున్నాయి. క్యాంటీన్ల నిర్వహణలో పారదర్శకత లోపించడమే ఇందుకు కారణంగా పేర్కొంటున్నారు. 

కడప సెవెన్‌రోడ్స్‌: మూడు రోజు ల క్రితం జిల్లాలోని కడప, ప్రొద్దుటూరులో ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు పెడుతున్నారు. ఒక్కోపూట 500 మంది చొప్పున రోజుకు 1,500 మందికి ఆహారం సరఫరా చేస్తున్నామని కడప మున్సిపల్‌ కమిషనర్‌ లవన్న అంటున్నా రు. అయితే క్యాంటీన్‌లో పనిచేస్తున్న సిబ్బంది మాత్రం పూటకు 300మందికి మాత్రమే ఆహారం సరఫరా చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇలా అధికారులు, సిబ్బంది చెబుతున్న మాటలకు పరస్పరం పొంతన లేకపోవడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. సిబ్బంది చెబుతున్న విధంగా పూటకు 300 చొప్పున రోజుకు మూడు పూటల కలిపి 900మందికి టిఫెన్లు, భోజ నాలు సరఫరా చేసి 1,500మందికి సరఫరా చేసినట్లు బిల్లులు చూపి ఆ మేరకు ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసే అవకాశం లేకపోలేదని ప్రజాసంఘాల నేతలు అంటున్నారు.

టొకెన్లు కనిపించవ్‌!
ప్రజలు డబ్బు చెల్లించినపుడు ఎలాంటి టోకెన్లు ఇవ్వకపోవడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని ఇస్తోంది. ఇలా డబ్బు తీసుకుని అలా పేపర్‌ ప్లేట్లు ఇచ్చేస్తున్నారు. ఇందువల్ల ఖచ్చితత్వం లోపిస్తోంది. ఒక వ్యక్తి మూడు పూటలా తింటే క్యాంటీన్‌ నిర్వాహకులకు రూ.25 ఖర్చు వస్తుందని చెబుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఒక్కో వ్యక్తిపై రూ.60 సబ్సిడీ నిర్వాహకులకు ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఇక ఒక్కో వ్యక్తి మూడు పూటలా చెల్లించే రూ.15లను కలిపితే రూ.75లు వస్తుంది. ఇందులో క్యాంటీన్‌ నిర్వాహకులకు అయిన రూ.25 ఖర్చును తీసి వేస్తే రూ.50 ఉంటుంది. భోజనం రవాణా, నిర్వహణకు మరో రూ.10 వేసుకున్నా రూ.40 నికరంగా మిగులుతుంది. మూడు పూటలా కలిపి 600 మందిని అధికంగా చూపెడితే రూ.24వేలు మిగులుతుంది. అంటే రోజుకు 900 మందికే ఆహారం సరఫరా చేస్తూ 1,500 మందికి చేశామని దొంగ లెక్కలు రాసుకోవడం ద్వారా రోజుకు రూ.24వేలు నొక్కేస్తున్నారు.

ఒక కౌంటర్‌..భారీగా క్యూ
అవకతవకలకు అవకాశం లేకుండా క్యాంటీన్‌ నిర్వహణ పారదర్శకంగా జరగాలంటే కంప్యూటర్‌ బిల్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలంటున్నారు. ఇందువల్ల రోజుకు ఎంతమంది క్యాంటీన్‌లో భోజనం చేస్తున్నారో స్పష్టంగా తెలిసిపోతుంది. క్యాంటీన్‌కు ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్నారు. అయితే ఒక కౌంటర్‌ మాత్రమే ఉండడంతో చాలాసేపు క్యూలైన్‌లో వేచి ఉండాల్సి వస్తోంది. కనుక రెండు కౌంటర్లు ఏర్పాటు చేస్తే సౌలభ్యంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తాగునీరు లేక అవస్థలు
కడప జెడ్పీ ఆవరణంలో ప్రారంభించిన అన్న క్యాంటీన్‌లో తాగునీరు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. భోజనం చేస్తున్న సమయంలో గొంతు పట్టుకుంటే అందుబాటులో నీరు లేక ఇబ్బంది పడుతున్నారు. నామమాత్రపు ధరకే భోజనాన్ని అందిస్తున్న ప్రభుత్వం తాగునీటి విషయాన్ని పట్టించుకోకపోవడం సబబు కాదంటున్నారు. క్యాంటీన్‌ ఆవరణంలో పారిశుద్ధ్యం కూడా లోపించింది. అన్నం ప్లేట్లు ఇష్టానుసారంగా పడేసి ఉండడం కనిపించింది.

చేతులు కడుక్కునే నీళ్లే తాగునీరు
క్యాంటీన్‌లో సమస్యల గురించి మున్సిపల్‌ కమిషనర్‌ లవన్నను ‘సాక్షి’ వివరణ కోరింది. ఇందుకు ఆయన బదులిస్తూ పూటకు 500 మందికి ఆహారాన్ని సరఫరా చేస్తున్నామన్నారు. క్యాంటీన్‌లో ప్రజలు చేతులు కడుక్కుంటున్న నీళ్లనే తాగాలన్నారు. పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా డీఈని నియమించామని చెప్పారు.

అన్న పేరు చెడగొట్టవద్దు
పేదవాడికి తక్కువ ధరకే అన్నం సరఫరా చేయడం మంచిదే. క్యాంటీన్‌కు వచ్చిన వారు భోజనం లభించక వెనుదిరిగి పోయే పరిస్థితి వద్దు. నిర్వహణలో పారదర్శకత పాటించడం ద్వారా ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడాలి. ఎన్టీఆర్‌ పేరు చెడగొట్టవద్దు.
– కొండూరు జనార్దన్‌రాజు, కడప

నిర్ణీత సమయమంతా భోజనం పెట్టాలి
ఉదయం టిఫెన్, మధ్యాహ్నం, రాత్రి భోజనాలకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశిత వేళలను ప్రకటించింది. ఆ సమయాల్లో ఎంతమంది వచ్చినా భోజనం పెట్టాలి. అలాకాకుండా మేం ఇంతమందికి మాత్రమే పెడతామనడం సరైంది కాదు. ప్రతిరోజు చాలామంది భోజనం లభించక వెనుకదిరిగిపోతున్నారు.
– ఎన్‌.వెంకట శివ, సీపీఐ నగర  కార్యదర్శి, కడప

మరిన్ని వార్తలు