ఖనిజం మాటున చేదు నిజం

26 Oct, 2017 00:28 IST|Sakshi

ముగ్గురాళ్లు చెబుతున్న ముడుపుల ముచ్చట 

బెరైటీస్‌ కనీస టెండరు ధరలు భారీగా తగ్గింపు 

కొనుగోలుదారులకు లబ్ధిచేకూరేలా తతంగం 

ఏడాదిలో సంస్థకు రూ.400 కోట్ల నష్టం! 

ముఖ్యనేత ఆదేశంమేరకే వ్యూహం 

సాక్షి, ఓబులవారిపల్లె/అమరావతి: మన దగ్గర ఒక వస్తువుంటే ఏం చేస్తాం... ఎంతో కొంత లాభానికి విక్రయిస్తాం. అమ్మకందారుడు ఎవరైనా సరే కొనుగోలుదారుల మధ్య పోటీని పెంచడం ద్వారా అధిక ఆదాయం పొందాలను కుంటాడు. కానీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) అందుకు మినహాయింపు. తన దగ్గరున్న విలువైన బెరైటీస్‌ ఖనిజం ధరను వీలైనంత తగ్గించేం దుకు నానా ప్రయత్నాలు చేస్తోంది. తక్కువ ధరకు కొనుగోలుదారుకు అమ్మేందుకు తాపత్రయ పడుతోంది. బెరైటీస్‌ ధరలను తగ్గించడం, పోటీ లేకుండా సంస్థల మధ్య రాజీ కుదర్చడం ద్వారా కనీస ధరలకే ఖనిజాన్ని కట్టబెట్టేస్తోంది. తద్వారా కొనుగోలుదారుకు అధిక లాభాలు చేకూరేలా చేసి, అందులో భారీగా ముడుపులు అందుకునేందుకు ప్రభుత్వ పెద్దలు వేసిన పన్నాగానికి తగ్గట్టుగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ పెద్దలకు కమీషన్లకోసం రాష్ట్ర ఖజానాకు రూ.400 కోట్లు నష్టం కలిగించడానికి సైతం వెనుకాడని ఏపీఎండీసీ వ్యవహారమిది. 

మూడుసార్లు తగ్గింపు...
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు వైఎస్సార్‌ జిల్లా మంగంపేట ప్రాజెక్టులోని బెరైటీస్‌ ధరలు తగ్గించేందుకు ఏపీఎండీసీ కష్టపడుతోంది.ఇలా గత ఏడాది బెరైటీస్‌ ధరలు తగ్గించడం ద్వారా రూ. 150 కోట్లు  సంస్థ ఆదాయానికి గండి కొట్టారు. అలాగే బెరైటీస్‌ ఖనిజ తవ్వకం టెండర్లలో కాంట్రాక్టర్లను రింగుగా మార్చి అధిక ధరకు ‘చెన్నైకి చెందిన ‘త్రివేణి’కి కాంట్రాక్టు కట్టబెట్టారు. తద్వారా రూ. 531 కోట్ల ఆయాచిత లబ్ధి చేకూర్చినందుకు ప్రభుత్వ ముఖ్యనేత అందులో సింహభాగం వాటా పొందారని తెలుస్తోంది. ఈ ఏడాది కూడా అదే విధంగా వాటా పొందేందుకు ముందస్తు రంగం సిద్ధం చేయించారు. ఆ మేరకు 22 లక్షల టన్నుల బెరైటీస్‌ అమ్మకానికి టెండర్లు ఆహ్వానిస్తూ ఏపీఎండీసీ తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది.

అంతర్జాతీయ స్థాయిలో బెరైటీస్‌ ధరలకు అనుగుణంగా శాస్త్రీయ విధానంలో ధరలు ఖరారు చేయాలని, ఇందుకు అడ్డుగా ఉన్న (తెలుగుదేశం ప్రభుత్వం 2015 జనవరి 27వ తేదీన జారీ చేసిన) జీవో 22ను రద్దుచేయాలంటూ ఏపీఎండీసీ వైస్‌ చైర్మన్‌ కమ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఈ ఏడాది జూలై నాలుగో తేదీన  ప్రభుత్వానికి లేఖ రాశారు. థర్డ్‌ పార్టీ కన్సల్టెన్సీ ప్రైవేటు సంస్థను ఏర్పాటు చేసి దాని సూచనలను పరిశీలించి ధరలు ఖరారు చేసుకోవచ్చంటూ నిర్ణయా« ధికారాన్ని ఏపీఎండీసీ పాలకమండలికే అప్పగిస్తూ ప్రభుత్వం ఆగస్టు 24న జీవో నంబరు–262 జారీ చేసింది. దీంతో ఏపీఎండీసీ ఒక ప్రైవేటు సంస్థ నుంచి నివేదిక తెప్పించుకుని బెరైటీస్‌ ధరలను భారీగా తగ్గించి టెండర్లు పిలిచింది. దీనివల్ల ఏపీఎండీసీ ఖజానాకు జరిగే నష్టం రూ.400 కోట్ల పైమాటేనని అంచనా. ఇది చాలదన్నట్లుగా... టెండరును దక్కించుకున్న వారు కొనుగోలు చేసుకునేందుకు చేసుకున్న ఒప్పందంలోని ఖనిజం పరిమాణంలో 40 శాతం కొనుగోలు చేస్తే తాయిలంగా ఐదు శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది. దీన్ని అధికార వర్గాలు విమర్శిస్తున్నాయి. 

ప్రభుత్వ పెద్దల కుమ్మక్కు
బెరైటీస్‌ కొనుగోలు చేసే, ఎగుమతి చేసే పెద్ద సంస్థల వారితో ఏపీఎండీసీ యాజమాన్యం, ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కై ఇలా ధరలు తగ్గించాయని ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. ఈ ఒప్పందం వెనుక మర్మం ఏమిటని కొందరు పల్వరైజింగ్‌ మిల్లుల యజమానులు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు టెండర్‌ కాలపరిమితి ముగియగా... మరోవైపు టెండర్‌ నిర్వహించేలోపు ఒక ప్రైవేటు సంస్థకు 70 వేల టన్నుల ఖనిజం డెలివరీ ఆర్డర్‌ ఇవ్వడాన్ని బట్టే గూడుపుఠాణి నడుస్తున్నట్లు స్పష్టమవుతోందని అధికారులు అంటున్నారు. టెండర్లలో పాల్గొనేందుకు స్థానికంగా ఉన్న మిల్లుల యజమానులకు, వ్యాపారులకు ఆర్థిక పరమైన స్థోమత (అర్హత) లేకపోవడంతో కొంతమంది ఎగుమతిదారులు సిండికేట్‌గా మారి తక్కువ ధరకు కైవసం చేసుకునేందుకే కనీస ధరను తగ్గించేలా చేశారని బహిరంగంగానే కిందిస్థాయి అధికారులు అంటున్నారు. ఒకవైపు ఖనిజ విక్రయ ధరలను తగ్గిస్తూ మరో వైపు బెరైటీస్‌ తవ్వకం రేటు పెంచుతూ పోవడం సంస్థ మనుగడకే ప్రమాదమని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దీనివల్ల సంస్థ లాభాల నుంచి నష్టాల్లోకి కూరుకుపోయే ప్రమాదం ఉందని ఉద్యోగులు భయపడుతున్నారు. 

రూ.400 కోట్లకు పైగా నష్టం ఇలా..
- టన్ను ‘ఎ’ గ్రేడ్‌ ఖనిజం కనీస ధర గతంలో రూ.6,750 ఉండగా దీనిని తాజా టెండరు నోటిఫికేషన్‌లో రూ.4,000కు తగ్గించింది. టన్నుకు తగ్గించిన మొత్తం రూ.2,750. ఈ లెక్కన 8.5 లక్షల టన్నుల ‘ఎ’ గ్రేడ్‌ ఖనిజ విక్రయంవల్ల సంస్థకు కలిగేనష్టం. రూ.233 కోట్లు
- టన్ను ‘బి’ గ్రేడ్‌ ఖనిజం కనీస ధర గతంలో రూ.5,360 ఉండగా రూ.3,000కు తగ్గించింది. టన్నుకు తగ్గిన ధర రూ.2,360 ప్రకారం 2.5 లక్షల టన్నుల అమ్మకంవల్ల సంస్థకు కలిగే నష్టం  రూ.59 కోట్లు
-  టన్ను ‘సి’ ప్లస్‌ ‘డి’ ప్లస్‌ డబ్ల్యూ ఖనిజం గతంలో రూ.2,500  ఉండగా ప్రస్తుతం కనీస ధరను రూ.1,500కు తగ్గించింది. టన్నుకు తగ్గించిన మొత్తం రూ.1000. మొత్తం 11 లక్షల టన్నులు విక్రయానికి టెండర్లు పిలిచింది. దీనివల్ల ఏపీఎండీసీకి కలిగే నష్టం.  రూ.110 కోట్లు

మొత్తం ఏ, బీ, సీ... గ్రేడ్లకు సంబంధించి 22 లక్షల టన్నుల ఖనిజానికి కనీస ధర తగ్గింపు వల్ల ఏడాదికి కలిగే నష్టం రూ.402 కోట్లు ఉంటుందని అధికారిక గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు