ఆటో రయ్‌.. రయ్‌.. 

25 Sep, 2019 04:04 IST|Sakshi

భారీగా పెరిగిన అమ్మకాలు 

రాష్ట్రంలో ఈ ఏడాది 5 నెలల్లో 17 శాతం వృద్ధితో 20,139 ఆటోల విక్రయం 

ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా 7% పడిపోయిన ఆటో అమ్మకాలు 

సాక్షి, అమరావతి : కొన్ని నెలలుగా దేశ వ్యాప్తంగా ఆటో మొబైల్‌ అమ్మకాలు భారీగా క్షీణిస్తున్న దశలో రాష్ట్రంలో మాత్రం ఆటోల అమ్మకాలు పెరగడం మార్కెట్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆటో అమ్మకాల్లో భారీ వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల కాలంలో దేశ వ్యాప్తంగా ఆటోమొబైల్‌ పరిశ్రమ అమ్మకాలు 15.89 శాతం మేర క్షీణించినట్లు సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌ (సియామ్‌) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో మన రాష్ట్రంలో ఈ క్షీణత కేవలం 9.4 శాతానికి మాత్రమే పరిమితమైంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఐదు నెలల కాలానికి ద్విచక్ర వాహనాల దగ్గర నుంచి భారీ వాహనాల వరకు దేశ వ్యాప్తంగా అమ్మకాలు 1.15 కోట్ల నుంచి 97.31 లక్షలకు పడిపోయాయి. కానీ ఇదే సమయంలో రాష్ట్రంలో అమ్మకాలు 5.10 లక్షల నుంచి 4.62 లక్షలకు మాత్రమే తగ్గాయి.

ఆటో అమ్మకాల్లో భారీ వృద్ధి
ఆర్థిక మాంద్యంతో ఒకపక్క వాహనాల విక్రయాలు తగ్గుతుంటే రాష్ట్రంలో ఆటో అమ్మకాలు 17.18 శాతం పెరగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గడిచిన ఐదు నెలల్లో రాష్ట్రంలో 20,139 ఆటోలు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంలో అమ్ముడైంది 17,187 మాత్రమే. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా ఆటోల అమ్మకాలు 2,33,865 నుంచి 2,16,907కు పడిపోవడంతో 7.25 క్షీణత నమోదైంది. మందగమనం నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన వారు ఆటోలు నడుపుకోవడానికి ఆసక్తి చూపిస్తుండటంతో పాటు, విజయవాడలో సీఎన్‌జీ ఆటోలను ప్రవేశపెట్టడం వల్ల అమ్మకాలు పెరిగాయని డీలర్లు చెబుతున్నారు. రాష్ట్రం మొత్తం మీద కార్లు, ప్యాసింజర్ల వాహనాల అమ్మకాలు భారీగా పడిపోయాయి. కార్ల అమ్మకాలు 21 శాతం, సరుకు రవాణా వాహనాలు 24 శాతం, ప్యాసింజర్ల వాహనాల అమ్మకాలు 14.64 శాతం మేర క్షీణించాయి. రాష్ట్రంలో నిర్మాణ రంగ పనులు మందగించడం వాణిజ్య వాహనాల అమ్మకాలు తగ్గడానికి కారణమని డీలర్లు పేర్కొంటున్నారు. 

దసరా, దీపావళిపై ఆశలు 
గత నాలుగు నెలల నుంచి అమ్మకాలు తగ్గుతుండటంతో వచ్చే దసరా, దీపావళి పండుగలపై డీలర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. వినియోగదారులను ఆకర్షించడానికి భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌ – అక్టోబర్‌ పండుగల సమయంలో కృష్ణా జిల్లాలో 4,000 ద్విచక్ర వాహనాలు విక్రయిస్తే సెప్టెంబర్‌ ముగుస్తున్నా ఇప్పటి వరకు కేవలం 700 మాత్రమే విక్రయించామంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ప్రముఖ ఆటోమొబైల్‌ డీలర్‌ సంస్థ ప్రతినిధి వాపోయారు. ప్రస్తుతం పండగల సీజన్‌కు తోడు కేంద్రం కార్పొరేట్‌ ట్యాక్స్‌ను భారీగా తగ్గించడంతో భారీ డిస్కౌంట్లు ఇవ్వడానికి ఆయా సంస్థలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.

ఇంతకాలం పన్నులు తగ్గుతాయని కొనుగోళ్లు వాయిదా వేసుకున్న వారు ఇప్పుడు జీఎస్టీ తగ్గింపు లేదనే  స్పష్టత రావడంతో అమ్మకాలు పుంజుకుంటాయని భావిస్తున్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాలు వచ్చినా.. పెట్రోలు, డీజిల్‌ వాహనాలను రద్దుచేసే ఆలోచన లేదని కేంద్ర మంత్రి గడ్కరీ స్పష్టత ఇవ్వడం వల్ల కూడా అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. పండగల తర్వాత పరిశ్రమ కోలుకుంటుందన్న ఉద్దేశంతో గత నాలుగు నెలలుగా అమ్మకాలు లేకపోయినా ఉద్యోగులను తొలగించకుండా కొనసాగిస్తున్నట్లు డీలర్లు చెబుతున్నారు. పండగల తర్వాత పరిస్థితిలో మార్పు లేకపోతే అప్పుడు ఉద్యోగుల తొలగింపు గురించి ఆలోచించాల్సి వస్తుందన్నారు.

సంక్షోభంలో విస్తరిస్తాం...
ప్రస్తుతం ఆటోమొబైల్‌ రంగం సంక్షోభం వల్ల చిన్న డీలర్లు భారీగా దెబ్బ తింటున్నారు. దేశ వ్యాప్తంగా 15,000 మందికి పైగా డీలర్లు ఉంటే ఇప్పటి వరకు 300 మంది వరకు డీలర్‌షిప్‌లు వదులుకున్నారు. అమ్మకాలు లేక, బ్యాంకుల నుంచి వర్కింగ్‌ క్యాపిటల్‌ అందక చిన్న డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరుణ్‌ మోటార్స్‌ ఎప్పుడూ ఇటువంటి సంక్షోభాల సమయంలోనే భారీగా విస్తరణ కార్యక్రమాలు చేపట్టేది. ఈ సమయంలో తయారీ సంస్థల నుంచి ఆఫర్లు బాగుంటాయి. కానీ ఇప్పుడు పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఒకటి రెండు నెలల్లో పరిస్థితులను గమనించాకే విస్తరణపై ఒక స్పష్టత వస్తుంది.
    – ప్రభుకిషోర్, చైర్మన్, వరుణ్‌ గ్రూపు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా